
న్యూఢిల్లీ, మార్చి 4: నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో మే 31వ తేదీ నుంచి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) నిర్వహించే ప్రపంచ కప్ పోటీల కోసం 33 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసినట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) మంగళవారం ప్రకటించింది. డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్, డిఫెండర్ గుర్‌బజ్ సింగ్ తదితరులు ఈ ప్రాబబుల్స్‌లో ఉన్నారు. వీరంతా ఈ నెల 9వ తేదీ నుంచి న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ప్రారంభమయ్యే సన్నాహక శిబిరంలో పాల్గొంటారు. నెల రోజుల పాటు సాగే ఈ సన్నాహక శిబిరం ఏప్రిల్ 10వ తేదీన ముగుస్తుంది. భారత జట్టు 2012 ఒలింపిక్ క్రీడల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నప్పటి నుంచి సందీప్, గుర్‌బజ్ జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పేలవమైన ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న గోల్‌కీపర్ పి.టి.రావుకు ఉద్వాసన పలికి హాకీ ఇండియా లీగ్‌లో కళింగ లాన్సర్‌కు ప్రాతినిథ్యం వహించిన వర్థమాన ఆటగాడు హర్‌జోత్ సింగ్‌కు ప్రాబబుల్స్ జాబితాలో చోటు కల్పించారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర క్రీడాకారుల్లో మిడ్‌ఫీల్డర్లు గురీందర్ సింగ్, విక్రమ్ కాంత్, జస్జీత్ సింగ్, యువ ఫార్వర్డ్ ఆటగాళ్లు తల్వీందర్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్ తదితరులు ఉన్నారు. గత నెల 25వ తేదీన జరిగిన సమావేశంలో హాకీ ఇండియా హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ రోలెంట్ ఓల్ట్‌మాన్స్, భారత పురుషుల సీనియర్ హాకీ జట్టు ప్రధాన కోచ్ టెర్రీ వాల్ష్, కేంద్ర ప్రభుత్వ పరిశీలకుడు హర్బీందర్ సింగ్ ఈ ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు.
ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బెల్జియం, స్పెయిన్, మలేషియాతో పాటు పూల్-ఎలో ఉన్న భారత జట్టు మే 31వ తేదీన జరిగే తొలి మ్యాచ్‌లో బెల్జియం జట్టుతోనూ, ఆ తర్వాత ఇంగ్లాండ్ (జూన్ 2న), స్పెయిన్ (జూన్ 5న), మలేషియా (జూన్ 7న), ఆస్ట్రేలియా (జూన్ 9న) జట్లతో తలపడుతుంది. (చిత్రం) చోటు దక్కించుకున్న సందీప్