
న్యూఢిల్లీ, మార్చి 5: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం మరోమారు సూచించారు. బుధవారం ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరును సమీక్షించిన అనంతరం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌తో ప్రభుత్వ కార్యకలాపాలకుగానీ, ఆర్‌బిఐ కొత్త బ్యాంకుల లైసెన్సుల జారీకిగానీ ఎలాంటి ఆటంకం ఉండబోదన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళితో వీటికి వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. ఎన్నికల కోడ్ అమలుతో కొన్ని ఆంక్షలు వచ్చినప్పటికీ ప్రభుత్వ సాధారణ కార్యకలాపాలు జరగకూడదని ఎన్నికల సంఘం ఏమీ చెప్పలేదు కదా? అన్ని ప్రశ్నించారు. కాబట్టి ఆర్‌బిఐ కొన్ని బ్యాంకుల లైసెన్సులను జారీ చేస్తుందని, ఈ మేరకు ఆర్‌బిఐ నుంచి సంకేతాలు నాకు వచ్చాయన్నారు. ఇక ప్రభుత్వరంగ బ్యాంకులకు నిరర్థక ఆస్తులే (ఎన్‌పిఎ) అతిపెద్ద సమస్యగా ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిరర్థక ఆస్తులు స్వల్పంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ‘రుణాల వసూళ్లపై దృష్టి పెట్టండని పదేపదే తాము బ్యాంకులకు సూచిస్తూనే ఉన్నాం. ఫలితంగానే గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య బ్యాంకర్లు 18,933 కోట్ల రూపాయల మొండి బకాయిలను తిరిగి వసూలు చేయగలిగారు.’ అని చిదంబరం అన్నారు. గత ఏడాది మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు అంతకుముందు ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే 28.5 శాతం పెరిగి 1.83 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయిలపై ప్రత్యేకంగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్‌తో శుక్రవారం చిదంబరం సమావేశం కానున్నారు. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్‌లో యునైటెడ్ బ్యాంక్ 1,238 కోట్ల రూపాయల నికర నష్టాలను నమోదు చేయగా, గత ఏడాది మార్చి నాటికి ఈ బ్యాంకు మొండి బకాయిలు 2,964 కోట్ల రూపాయల నుంచి 8,546 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ బ్యాంకు 1,200 కోట్ల రూపాయల మొండి బకాయిలను వసూలు చేయగలిగిందని చిదంబరం చెప్పారు. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ విడుదలయ్యే కరెంట్ ఖాతా లోటు గణాంకాల తర్వాతే బంగారం దిగుమతులపై పెంచిన సుంకంపై సమీక్ష ఉంటుందని, అప్పుడే తగ్గింపులు జరిగే వీలుందని చిదంబరం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
(చిత్రం) బుధవారం న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతున్న చిదంబరం, పక్కనే ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రు