
* కర్బూజా పండు లోపల ఉండే గింజలు దోస పండులోని గింజలను పోలి ఉంటాయి. దోస గింజల కంటే కర్బూజా గింజలు కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఆయుర్వేదంలో ధాతుపుష్టి లేహ్యాల తయారీకి ఈ గింజల్లోని పప్పును వాడుతారు. గింజల్లోని పప్పు వీర్య పుష్టిని కలిగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో తయారయ్యే వక్కపొడిలో ఈ గింజల పప్పుని చేర్చుతుంటారు. సీమ బాదం, పిస్తా పప్పులకు అభావ ప్రతినిధిగా కర్బూజా పప్పుని వాడటం చూస్తుంటాం. కర్బూజా గింజల్లో హైపోగ్జాంథిన్ అనే పదార్థం ఉంటుంది. కర్బూజా గింజల్లో నూటికి ముప్పయ్యో వంతు నూనె పదార్థం ఉంటుంది. ఈ నూనె లేత పసుపు రంగులో ఉంటుంది. కొంతవరకూ దానంతట అదే ఆరిపోయే స్వభావం కలిగి ఉంటుంది. ఈ నూనెను వంటకాల్లో వాడుకోవచ్చు. కర్బూజా నూనె సబ్బుల పరిశ్రమలో కూడా ఉపయోగపడుతుంది.
* కర్బూజా గింజల్ని చూర్ణ రూపంలో లోపలికి తీసుకుంటే బంధించబడిన మూత్రం జారీ అవుతుంది. సమస్త విధాలైన మేహ రోగాలను కర్బూజా గింజలు తగ్గిస్తాయి.
* కర్బూజ గింజలను చూర్ణ రూపంలో వాడితే వీర్యపుష్టి కలుగుతుంది.
* అలాగే వీటిని ఔషధంగా వాడుకుంటే మూత్ర మార్గంలో తయారయ్యే రాళ్లు కరిగి పడిపోతాయి.
* కర్బూజా గింజల్ని నీళ్లతో ముద్దగా నూరి చిన్నపిల్లలకు కడుపు ఉబ్బినప్పుడు పొత్తి కడుపు మీద వేసి కట్టినట్లయితే గుణకారిగా ఉంటుంది.
* జ్వరాల్లో కూడా ఈ గింజలు ఉపయోగపడతాయి. కర్బూజా గింజలు శారీరక ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. కర్బూజా గింజల్ని యవకుటంగా అంటే బరకగా దంచి నీళ్లల్లో వేసి కషాయం కాచి వడకట్టి తాగితే టైఫాయిడ్ జ్వరంలో హితకరంగా ఉంటుంది.
* కర్బూజా నీరసం, నిస్త్రాణ, జ్వర తాపం వంటి వాటిని తగ్గిస్తుంది.
* దోష జ్వరాలవల్ల కడుపులో ఏర్పడే వ్రణాల్లోనూ కర్బూజ గింజల చూర్ణంగానీ, కషాయం గానీ గుణకారిగా ఉంటుంది.
* అలాగే కర్బూజా గింజల కషాయాన్ని గాని లేదా చూర్ణాన్ని గాని పురాణ జ్వరాలు, అంతర్గత వ్రణాలు తదితర సమస్యలను తగ్గించుకోటానికి వాడుకోవచ్చు.
*