
న్యూఢిల్లీ, మార్చి 5: ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ రాయల్స్ బౌలర్ అజిత్ చండీలాను లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఆదేశించింది. సమాధానం ఇవ్వడానికి అతనికి ఈ నెల 12వ తేదీ వరకూ గడువునిచ్చింది. శ్రీశాంత్, అంకిత్ చవాన్‌లతోపాటు చండీలాను కూడా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఢిల్లీ పోలీసు అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత వీరంతా బెయిల్‌పై విడుదలకాగా, బిసిసిఐ ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు రవి సవానీ ఈ ఆరోపణలపై విచారణ జరిపాడు. ఈ ముగ్గురితోపాటు అమిత్ సింగ్, సిద్ధార్థ్ త్రివేదీలను కూడా కమిటీ తప్పుపట్టింది. వీరిలో శ్రీశాంత్, చవాన్‌లపై బాసిసిఐ జీవితకాల సస్పెన్షన్ విధించింది. అమిత్ సింగ్‌ను ఐదేళ్లపాటు నిషేధించింది. త్రివేదీని 12 నెలల పాటు క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. చండీలాకు ఆలస్యంగా బెయిల్ లభించడంతో అతని నుంచి పూర్తి వివరణ తీసుకోవాలని బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్, రాజీవ్ శుక్లా, శివలాల్ యాదవ్ సభ్యులుగా ఉన్న క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. బుధవారం వారి ముందు హాజరైన చండీలా తాను నిర్దోషినని వివరణ ఇచ్చినట్టు సమాచారం. కాగా, తనపై వచ్చిన ఆరోపణలకు లిఖికపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చండీలాను క్రమశిక్షణ కమిటీ ఆదేశించిందని బిసిసిఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపాడు. ఈనెల 12వ తేదీలోగా దీనిని సమర్పించాలని చండీలకు స్పష్టం చేసినట్టు చెప్పాడు.
ఎవరూ సహకరించడం లేదు..
తనకు ఎవరూ సహకరించడం లేదని, తాను నిర్దోషినని ఎంతగా చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదని చండీలా వాపోయాడు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన తర్వాత ఐటిసి వౌల్య హోటల్ నుంచి వెళుతూ అతను విలేఖరులతో మాట్లాడుతూ, స్పాట్ ఫిక్సింగ్‌లో తన పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందిగా బిసిసిఐ ఆదేశించిందని చెప్పాడు. దీని ప్రకారం, 12వ తేదీలోగా వివరణ ఇస్తానని పేర్కొన్నాడు. ‘బిసిసిఐ అభిప్రాయం ఏమిటో నాకు స్పష్టంగా తెలుస్తోంది. నాపై జీవితకాల సస్పెన్షన్ విధించడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి ఈ కేసులో నాకు ఎలాంటి సబంధం లేదు. కానీ, ఎవరూ నాకు అండగా లేరు. అధికారుల ఆదేశం మేరకు వివరణ ఇస్తారు. ఆతర్వాత ఏం జరుతుందోనని వేచి చూడడం మినహా నేను చేయగలిగింది లేదు’ అన్నాడు. కాగా, చండీలా నుంచి వివరణ తీసుకున్నప్పటికీ, దానితో నిమిత్తం లేకుండానే అతనిపై జీవితకాల సస్పెన్షన్ విధించడం ఖాయమని తెలుస్తోంది.