న్యూఢిల్లీ, మార్చి 5: గాడి తప్పిన జిడిపిని తిరిగి సరైన మార్గంలో పెట్టేందుకు కొత్త ప్రభుత్వం మూడు నెలల్లోగా పెట్టుబడుల పునరుద్ధరణతోపాటు వౌలికరంగ ప్రాజెక్టులను అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అన్నారు. ‘నా అంచనా ప్రకారం మూడు నెలల్లోగా ఇది జరగకపోతే, అధిక వృద్ధిరేటు సంగతిని మరిచిపోవాల్సిందే.’ అని అభిప్రాయపడ్డారు. బుధవారం ఇక్కడ జరిగిన సిఐఐ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులను ప్రోత్సహించడంలో, ప్రాజెక్టుల అమలుకు ఉన్న అడ్డంకులను తొలగించడంలో ఏ ప్రభుత్వం విఫలమైనా జిడిపి వృద్ధి అనేది ఉండదన్నారు. కాగా, ప్రస్తుత 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17)లో వార్షిక వృద్ధిరేటు సగటు లక్ష్యం 8 శాతంగా నిర్ణయించారు. 2012 డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి)తోపాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ దీనికి ఆమోదం కూడా తెలిపాయి. అయినప్పటికీ 12వ పంచవర్ష ప్రణాళికలో మొదటి ఆర్థిక సంవత్సరమైన 2012-13లో వృద్ధిరేటు దశాబ్దకాలం దిగువగా 4.5 శాతానికే పరిమితమైంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం (2013-14)లో వృద్ధిరేటు 4.9 శాతంగా నమోదవుతుందని కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది. ఈ క్రమంలో బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, కేంద్రంలో కొత్తగా వచ్చే ఏ ప్రభుత్వమైన పెట్టుబడుల పురోగతికి, వౌలికరంగ ప్రాజెక్టుల అమలుపై ప్రధాన దృష్టి పెట్టాల్సిందేనని అహ్లూవాలియా తేల్చిచెప్పారు.
వౌలికరంగ ప్రాజెక్టులనూ అమలు చేయాల్సిందే : అహ్లూవాలియా
english title:
p
Date:
Thursday, March 6, 2014