
మధుమేహంవల్ల ఏర్పడే ఇక్కట్లలో డయాబెటిక్ న్యూరోపతి ప్రధానమైనది. దీర్ఘకాలంపాటు మధుమేహంతో సతమతమయ్యే వారికి క్రమంగా నరాలు దెబ్బతినే ఈ స్థితి ప్రాప్తిస్తుంది. నరాలు దెబ్బతినడంవల్ల అవి చేయాల్సిన పనులకు విఘాతం కలుగుతుంది. తిమ్మిర్ల వంటి లక్షణాలే కాకుండా అంతరావయవాల పనితీరులో సైతం లోపం ఏర్పడుతుంది. సమయం గడిచే కొద్దీ నరాలు దెబ్బతినడం ఎక్కువవుతుంది. మధుమేహం బయటపడిన వారిలో పది సంవత్సరాల తరువాత 30 శాతం మందికి, 25 సంవత్సరాల తరువాత 40 శాతం మందికి, 40 సంవత్సరాల తరువాత 50 శాతం మందికి న్యూరోపతి లక్షణాలు కనిపిస్తాయి. ఏ చికిత్సా తీసుకోని వారికి ఈ లక్షణాలు మరింత త్వరితంగా మరింత ఉధృతంగా కనిపిస్తాయి. మధుమేహం అదుపులో ఉండకపోవటం, వయసు 40 సంవత్సరాలు దాటడం, రక్తపోటు అధికంగా ఉండటం, బరువు అధికంగా ఉండటం, కొలెస్టరాల్ హెచ్చు మోతాదులో ఉండటం అనేవి న్యూరోపతి అవకాశాలను ఎక్కువ చేస్తాయి. చికిత్స తీసుకుంటున్నప్పటికీ మధుమేహ వ్యాధిలో ఎంతో కొంత న్యూరోపతి లక్షణాలు అనివార్యమవడంతో ప్రపంచ వ్యాప్తంగా దీనిమీద అధ్యయనాలు, పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆయుర్వేద చికిత్సా విధానంలో కేవలం మధుమేహానికి మాత్రమే కాకుండా, మధుమేహజనిత ఇక్కట్లకు కూడా అధిక ప్రాధాన్యత ఉండటంతో అధ్యయనకారుల దృష్టి ఆయుర్వేద వైద్య విధానంపై పడింది. ఈ నేపథ్యంలో న్యూరోపతికి సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని, వివిధ ఆయుర్వేద చికిత్సా పద్ధతులను, ఔషధాలనూ తెలుసుకుందాం.
కారణాలు
అనేకరకాల అంశాలు మధుమేహంలో నరాలు దెబ్బతినడానికి లేదా న్యూరోపతికి కారణమవుతాయి. రక్తంలో అధికంగా సంచితమైన గ్లూకోజ్ నరాలమీద దాడి చేయటం వెనుక విధి విధానమేమిటన్నది అధ్యయనకారులు పరిశోధిస్తున్నారు.
జీవక్రియకు చెందిన అంశాలు: రక్తంలో చక్కెర నిల్వలు బాగా పెరగటం, దీర్ఘకాలంగా మధుమేహం కొనసాగుతుండటం, ఇన్సులిన్ తక్కువగా విడుదలవ్వటం, రక్తంలో కొవ్వు అధికంగా ఉండటం ఇవన్నీ న్యూరోపతిని కలిగించే అవకాశం ఉంది.
నరాలు, రక్తనాళాలకు చెందిన అంశాలు: నరాలకు, పోషకతత్వాలను, ప్రాణవాయువును అందించే రక్తనాళాలు దెబ్బతినడం.
ఆటోఇమ్యూనిటికి చెందిన అంశాలు: వ్యాధిరక్షణ శక్తి వికటించి నరాలు దెబ్బతినడం.
దెబ్బలు, గాయాలు: కార్పెల్ టెనె్నల్ సిండ్రోమ్ (మణికట్టులో నరాలు నలగటం), సయాటికా (నడుములో నరాలు ఒరుసుకుపోవటం) వంటి వ్యాధుల్లో నరాల ముందు నుంచే దెబ్బతిని ఉంటాయి. పై నుంచి మధుమేహం తోడైతే సమస్యలు ద్విగుణీకృతమవుతాయి.
అనువంశికత: మధుమేహంతోపాటు న్యూరోపతి ఇతివృత్తం కుటుంబంలో ఉండి ఉండటం.
జీవనవిధానానికి చెందిన అంశాలు: ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉండటం.
లక్షణాలు
న్యూరోపతి లక్షణాలు ఆయా సందర్భాలకు అనుగుణంగా రకరకాలుగా ప్రదర్శితమవుతుంటాయి. ఏ నరం దెబ్బతిన్నది, ఎంత స్థాయిలో దెబ్బతిన్నది అనే దానిని అనుసరించి లక్షణాలు మారుతుంటాయి. కాళ్ళలో మొద్దుబారటం, నొప్పి, తిమ్మిర్లు అనేవి ప్రథమ ధవలో కనిపించే లక్షణాలు, మొదట్లో చాలామంది ఈ లక్షణాలను గుర్తించలేరు. చాలాకాలంపాటు ప్రారంభ లక్షణాలు అప్రధానంగా కొనసాగుతాయి. పోనుపోను జ్ఞాన/ ప్రేరక (సెన్సరి/ మోటార్) నాడీ వ్యవస్థ, స్వయంప్రేరిత/అసంకల్పిత (అటనామస్/ ఇన్వాలెంటరి) నాటి వ్యవస్థలు ప్రభావితమై సార్వదైహిక లక్షణాలు బహిర్గతమవుతాయి.
మధుమేహంలో ఏర్పడే నరాల సమస్యలను నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి, పెరిఫిరల్, అటనామిక్, ప్రాక్సిమల్, ఫోకల్ న్యూరోపతిలు. వీటిలో ఒక్కోరకం ఒక్కోరకమైన లక్షణాలను ప్రదర్శిస్తుంది.
అటనామిక్ న్యూరోపతి (స్వయంచోదిత నాడీ విధి నిర్వాహక లోపం): ఈ సమస్య ఉన్న వారికి ఊపిరితిత్తులు, గుండె, ఆమాశయం, పేగులు, మూత్రాశయం, జననేంద్రియాలు వ్యాధిగ్రస్తమవుతాయి. రక్తపోటులో మార్పులు చోటుచేసుకోవడం, గుండెపనితీరు దెబ్బతినడం, రక్తంలో చక్కెర నిల్వల్లో మార్పులు సంభవించటం ఇవి మాత్రమే కాకుండా పాచనశక్తి, మూత్రవిసర్జన విధానం, లైంగిక స్పందన, కంటిచూపువంటి వాటిల్లో కూడా పెను మార్పులు సంభవిస్తాయి. వీటిని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం.
1. మామూలు వ్యక్తుల్లో రక్తంలో చక్కెర తగ్గి హైపోగ్లైసీమియా ఏర్పడితే శరీరం చెమటలు పట్టడం, గుండెదడ వంటి ప్రమాద సంకేతాలను పంపుతుందన్న సంగతి తెలిసిందే. దీనితో అప్రమత్తమవ్వడానికి అవకాశముంటుంది. అయితే, అటనామిక్ న్యూరోపతిలో ఈ ప్రమాద సూచన వ్యవస్థ దెబ్బతింటుంది. దీని ఫలితంగా షుగరు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోయినప్పటికీ గుర్తించలేరు. దీనితో అనేక చిక్కులు వస్తాయి.
2. శరీరంలో రక్త సంచారానికి కారణం గుండె, రక్తనాళాలు కారణమున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థను నడిపించే నరాలు దెబ్బతినడంవల్ల గుండె స్పందనలు, రక్త్భారం అస్తవ్యస్తమవుతాయి. దీంతో కూర్చోవటం, నిలబడటం వంటివి చేసినప్పుడు బి.పి. హఠాత్తుగా తగ్గిపోయి కళ్లు తిరిగే అవకాశం ఉంది. ఒక్కోసారి స్పృహ కూడా తప్పవచ్చు. పోతే, నరాలు దెబ్బతినడం వల్ల నాడీస్పందనల వేగం శారీరక శ్రమతో నిమిత్తం లేకుండా ఎల్లప్పుడూ అదే స్థాయిలో ఉంటుంది.
3. ప్రాచీన వ్యవస్థను నడిపించే నరాలు దెబ్బతినడంవల్ల మలబద్దకం ప్రాప్తించే అవకాశం ఉంది. ఆయాశం మందకొడిగా పనిచేయడంవల్ల ఆహారం నెమ్మదిగా కదులుతుంది (గ్యాస్ట్రోప్యారిసిస్). దీని కారణంగా అన్ని వేళలా వాంతులు, వికారం, కడుపు ఉబ్బరింపు, ఆకలి తగ్గటం వంటివి ఇబ్బంది పెడతాయి. పేగుల్లో ఆహారపు కదలిక నెమ్మదిగా జరగడంవల్ల అది రక్తంలోకి విలీనమయ్యే వేగంలో మార్పులు సంభవించి చక్కెర నిల్వలను మారుస్తుంది. అన్ననాళానికి వెళ్లే నరాలు సైతం దెబ్బతినడంవల్ల మింగటం కష్టమవుతుంది. పెద్దపేగును చేరుకునే నరాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి మలబద్దకంతో పాటు విరేచనాలు కూడా మార్చి మార్చి కలుగుతుంటాయి. రాత్రిపూట విరేచనాలవ్వటం ఈ స్థితిలో కనిపించే ప్రధాన లక్షణం. ఈ సమస్యలన్నింటి కారణంగా బరువు తగ్గిపోతారు.
4. నరాలు దెబ్బతినడంవల్ల మూత్ర వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. మూత్రవిసర్జన సంపూర్ణంగా జరగదు. దీనితో మూత్రకాశంలో బ్యాక్టీరియా చేరి తరచుగా ఇనె్ఫక్షన్లు ఏర్పడుతుంటాయి. నరాలు సరిగా పనిచేయనందున మూత్రవిసర్జన మీద నియంత్రణ పోతుంది. ఈ స్థితి ఉన్నవారికి లైంగిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కోరిక యథాతధంగా ఉన్నప్పటికీ చేతల ప్రతిస్పందన తగ్గిపోతుంది. పురుషుడిలో అంగస్థంభన సమస్యలు, శుక్రస్కలన సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో భావప్రాప్తి, ప్రతిస్పందన, యోనిస్రావాల విడుదల వంటివి తగ్గిపోతాయి.
5. నరాలు దెబ్బతినడం వల్ల స్వేదగ్రంథులు కూడా ప్రభావితమవుతాయి. దీంతో శారీరక ఉష్ణోగ్రత అదుపుతప్పుతుంది. చెమటలు ధారలుగా కారుతుంటాయి. రాత్రిపూట చెమటలు ఎక్కువగా పట్టడం, ఆహారం తింటున్నప్పుడు చెమట తలనుంచీ హెచ్చుమొత్తాల్లో కారడం అనేవి దీనిలో ముఖ్యలక్షణాలు.
6. చివరగా, ఈ రకం న్యూరోపతిలో కళ్లు సైతం దెబ్బతింటాయి. ముఖ్యంగా కంటిపాపల సంకోచ వ్యాకోచాలపైన ప్రభావం పడుతుంది. దీని ఫలితంగా చీకటిగా ఉన్నప్పుడు హఠాత్తుగా వెలుతురు పడితే చూపు తగ్గుతుంది. రాత్రిపూట లైట్లకాంతిలో వాహనం నడపటం కష్టమవుతుంది.
ప్రాక్సిమల్ న్యూరోపతి (సమీపస్థ నాడీవిధి నిర్వాహక లోపం): దీనిలో ముందుగా తొడలు, తుంటి, పిరుదులు, కాళ్లలో నొప్పి మొదలవుతుంది. సాధారణంగా నొప్పి అనేది శరీరంలో ఒక పక్కనే కేంద్రీకృతమవుతుంది. దీనివలన కాళ్లు బలహీనపడే అవకాశం ఉంది. ఆసరా లేకుండా కూర్చున్నచోట నుంచీ లేవడం కష్టమవుతుంది.
ప్రాథమిక దశలో ఎలా గుర్తుపట్టాలి?
న్యూరోపతి పూర్తిస్థాయిలో దాడిచేయక ముందే గుర్తించగలిగితే నరాలు దెబ్బతినడాన్ని నివారించుకోవచ్చు. వెంట్రుకలు దువ్వుకునే బ్రష్‌లో ఉండేలాంటి నైలాన్ ఫిలమెంట్‌తో కాలు పాదం మీద రాయాలి. ఒకవేళ స్పర్శ తెలవకపోతే న్యూరోపతి ఉన్నట్లు అర్థం. అలాగే ట్యూనింగ్ ఫోర్క్‌ను ఉత్తేజితం చేసి చర్మంపైన ఆనించాలి. ఒకవేళ వైబ్రేషన్ గ్రహించలేకపోతే నరాలు వ్యాధిగ్రస్తమయ్యాయని అర్థం.
చికిత్స
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవటం అన్నిటికన్నా ముఖ్యం. అలాగే సందర్భాన్నిబట్టి లాక్షణిక చికిత్సలను నిలకడగా తీసుకోవాలి.
కాళ్లు, పాదాల సంరక్షణ
మధుమేహ జనిత నరాల సమస్యలున్న వారు పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాదాల్లోని నరాలు శరీరంలో అన్నిటికంటే పొడవుగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి శరీరంలో ఇతర నరాలకంటే ఎక్కువగా వ్యాధి ప్రభావానికి లోనవుతాయి. స్పర్శ సరిగా ఉండదు కాబట్టి పాదాలపైన గాయాలవ్వటానికి అవకాశా లు ఎక్కువ. ఒక్కోసారి గ్యాంగ్రిన్ తయారై పాదాలను తొలగించాల్సి రావచ్చు కూడా. అయితే, సరైన సంరక్షణ చర్యలతో యాంప్యూటేషన్ (శరీర భాగాలను తొలగించడం) శస్త్ర చికిత్సలను చాలా వరకూ నిరోధించుకోవచ్చు.
1. ప్రతిరోజూ పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. గోరు వెచ్చని నీళ్లను మృదువైన సబ్బును వాడాలి. పాదాలను నీళ్లలో నానబెట్టకూడదు. ఒకవేళ నానబెడితే ఫంగస్ చేరుతుంది. పాదాలను కడుక్కున్న తరువాత మెత్తగా, పొడిగా ఉండే బట్టతో తుడుచుకోవాలి. వేళ్ళ మధ్య తుడుచుకోవడం మర్చిపోకూడదు.
2. ప్రతిరోజూ పాదాలను జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. గాయాలు, దెబ్బలు, పుండ్లు, ఎరుపుదనం, ఆనెకాయల వంటివి ఉన్నాయేమో చూడాలి. ఒకవేళ అరికాళ్లను పరీక్షించుకోవడం కష్టమనిపిస్తే పాదాల కింద ఒక అద్దాన్ని ఉంచుకోవచ్చు.
3. పాదాలను జాత్యాది తైలంతో మర్ధన చేసుకోవాలి.
4. స్నానం చేసిన వెంటనే ఆనెలను, ఇతర చర్మ కీలలను వ్యూమస్ రాయితో అరగదీయాలి.
5. గోళ్ళను జాగ్రత్తగా కత్తిరించి, వాడిగా లేకుండా అరగదీయాలి.
6. పాదాలకు సరిపోయే సైజుగల బూట్లను, సాక్సులను ధరించాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పాదరక్షలు ధరించడం అవసరం.
7. బూట్లు ధరించినప్పుడు ముందుభాగంలో పాదం వేళ్లను తేలికగా కదిలించగలుగుతున్నారా అనేది చూసుకోవాలి. ఒకవేళ కొత్తబూట్లు కొన్నట్లయితే రోజుకు ఒక గంట చొప్పున ధరిస్తూ క్రమంగా అలవాటు చేసుకోవాలి.
8. పాదరక్షలు ధరించబోయే ముందు బాగా దులపాలి. బూట్లలోనికి చెయ్యి పోనిచ్చి లోపల పదునుగా, మొనతేలి ఉన్న భాగాలేవీ లేవని రూఢీచేసుకోవాలి.
నొప్పి నుంచి ఉపశమనం
1. వేదనాహర ఔషధాలు వైద్య సలహాను అనుసరించి వాడాలి. వాతచింతామణిరసం, వాదవిధ్యంసి, వాతగజాంకుశరసం వంటివి న్యూరోపతిలో ప్రత్యేకించి ప్రయోజనాన్ని ఇస్తాయి.
2. సత్వావజయ చికిత్సలు న్యూరోపతిలో విశేష ప్రయోజనాన్ని ఇస్తాయి. హిప్నాసిస్ (మనసును హితకరమైన విషయాల మీద లగ్నం చేయడం), గైడెడ్ ఇమేజరి (సంతోషాన్ని, ఉత్తేజాన్ని కలిగించే విషయాలను మాత్రమే ఊహించుకోవడం, లేదా తలచుకోవడం) ఇవన్నీ సత్వావజయ చికిత్సల కోవలోనికి వస్తాయి.
3. రిలాక్సేషన్ ట్రైనింగ్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధ్యానం, మంత్రం, జపం వంటి మనోసంబంధ అంశాలతోపాటు చక్కని సంగీతం వినడం, పిల్లలు, మూగజీవాలతో గడపటం, మనోదారుఢ్యాన్ని ఇచ్చే ఆటలు ఆడటం, నడక, వ్యాయామం చేయడం వీటన్నిటి ద్వారా రిలాక్స్ అవ్వగలిగితే న్యూరోపతి లక్షణాలు చాలావరకూ నియంత్రణలో ఉంటాయి.
4. బయోఫీడ్‌బ్యాక్ అనేది కూడా చాలా చక్కని చికిత్సాప్రక్రియ. ఇది ఒక రకం రిలాక్సేషన్ విధానం. 1*
పెరిఫిరల్ న్యూరోపతి (పరధీమ నాడీవిధినిర్వాహక లోపం): దీనిలో కాళ్లు, చేతులు, హస్తపాదాలకు వెళ్లే నరాలు దెబ్బతింటాయి. చేతుల్లోని నరాలకంటే కాళ్లలోని నరాలు ముందుగా వ్యాధి ప్రభావానికి గురవుతాయి. ఈ తరహా న్యూరోపతిలో మొద్దుబారినట్లు ఉండటమనేది ప్రధాన లక్షణం. ఏదైనా మొనదేలిన వస్తువు గుచ్చుకున్నా, వేడి పదార్థం తగిలి గాయమైనా గుర్తించలేరు. తిమ్మిర్లు, మంటలు, పోట్లు ఉంటాయి. కండరాలు తరచుగా పట్టేస్తుంటాయి. చిన్నపాటి ఒత్తిడితో కూడిన స్పర్శను కూడా తట్టుకోలేరు. శరీరంలో వివిధ భాగాల మధ్య సమన్వయం దెబ్బతింటుంది. ఈ లక్షణాలు రాత్రిపూట మరీ తీవ్రంగా ఉంటాయి. నరాలకు, కండరాలకు మధ్య సమన్వయం దెబ్బతినడంవల్ల కండరాలు క్రమంగా బలహీనపడతాయి. ముఖ్యంగా కాళ్ల చీలమండల కండరాలు దెబ్బతిని నడిచే పద్ధతిలో మార్పు చోటుచేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో పాదం వంకర తిరిగి హామర్ టో లేదా మిడ్‌ఫుట్ కొలాప్స్ వంటివి ఏర్పడతాయి. నొప్పి తెలియకపోవడంవల్ల నిరంతరమూ ఒత్తిడి పడి పాదాలపైన నీటి బొబ్బలు తయారవుతాయి. ఒకవేళ వీటిని కూడా సకాలంలో గుర్తించకపోతే ఇనె్ఫక్షన్ పెరిగిపోయి గ్యాంగ్రిన్ ఏర్పడుతుంది. ఇది ప్రాణప్రమాదమన్న సంగతి తెలిసిందే.
ఫోకల్ న్యూరోపతి (కేంద్రీకృత నాడీవిధి నిర్వాహక లోపం): కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా ఏదో ఒక నరం మధుమేహ వ్యాధి ప్రభావానికి లోనై దెబ్బతింటుంది. దీనిలో కళ్లను కేంద్రీకరించ లేకపోవటం, దృశ్యం రెండుగా కనిపించడం, కళ్ల వెనుక నొప్పి, ముఖం ఒక పక్కకు లాగెయ్యటం (ఫేషియల్ పెరాల్సిస్), నడుము నొప్పి, తొడముందు భాగంలో నొప్పి, ఛాతినొప్పి, ఉదరశూల, పాదాల నొప్పి వంటివి బాధిస్తాయి. లక్షణాలు దెబ్బతిన్న నరాలను బట్టీ మారతాయి.