
న్యూఢిల్లీ, మార్చి 5: ఈసారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా తనను తీసుకోవడానికి ఇష్టపడకపోయినా, ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ మాత్రం ఇప్పటికీ తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ అభిమానినేనని అంటున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు వచ్చే ఏడాది సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలకు సంబంధించి ‘ట్రావెల్ ప్యాకేజీ’ని బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో బ్రెట్ లీ ప్రారంభించాడు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ నమూనా ట్రోఫీని ఆవిష్కరించి మాట్లాడుతూ, ఐపిఎల్ అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. ఈ టోర్నీ ద్వారానే ఎంతో మంది యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడంతోపాటు, ప్రపంచ మేటి క్రికెటర్లతో కలిసి ఆడి అనుభవాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తున్నదని అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ పోటీలకు భారత ఉప ఖండం నుంచి భారీగా అభిమానులు హాజరవుతారని అతను జోస్యం చెప్పాడు. ఈ సందర్భంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బ్రెట్ లీ సమాధానమిస్తూ, 37 ఏళ్ల వయసులో మళ్లీమళ్లీ క్రికెట్ జట్లలో స్థానం సంపాదించడం కష్టమేనని అన్నాడు. ‘రాంబో’ మాదిరిగానే చాలాసార్లు తన పునరాగమనం చోటు చేసుకుందని చమత్కరించాడు. ఐపిఎల్ ఆడాలన్న ఉత్సాహం ఉన్నమాట వాస్తవమేనని, అయితే, వయసును కూడా తాను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నాడు. ఎవరో ఒకరు రోల్‌మోడల్ లేకపోతే క్రీడారంగంలో ఎదగడం కష్టమని చెప్పాడు. సచిన్ తెండూల్కర్ ఆడుతున్నప్పుడు అతని మాదిరిగానే గొప్ప బ్యాట్స్‌మన్‌ని కావాలని, డెన్నిస్ లిల్లీ బౌలింగ్ చేస్తున్నప్పుడు అతనిలా ఎదగాలని కోరుకోని ఆటగాడు ఉండడని బ్రెట్ లీ పేర్కొన్నాడు. ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్నప్పుడే ఎదుగుతామని అన్నాడు.