ఏలూరు, ఫిబ్రవరి 24: జిల్లాలో 16వ సాధారణ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావటంలో తహసీల్దార్లు, ఇతర ఎన్నికల అధికారులు పటిష్టమైన ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టరు, ప్రధాన ఎన్నికల అధికారి సిద్ధార్ధ్‌జైన్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం ఎన్నికల నిర్వహణపై తహసిల్దార్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో కలెక్టరు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిద్ధార్ధ్‌జైన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో అపరిష్కృతంగా ఉన్న క్లయిమ్స్‌ను ప్రస్తుత సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందుగానే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన కనీస వౌలిక సదుపాయాలు ఉన్నది, లేనిది పరిశీలించుకోవాలన్నారు. తహసిల్దార్లు తప్పనిసరిగా తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి సంబంధిత వివరాలను జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నారు. అదేవిధంగా ఉద్యోగుల డేటాబేస్‌ను తక్షణమే ఆప్‌లోడ్ చేయాలన్నారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్లుగా నియమించాల్సి ఉందని, ఇందుకు సంబంధించి తగినంత సిబ్బంది లభ్యం కాని పక్షంలో బ్యాంకు మేనేజర్లు మినహాయించి మిగిలిన బ్యాంకు ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్లుగా నియమించేందుకు గుర్తించాలన్నారు. జిల్లాలో అయా మండలాల పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించటం జరిగిందని, కొత్తగా వచ్చిన తహసిల్దార్లు ఆ ప్రాంతాలపై గట్టి పట్టు సాధించేందుకు చర్యలు తీసుకుంటే బందోబస్తు, ఇతర ఏర్పాట్లకు సులభతరమవుతుందన్నారు. రెండురోజుల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ జిల్లాలో పర్యటించనున్నారని, ఈమేరకు తహసిల్దార్లు అవసరమైన సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని కలెక్టరు ఆదేశించారు. సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టరు నరసింగరావు, డిఆర్వో కె ప్రభాకరరావు సిఆర్‌పిసి సెక్షన్ 133, 107, 108, 109, 111 తదితర అంశాలను వివరించారు. ముఖ్యంగా ఎన్నికల వ్యయ నియంత్రణపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సిబ్బంది ఈ విషయంపై ప్రత్యేకశ్రద్ద చూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు డాక్టరు టి బాబూరావునాయుడు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్
english title:
s
Date:
Tuesday, February 25, 2014