
కేప్‌టౌన్, మార్చి 4: దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. న్యూలాండ్‌లో ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్రు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైర్ అవుతున్నట్లు స్మిత్ ప్రకటించాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక కాలం కెప్టెన్‌గా దక్షిణాఫ్రికాకు సేవలందించిన స్మిత్ హటాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం ఆయన అభిమానులనేకాకుండా సహచరులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తాను సాధించాల్సినవి చాలా ఉన్నాయని గత శుక్రవారం విలేఖరులకు చెప్పిన స్మిత్ అయిదు రోజులు కూడా గడవక ముందే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ప్రముఖ ఆల్‌రౌండర్ జాకస్ కాలిస్ గత డిసెంబర్‌లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు స్మిత్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు గట్టి దెబ్బేనని చెప్పాలి. అయితే గత కొంతకాలంగా బ్యాటింగ్‌లో విఫలమవుతూ ఉన్న స్మిత్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో సైతం మరోసారి ఘోరంగా విఫలమైనాడు. న్యూలాండ్‌లో జరుగుతున్న మూడో టెస్టులో సోమవారం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో స్మిత్ కేవలం అయిదు పరుగులే చేసాడు. ఇది జరిగిన తర్వాత ఇక టెస్టు క్రికెట్‌నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే నిర్ణయానికి స్మిత్ వచ్చాడని, తన నిర్ణయాన్ని సహచరులకు చెప్పాడని తెలుస్తోంది. ‘ఇది నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం. గత ఏడాది ఏప్రిల్‌లో కాలి మడమ అపరేషన్ జరిగినప్పటినుంచి నేను ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను’ అని స్మిత్ సోమవారం చెప్పాడు. తన కుటుంబం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని స్మిత్ అంటూ, తాను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పటినుంచి న్యూలాండ్‌ను తన సొంత ఇల్లుగా భావిస్తున్నానని, అందువల్లనే ఇక్కడే ఈ నిర్ణయం ప్రకటిస్తున్నానని స్మిత్ చెప్పాడు. 11 ఏళ్లపాటు స్మిత్ ప్రస్తుత మ్యాచ్‌తో కలుపుకొని 108 టెస్టులకు దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆలెన్ బోర్డర్ 109 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించి నెలకొల్పిన రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు. అంతేకాదు 53 టెస్టుల్లో తమ జట్టుకు విజయాలు అందించడం ద్వారా టెస్టు కెప్టెన్‌గా రికీ పాంటింగ్ సాధించిన 48 విజయాల రికార్డును సైతం అతనున బద్దలు కొట్టాడు. అతని నాయకత్వంలో దక్షిణాఫ్రికా 27 టెస్టుల్లో ఓడిపోగా, మరో 27 టెస్టులను డ్రా చేసుకుంది.
ఓటమికి ఎదురీదుతున్న సఫారీలు
కాగా, కేప్‌టౌన్‌లో జరుగుతున్న నిర్ణాయక మూడో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఓటమికి ఎదురీదుతోంది. 27 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ (145) సెంచరీతో విజృంభించగా, క్రిస్ రోగెర్స్ 39, అలెక్స్ డూలన్ 37, స్టీవెన్ స్మిత్ 36 (నాటౌట్) పరుగులతో రాణించారు. దీంతో 58 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 303 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా జట్టు తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం 511 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్లు అల్విరో పీటర్సన్ (9), కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (3), డీన్ ఎల్గర్ (0) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరగా, హషీమ్ ఆమ్లా 41 పరుగులు సాధించి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ ఎ.బి.డివిలియర్స్ (16), కైల్ అబోట్ (1) అజేయంగా నిలువడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 71 పరుగులు సాధించిన దక్షిణాఫ్రికా జట్టు ఇంకా 440 పరుగులు వెనుకబడి ఉంది. (చిత్రం) గ్రేమ్ స్మిత్‌కు వీడ్కోలు పలుకుతున్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సభ్యలు