
తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు కుర్ర హీరోయిన్లతో కలిసి డాన్సులేసిన విషయం తెలిసిందే. ఆయా షూటింగ్‌లు అయిపోయాక ఆ కథానాయికలే తమకన్నా వేగంగా ఆయన నృత్యాలు చేశారని కితాబులిచ్చేవారు. ఇప్పుడు అదే పద్ధతిలో అమితాబ్‌బచ్చన్ డాన్సులకు అనేక కితాబులు లభిస్తున్నాయి. ప్రస్తుతం 71 ఏళ్ళ వయస్సులోవున్న ఆయన వయసు టీనేజ్‌లోనే ఉందట. తెల్లగెడ్డంతో ఇప్పటికీ కుర్రాడిలా ఆయ చేస్తున్న డాన్సులు కుర్రాళ్ళను కూడా మరిపిస్తున్నాయట. ‘్భత్‌నాథ్ రిటర్న్’ చిత్రంలో ఓ డాన్సు కోసం కొరియోగ్రాఫర్లు మర్చిపోయి కంపోజ్ చేసిన కష్టతరమైన నృత్యాలను అవలీలగా చేశారట ఆయన. ఈ నృత్యాలు చేసేటప్పుడు తన వయస్సు మర్చిపోయానని, అయినా కూడా ఆ నృత్యాలంటే తనకు బాగా ఇష్టమని, ఇలా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అమితాబ్ వ్యాఖ్యానించడం విశేషం. మరో దశాబ్దంపాటు నటించగలనన్న ధైర్యం కూడా వచ్చిందని చెప్పడం మరో విశేషం.
ఏం టైటిల్ దేవా?
ప్రభుదేవా హిందీలో ఏ చిత్రానికి దర్శకత్వం వహించినా ఆ చిత్రానికి సంబంధించి ఏదో గొడవ జరుగుతూనే వుంటుంది. గతంలో ఆయన రూపొందించిన ‘రాంబో రాజ్‌కుమార్’ విషయంలో కూడా పేరుకోసం గొడవలయ్యాయి. చివరికి ఆ చిత్రానికి ఆర్ రాజ్‌కుమార్‌గా మార్చుకున్నారు. ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న ఓ చిత్రానికి యాక్షన్ జాక్సన్ పేరును నిర్ణయించారు. అజయ్‌దేవ్‌గన్, సోనాక్షి సిన్హా, యామీ గౌతమ్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ తమ సంస్థ పేటెంట్ అని, దానిని చిత్రం పేరుగా ఉపయోగించుకోరాదంటూ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రభుదేవాకు, చిత్ర నిర్మాతకు శ్రీముఖాలు పంపించింది. అలా వాడినట్టయితే చట్టప్రకారం తాము తీసుకునే చర్యలకు వారు బాధ్యులని ఆ నోటీసు సారాంశం. ఈవిషయంపై ప్రభుదేవా ముంబైలో పలు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయానికి హాలీవుడ్ సంస్థ కూడా బదులు చెప్పింది. త్వరలో ఈ చిత్రం పేరును కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూస్తుంటే ప్రభుదేవా చిత్రం ప్రమోషన్ కోసం సరికొత్త ఫార్ములా కనిపెట్టినట్లు లేదూ!