
మీర్పూర్ (బంగ్లాదేశ్), మార్చి 4: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకుంది. మీర్పూర్‌లోని షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో మంగళవారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 3 వికెట్ల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్‌పై విజయం సాధించి శ్రీలంకతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు మునుపెన్నడూ లేని రీతిలో అద్భుతంగా రాణించి 3 వికెట్లకే 326 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ కడదాకా పోరాడిన పాకిస్తాన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు సాధించి లక్ష్యాన్ని అధిగమించింది. పాక్ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (103), దూకుడుగా ఆడిన మాజీ కెప్టెన్ షహీద్ అఫ్రిదీ (25 బంతుల్లో 59 పరుగులు) తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు అనముల్ హక్, ఇమ్రుల్ కరుూస్ ఆరంభం నుంచే పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు తీయించారు. క్రీజ్‌లో నిలదొక్కుకుని చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు తొలి వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి గట్టి పునాది వేశారు. అనంతరం ఇమ్రుల్ కరుూస్ (59) మొహమ్మద్ తల్హా బౌలింగ్‌లో వికెట్ల వెనుక ఉమర్ అక్మల్‌కు దొరికిపోగా, అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మొమినుల్ హక్ క్రీజ్‌లో నిలదొక్కుకుని అనముల్ హక్‌కు సహకారాన్ని అందించాడు. దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్న అనముల్ 131 బంతుల్లో సెంచరీ సాధించడమే కాకుండా రెండో వికెట్‌కు మరో 54 పరుగులు జోడించి సరుూద్ అజ్మల్ బౌలింగ్‌లో అహ్మద్ షెహజాద్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఆ తర్వాత కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్‌తో కలసి మూడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన మొమినుల్ హక్ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సరుూద్ అజ్మల్ బౌలింగ్‌లో మహ్మద్ హఫీజ్ చేతికి చిక్కినప్పటికీ అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షకీబ్ అల్‌హసన్ (44), ముష్ఫికర్ రహీమ్ (51) కూడా పాక్ బౌలర్లపై విరుచుకుపడి 77 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 326 పరుగుల భారీ స్కోరు సాధించింది. వనే్డల్లో బంగ్లాదేశ్ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే.
అనంతరం 327 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఓపెనర్లు అహ్మద్ షెహజాద్, మహమ్మద్ హఫీజ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. 97 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన అందించిన అనంతరం హఫీజ్ (52) మొమినుల్ హక్ బౌలింగ్‌లో ఇమ్రుల్ కరుూస్‌కు దొరికిపోగా, అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ మిస్బా ఉల్‌హక్ (4), షోయబ్ మక్సూద్ (2) స్వల్ప స్కోర్లకే త్వరత్వరగా పెలివియన్‌కు చేరారు. దీంతో ఎనిమిది పరుగుల వ్యవధిలోనే పాక్ రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఫావద్ ఆలమ్ నుంచి సహకారం లభించడంతో సెంచరీ పూర్తిచేసిన అహ్మద్ షెహజాద్ నాలుగో వికెట్‌కు 105 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించి 103 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అబ్దుర్ రజాక్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరగ్గా, అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అబ్దుర్ రెహ్మాన్ కేవలం 8 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఈ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన షహీద్ అఫ్రిదీ కొద్దిసేపు దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లో 59 పరుగులు సాధించడంతో పాటు ఆరో వికెట్‌కు 69 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించి రనౌట్‌గా నిష్క్రమించగా, ఫావద్ ఆలమ్ 74 పరుగులు సాధించి మరో రెండు బంతుల్లో మ్యాచ్ ముగియనున్న తరుణంలో రనౌట్ అయ్యాడు. అయితే వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ (14), ఉమర్ గుల్ (0) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేయడంతో 49.5 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 329 పరుగులు సాధించిన పాకిస్తాన్ జట్టు మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది. (చిత్రం) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షహీద్ అఫ్రిదీ
సంక్షిప్తంగా స్కోర్లు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 326/3 (అనముల్ హక్ 100, ఇమ్రుల్ కరుూస్ 59, మొమినుల్ హక్ 51, ముష్ఫికర్ రహీమ్ 51-నాటౌట్, షకీబ్ అల్‌హసన్ 44-నాటౌట్).
వికెట్ల పతనం: 1-150, 2-204, 3-249.
బౌలింగ్: సరుూద్ అజ్మల్ 2/61, మొహమ్మద్ తల్హా 1/68.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 49.5 ఓవర్లలో 329/7 (అహ్మద్ షెహజాద్ 103, మహ్మద్ హఫీజ్ 52, ఫావద్ ఆలమ్ 74, షహీద్ అఫ్రిదీ 59, ఉమర్ అక్మల్ 14-నాటౌట్).
వికెట్ల పతనం: 1-97, 2-102, 3-105, 4-210, 5-225, 6-294, 7-325.
బౌలింగ్: మొమినుల్ హక్ 2/37, మహ్మదుల్లా 1/47, షకీబ్ అల్‌హసన్ 1/53, అబ్దుర్ రజాక్ 1/72.