వాషింగ్టన్, మార్చి 4: భారత్‌తో సంబంధాలను మెరుగు పరచుకోవాలని అగ్రరాజ్యమైన అమెరికా ఎంతగానో తహతహలాడుతోంది. గతంలో నెలకొన్న విభేదాలకు స్వస్తివాక్యం పలికి, ఇరు దేశాల మధ్య స్నేహబంధం కొత్త చిగుళ్లు వేయాలని ఆ దేశం భారత్‌కు ఓ దౌత్యవేత్త ద్వారా సందేశం పంపింది. ఇటీవల న్యూయార్క్‌లో భారతీయ మహిళా దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేను అరెస్టు చేశాక ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిషా దేశాయ్ బిశ్వాల్ అనే మహిళా దౌత్యవేత్త ద్వారా భారత్‌కు ఓ సందేశం పంపినట్లు అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి జెన్ సాకీ మీడియాకు తెలిపారు. భారతీయ సంతతికి చెందిన బిశ్వాల్ ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఒకప్పటి విభేదాలను మరచిపోయి, ఉభయ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు బిశ్వాల్ పర్యటన దోహదపడుతుందని సాకీ చెబుతున్నారు. తన పర్యటన సందర్భంగా న్యూఢిల్లీ, బెంగళూరుల్లో నిషా బిశ్వాల్ పర్యటించి భారతీయ అధికారులతో చర్చలు జరుపుతారు. సృజనాత్మకత, సాంకేతిక విజ్ఞానం, వాణిజ్యం, మానవ వనరుల వినియోగం, ఆర్థిక రంగాల్లో ఇరు దేశాలు బలమైన భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆమె దృష్టి సారిస్తారు. భారత్‌తో సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు అమెరికా వ్యూహాత్మకంగా ఈ ప్రయత్నాలను ప్రారంభించింది. ‘బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కూడా నిషా బిశ్వాయ్ కలుస్తారా?’ అని మీడియా ప్రశ్నించగా సాకీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘మా దౌత్యవేత్త భారత్‌లో ప్రముఖులందరినీ కలుస్తారు, భారత్‌లో భావి ప్రధాని ఎవరన్నది అక్కడి ప్రజలు నిర్ణయిస్తారు’ అని ముక్తసరిగా ఆమె సమాధానమిచ్చారు.
భారత్‌తో సంబంధాలను మెరుగు పరచుకోవాలని అగ్రరాజ్యమైన
english title:
friendship
Date:
Wednesday, March 5, 2014