ముంబయి, మార్చి 5: పెరుగుతున్న ఎగుమతులు, తగ్గుతున్న దిగుమతులు (ముఖ్యంగా బంగారం దిగుమతులు) మధ్య ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు (సిఎడి) 4.2 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో 31.9 బిలియన్ డాలర్లుగా ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా క్రిందటేడాది 88 బిలియన్ డాలర్లుగా నమోదైన కరెంట్ ఖాతా లోటు.. జిడిపిలో 4.8 శాతాన్ని తాకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జిడిపి 0.9 శాతంగా ఉంది. పోయినసారి అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 6.5 శాతం. ‘కరెంట్ ఖాతా లోటు తగ్గడానికి కారణం వాణిజ్య లోటు పడిపోవడమే. ఎగుమతులు పెరిగి, దిగుమతులు తగ్గిపోవడంతో విదేశీ కరెన్సీ రాకపోకలకు సూచికగా ఉన్న సిఎడి అదుపులోకి వచ్చింది.’ అని రిజర్వ్ బ్యాంకు బుధవారం విడుదల చేసిన గణాంకాల సందర్భంగా స్పష్టం చేసింది. ఇదిలావుంటే గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య కరెంట్ ఖాతా లోటు 31.1 బిలియన్ డాలర్లుగా నమోదై జిడిపిలో 2.3 శాతంగా నిలిచింది. 2012 ఏప్రిల్-డిసెంబర్ ఇది 69.8 బిలియన్ డాలర్లుగా నమోదై జిడిపిలో 5.2 శాతంగా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కరెంట్ ఖాతా లోటును ఈ ఆర్థిక సంవత్సరం 45 బిలియన్ డాలర్ల దిగువకు తీసుకొస్తామన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా గణాంకాలు చిదంబరం మాటలను నిజం చేసేలా కనిపిస్తున్నాయి. కరెంట్ ఖాతా లోటు పెరిగేందుకు దోహదపడుతున్న దిగుమతులను తగ్గించేందుకు దిగుమతుల్లో చమురు తర్వాత అధికంగా ఉన్న బంగారంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు దృష్టిపెట్టడంతోనే సిఎడి అదుపులోకి వచ్చింది. దిగుమతులపై సుంకాలను ప్రభుత్వం పెంచితే, బంగారం రుణాలపై ఆర్‌బిఐ ఆంక్షలు విధించింది. అంతేగాక దిగుమతి అయిన బంగారంలో తిరిగి 20 శాతం ఆభరణాల రూపంలో విదేశాలకు ఎగుమతి అవ్వాలనే నిబంధననూ ఆర్‌బిఐ తీసుకొచ్చింది.
* పెరుగుతున్న ఎగుమతులతో దిగుతున్న వాణిజ్య లోటు * ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంకు చర్యల ఫలితం
english title:
k
Date:
Thursday, March 6, 2014