
మీర్పూర్ (బంగ్లాదేశ్), మార్చి 4: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు బుధవారం తమ చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో ‘జెయింట్ కిల్లర్’గా పేరొందిన అఫ్గానిస్తాన్ జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను ఇప్పటికే దాదాపు పూర్తిగా చేజార్చుకున్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఇంతకుముందు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ప్రస్తుతం వరుస ఓటములతో డీలా పడిన విషయం తెలిసిందే. అయితే బుధవారం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను ఓడించడంతో పాటు బోనస్ పాయింట్‌ను కూడా కైవసం చేసుకుని పరువు నిలబెట్టుకోవాలని విరాట్ కోహ్లీ సేన ఎదురుచూస్తోంది. నెట్ రన్‌రేట్‌లో పాకిస్తాన్‌ను అధిగమించడంతో పాటు ఈ టోర్నీలో ఇతర గణాంకాలు అనూహ్య రీతిలో మారితే తప్ప భారత జట్టు ఫైనల్‌కు చేరే అవకాశాలు లేవు. బంగ్లాదేశ్ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్‌ను ఓడిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఈ టోర్నీలో ఇంతకుముందు నాలుగుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన శ్రీలంక జట్టు సోమవారం అఫ్గానిస్తాన్‌తో ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌లో వరుసగా మూడో విజయాన్ని సాధించడంతో పాటు బోనస్ పాయింట్‌ను కూడా కైవసం చేసుకుని ఇప్పటికే ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్న విషయం విదితమే. అయితే పక్షం రోజుల కంటే తక్కువ వ్యవధిలో ట్వంటీ-20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తలపడేందుకు మళ్లీ బంగ్లాదేశ్‌కే రావలసి ఉన్న భారత జట్టుకు బుధవారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. ట్వంటీ-20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ నెల 21వ తేదీన ఇదే వేదికపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరును ఆరంభించడానికి ముందు భారత జట్టు ఈ నెల 17, 19 తేదీల్లో శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లతో రెండు సన్నాహక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
కోహ్లీకి రాయుడు మద్దతు
ఇదిలావుంటే, ఆసియా కప్ క్రికెట్‌లో భారత జట్టు గత రెండు లీగ్ మ్యాచ్‌లలో శ్రీలంక, పాకిస్తాన్ చేతుల్లో వరుస పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జట్టులోని ఇతర సభ్యులకు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు బాసటగా నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో కోహ్లీతో పాటు జట్టులోని ఆటగాళ్లంతా శక్తివంచన లేకుండా ఆడుతున్నారని రాయుడు మంగళవారం మీర్పూర్‌లో విలేఖర్లతో అన్నాడు. ‘కోహ్లీ ఎంతో గొప్ప ఆటగాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి అతను ఎంతో నేర్చుకున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోహ్లీ ఎంతో చక్కగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి ఎదురైనప్పటికీ జట్టులోని ఆటగాళ్లంతా శక్తివంచన లేకుండా ఆడుతున్నారు’ అని రాయుడు తెలిపాడు. ఎడతెరిపిలేని అంతర్జాతీయ షెడ్యూళ్లతో కొంత మంది సహచర ఆటగాళ్లు మానసికంగా అలసిపోవడమే భారత జట్టు ఓటములకు కారణమని రాయుడు చెప్పాడు. ‘భరత్ నుంచి దక్షిణాఫ్రికాకు, అక్కడి నుంచి న్యూజిలాండ్‌కు, ఆ తర్వాత ఇక్కడికి మేము విశ్రాంతి లేకుండా ప్రయాణించాం. న్యూజిలాండ్ నుంచి వచ్చిన రెండు రోజులకే మేము ఇక్కడ మొదటి మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఎడతెరిపిలేని ఈ వరుస ప్రయాణాల వలన భారత జట్టులోని కొంత మంది ఆటగాళ్లు మానసికంగా అలసిపోయారు’ అని రాయుడు అన్నాడు.