భువనగిరి, ఫిబ్రవరి21: క్షణికావేశంలో తన తల్లితోపాటు చెల్లెలిపై కిరోసిన్ పోసి అనంతరం తాను కూడా ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడి సంఘటన శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా భువనగిరిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి పట్టణంలోని బాహర్‌పేట కాలనీలో మేస్ర్తి పని చేస్తున్న చెలిమెల లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్(29) టెన్త్ వరకు చదివిన అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కాంట్రాక్టు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండో కుమార్తె చెలిమెల కీర్తి(22) రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలోని మథర్‌థెరిస్సా కళాశాలలో ఎంబిఎ ద్వితీయ సంవత్సరం చదువుతుంది.
కాగా కీర్తి గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని యువకుడితో నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతోంది. దీన్ని గమనించిన కిరణ్‌కుమార్ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడే వ్యక్తి గురించి సోదరిని నిలదీశాడు. దీంతో అన్నాచెల్లెలికి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుండగా అక్కడే ఉన్న తల్లి ఇందిరా(50) వచ్చి ఇరువురుని సముదాయిస్తుండగా మనస్థాపానికి గురైన కిరణ్‌కుమార్ ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకువచ్చి తన చెల్లెలిపై పోశాడు. దీంతో అడ్డుపడిన తల్లిపై కూడా కిరోసిన్ పోసి అనంతరం తాను కూడా పోసుకుని బెదిరించడానికి ప్రయత్నించాడు. కాగా అన్న చర్యలపై మనస్థాపానికి గురైన సోదరి కీర్తి వెంటనే వంటింట్లోకి వెళ్లి అగ్గిపెట్టె తీసుకువచ్చి అగ్గిపుల్ల వెలిగించడంతో అక్కడే కిరోసిన్ పోసుకుని ఉన్న కిరణ్‌తోపాటు తల్లి ఇందిరా, చెల్లెలు కీర్తిలు 90శాతం కాలిపోయారు. దీంతో ఆరుబయట స్థానికులతో మాట్లాడుతున్న కిరణ్ తండ్రి లక్ష్మయ్య ఇంట్లో అగ్నికి ఆహుతవుతున్న భార్య, కుమారుడు, కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించగా అతను కూడా స్వల్పంగా గాయాలపాలయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని సందర్శించిన పట్టణ సి ఐ మధుసూదన్‌రెడ్డి తీవ్రగాయాలకు గురైన కిరణ్, కీర్తి, ఇందిరాలను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
చెల్లి, తల్లిపై కిరోసిన్ పోసి యువకుడి ఆత్మహత్యాయత్నం నల్లగొండ జిల్లాలో విషాదం * ముగ్గురి పరిస్థితి విషమం
english title:
k
Date:
Saturday, February 22, 2014