
సాధారణంగా మనకు 50 ఏళ్ళు వయస్సు తరువాత శరీరంలో అన్ని అవయవాలతోపాటు పళ్ళు పటిష్టత కూడా సన్నగిల్లుతూ ఒక్కొక్క పన్ను, ఒకటి తరువాత ఒకటి కదులుతూ చివరకు ఊడిపోతుంటాయి. కొంతమందికి ముందరి పళ్ళు ఊడిపోతుంటాయి, కొంతమందికి వెనుక దంతాలు ఊడిపోతుంటాయి. ముందరి పళ్ళు ఊడిపోతే చూడటానికి ముఖం అపసవ్యంగా ఉండటంవలన నలుగురి ముందు మాట్లాడటానికి, నవ్వటానికి సిగ్గుపడుతుటారు. అట్లాగే వెనుక పళ్ళు, దంతాలు ఊడిపోతే నమలటానికి ఇబ్బంది పడుతూ, నమలలేక మింగేస్తుంటారు. దీనితో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటంవలన అజీర్ణం, నీరసం వచ్చి బలహీనతకు లోనుకావడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మానసికంగా బాధపడుతూ ఉంటారు.
ఆధునిక యుగంలో పళ్ళులేనివారు ఏ విధంగాను బాధ, చింతించవలసిన పనిలేదు. పళ్ళు ఏవిధంగా లోపించినా, ఎన్ని లోపించినా అన్ని పళ్ళను మరలా యధాతథంగా తీసి మరలా పెట్టుకునే పద్ధతి కాకుండా ఫిక్స్‌డ్ కృత్రిమ పళ్ళు అతికించవచ్చును. వీటినే ‘్ఫక్స్‌డ్ కృత్రిమ పళ్ళు’ లేక బ్రిడ్జ్ అంటారు. అంటే ఈ పళ్ళు ఒకసారి (్ఫక్స్) అతికించినట్లైతే అవి మరలా మనం తీయటానికి రావు. అవి ఒరిజినల్ పళ్ళ మాదిరిగా ఉండి, చూడటానికి అందంగాను, నమలటానికి అనువుగాను ఉంటాయి.
బ్రిడ్జ్ అంటే ఏమిటి?
బ్రిడ్జ్ అంటే కృత్రిమ ఫిక్స్‌డ్ పళ్ళు. ఈ బ్రిడ్జ్‌ను కట్టించుకోవాలంటే ఒకటి రెండు పళ్ళు అంతకంటే ఎక్కువ పళ్ళు లోపించినప్పుడు, ఆ పళ్ళను భర్తీ చేస్తూ ఇరుప్రక్కల ఉన్న పళ్ళకు తొడుగు సహాయంతో కలిపి ఉన్న పళ్ళు సముదాయాన్ని బ్రిడ్జ్ అంటారు. ఉదాహరణకు ప్రమాదవశాత్తు ఒక పన్ను కాని లేక అంతకంటె ఎక్కువ పళ్ళను కోల్పోయినప్పుడు, ఆ పళ్ళులేని ఖాళీ భాగాన్ని (స్థలాన్ని) కృత్రిమ పళ్ళతో భర్తీ చేయటానికి వీలుగా లోపించిన పళ్ళ సముదాయాన్ని ఇరుప్రక్కల ఉన్న ఆరోగ్యమైన బలమైన పళ్ళకు అంటే ప్రక్క పళ్ళు కదలకుండా ఉన్నట్లయితే ఇన్‌ఫెక్షన్ లేకుండా ఉన్నట్లయితే ఆ పళ్ళను ఆధారం చేసుకొని బ్రిడ్జ్‌ని తయారుచేయడం జరుగుతుంది.
బ్రిడ్జ్‌ని తయారుచేయు పద్ధతి.. బ్రిడ్జ్ తయారుచేయాలంటే ఉదాహరణకు పైదవడ ముందుభాగంలో రెండు పళ్ళు లేవు అనుకోండి. ఆ రెండు పళ్ళు ప్రక్కపళ్ళు అంటే కుడి పక్క ఒకటి, ఎడమ పక్క ఒకటి గట్టిగా ఉన్న పళ్ళను రెండు-మూడు మి.మీటర్ల పరిమాణం అరగదీసి అంటే, సైజులో చిన్నవిగా చేసి వాటినాధారంగా చేసుకొని తొడుగుల రూపంలో తయారుచేసి, ఆ రెండు తొడుగులను కలుపుతూ లోపించిన ఆ రెండు పళ్ళను కూడా కలిపి మొత్తం నాలుగు పళ్ళకు తయారుచేస్తారు. అంటే, రెండు తొడుగులు రెండు పళ్ళు మొత్తం నాలుగు. ఈ పళ్ళు మెటల్ సిరామిక్ అయితే, మెటల్ మరియు సిరామిక్ మెటీరియల్‌తో తయారుచేస్తారు. ప్రత్యేకంగా సిరామిక్ (పింగాణి) తో గాని లేక జెర్‌కోనియంతోగాని తయారుచేస్తారు. ఈ విధంగా తయారుచేసిన పళ్ళు ఒరిజినల్ పక్కపళ్ళు ఏ రంగులో ఉన్నాయో అదే రంగులో ఉండి, అందంగా కనిపిస్తాయి. ఈ విధంగా తయారుచేసిన బ్రిడ్జి నాలుగు పళ్ళు అంటే ఆ చివరా ఈ చివరా రెండు తొడుగులు, మధ్యలో రెండు పళ్ళు ఉంటాయి. ఇరువైపుల ఉన్న తొడుగులలో డెంటల్ సిమ్మెంటును నింపి ఆ బ్రిడ్జిని అరగదీసిన పళ్ళకు అతికించినట్లయితే ఆ ఆకృతికి పళ్ళు శాశ్వతంగా కదలకుండా అతుక్కుపోయి ఒరిజినల్ పళ్ళు మాదిరిగా బలంగా ఉండి, మిగతా పళ్ళతో కలిసిపోతాయి. అందుకే వాటిని ఫిక్స్‌డ్ పార్షియల్ కృత్రిమ పళ్ళు అని కూడా అంటారు.
బ్రిడ్జ్ ఉపయోగాలు
బ్రిడ్జ్‌ను తయారుచేసిన మెటీరియల్‌ను బట్టి వాటి యొక్క నాణ్యత ఉంటుంది. కృత్రిమ పళ్ళైనా సహజత్వాన్ని ఉట్టిపడేలా ఉంటాయి. దానిలో కోల్పోయిన పళ్ళను మరలా పొందిన పళ్ళతో మనస్సుకు తృప్తి, ఆనందం, సంతోషాన్ని పొందడం జరుగుతుంది. అంతేకాకుండా కొరకటానికి, నమలడానికి కూడా ఎంతో అనువుగా వుండి ఆహారాన్ని తినడానికి వీలు కలుగుతుంది. దీనితో ఆరోగ్యం మెరుగుపడుతుంది. హాయిగా నవ్వుకోవడానికి, మాట్లాడటానికి ఎంతో నిబ్బరంగా ఉండి దైనందిన కార్యక్రమాలను ఎంతో నైపుణ్యంగా నిర్వహించగలుగుతారు. ఊడిపోతాయని భయపడవలసిన అవసరం లేదు. గట్టిపదార్థాలను కొరికినప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. రోజూ ఉదయం, సాయంత్రం బ్రష్ చేసుకోవాలి. ప్రతి ఆరునెలలకొకసారి దంత వైద్యునిచే పరీక్ష చేయించుకోవాలి.
*