మీర్పూర్, మార్చి 5: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఇప్పటికే ఫైనల్ చేరిన శ్రీలంక గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే చివరి లీగ్ పోరును ప్రాక్టీస్ మ్యాచ్‌గా భావిస్తోంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయభేరి మోగించిన శ్రీలంక ఫైనల్‌లో టైటిల్ కోసం పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఇప్పటికే ఫైనలిస్టులు ఖరారు కావడంతో, లంక, బంగ్లాదేశ్ మ్యాచ్‌కి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆసియా కప్‌లో తొలిసారి పాల్గొన్న ‘పసికూన’ జట్టు అఫ్గానిస్తాన్ చేతిలోనూ ఓటమిపాలైన బంగ్లాదేశ్ గొప్పగా పోరాడుతుందనిగానీ, లంకకు గట్టిపోటీని ఇస్తుందనిగానీ ఊహించడానికి వీలులేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లంపై బంగ్లాదేశ్‌కు విజయం సాధ్యం కాదు. ఫైనల్ చేరిన నేపథ్యంలో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే ప్రయత్నం శ్రీలంక జట్టు మేనేజ్‌మెంట్ చేస్తుందని అనుకోలేం. కీలక ఆటగాళ్లను పక్కకుబెట్టి చివరి లీగ్ మ్యాచ్‌ని ఆడితే, ఫైనల్ కోసం అవసరమైన అత్యంత విలువైన ప్రాక్టీస్‌ను వారు కోల్పోతారు. అంతేగాక, బంగ్లాదేశ్ వంటి అత్యంత సాధారణమైన జట్టు చేతిలో ఓడితే, ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. ఏ రకంగా చూసినా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ని శ్రీలంక ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుంటున్నది. సాధ్యమైనంత వరకూ ప్రాక్టీస్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌ని కూడా గెల్చుకోలేకపోయింది. భారత్, పాకిస్తాన్, చివరికి అఫ్గాన్ చేతిలోనూ ఈ జట్టు పరాజయాలను మూటగట్టుకుంది. వరుస పరాజయాలు బంగ్లాదేశ్ ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలమతున్నారు. ఇదే పరిస్థితి శ్రీలంకతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లోనూ పునరావృతం కావచ్చు. కెప్టెన్ ముష్ఫికర్ రహీం సెంచరీని మినహాయిస్తే, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఈ టోర్నీలో సాధించిన అద్భుతమంటూ ఏదీ లేదు. అన్ని విభాగాల్లోనూ ఈ జట్టు విఫలంకాగా, అందుకు భిన్నంగా శ్రీలంక పటిష్టమైన స్థితికి చేరింది. కుమార సంగక్కర, లహిరు తిరుమానే, కుశాల్ పెరీరా, ఏంజెలో మాథ్యూస్ వంటి ఆటగాళ్లతో లంక బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. లసిత్ మలింగ, అజంతా మెండిస్ వంటి స్టార్ బౌలర్ల అండ ఆ జట్టుకు ఉంది. ఏ రకంగా చూసినా, ఈ టోర్నీలో లీగ్ దశను వరుస విజయాలతో ముగించడం ద్వారా ఫైనల్‌కు సమాయత్తమయ్యేందుకు శ్రీలంక సిద్ధంగా ఉంది. లంకను నిలువరించడానికి బంగ్లాదేశ్ ఏ స్థాయిలో పోరాడుతుందో చూడాలి. కాగా, శ్రీలంక మాత్రం ఈ మ్యా చ్‌ని పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్‌కు సన్నాహక పోరు గా భావించడమేగాక, అందుకు అనుగుణంగానే వ్యూహరచనలో నిమగ్నమైంది. ఈనెల ఎనిమిదిన జరిగే ఫైనల్‌లో పాక్‌తో అమీతుమీ తేల్చుకోవడాని కి ఉత్సాహ పడుతున్నది. బంగ్లాదేశ్‌తో లంక మ్యా చ్ భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యా హ్నం 1.30 గంటలకు మొదలవుతుంది.
ఐజిఎన్‌సి కాంప్లెక్స్‌లో
సైక్లింగ్ అకాడమీ
న్యూఢిల్లీ, మార్చి 5: ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సైక్లింగ్ అకాడమీతోపాటు మూడు వేరువేరు స్టేడియాల్లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణ ప్రాజెక్టును కూడా కేంద్ర క్రీడాశాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టు కింద సుమారు 907.50 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్మింగ్ పూల్స్‌ను జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (జెఎన్‌ఎస్), ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (ఐజిఎస్‌సి), డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ (కెఎస్‌ఎస్‌ఆర్)లో నిర్మిస్తారు. అదే విధంగా కమ్యూనిటీ కనెక్ట్ స్కీం కింద జెన్‌ఎన్‌ఎస్, ఐజిఎస్‌సి, శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ కాంప్లెక్స్‌లలో వినోదం కోసం ఏర్పాటు చేసిన వసతులను మంత్రి లాంఛనంగా ఆరంభించారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఆధ్వర్యంలోని జాతీయ సైక్లింగ్ అకాడమీ (ఎన్‌సిఎ)ని ఐజిఎస్‌సి కాంప్లెక్స్‌లో ఆయన ప్రారంభంచారు. ఈ అకాడమీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. యువ సైక్లిస్టులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇక్కడ లభిస్తుందని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా సమర్థులను గుర్తించి, వారికి శిక్షణ ఇవ్వడం అకాడమీ లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్నారు. ఈ అకాడమీకి అనుబంధంగా జిమ్నాసియం, సైకిళ్ల కోసం అన్ని వసతులతో కూడిన వర్క్‌షాప్ ఉంటాయని అన్నారు. దేశంలో సైక్లింగ్ క్రీడను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న భారత సైక్లింగ్ సమాఖ్యతో సాయ్ ఇప్పటికే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని చెప్పారు. సైక్లింగ్‌కు కేంద్రం ఇతోథిక సాయం అందచేస్తుందని హామీ ఇచ్చారు. విదేశీ కోచ్‌ల కోసం ప్రపంచ సైక్లింగ్ సెంటర్ (యుసిఐ)ను సాయ్ సంప్రదిస్తున్నదని మంత్రి వివరించారు.