
న్యూఢిల్లీ, మార్చి 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఏడో విడత పోటీల్లో భాగంగా ఎక్కువ మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని టోర్నమెంట్ చైర్మన్ రణ్‌జిబ్ బిస్వాల్ వెల్లడించాడు. ఐపిఎల్ టోర్నీ, సార్వత్రిక ఎన్నికలు దాదాపు ఒకే సమయంలో రావడంతో కొన్ని మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించక తప్పదని ఐపిఎల్ గవర్నింగ్ బాడీ సమావేశం ముగిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ బిస్వాల్ తెలిపాడు. ఐపిఎల్ గవర్నింగ్ బాడీ సమావేశంలో బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్, కార్యదర్శి సంజయ్ పడేల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు కూడా పాల్గొన్నారు. వాస్తవానికి ఏడో ఐపిఎల్ వేదికను ఈ సమావేశంలోనే ఖరారు చేస్తామని ఇంతకు ముందు బిస్వాల్ ప్రకటించాడు. కానీ, సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఎలక్షన్ కమిషన్ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో, ఐపిఎల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోలేదు. ఈ షెడ్యూల్‌ను అధ్యయనం చేసి, ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని బిస్వాల్ తెలిపాడు. ఎక్కువ శాతం మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు. దక్షిణాఫ్రికాను వేదికగా ఎంచుకోబోమని స్పష్టం చేశాడు. టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు తమ దేశంలోనే ఆడాలని, పాక్షికంగా కొన్ని మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వబోమని సౌతాఫ్రికా క్రికెట్ ప్రకటించిందని అన్నాడు. మొత్తం టోర్నీని దక్షిణాఫ్రికాలో నిర్వహించడం సాధ్యం కాదని, కాబట్టి, అక్కడ కొన్ని మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదన్నాడు. బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశాలు పరిశీలనలో ఉన్నట్టు బిస్వాల్ చెప్పాడు. ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు ఉంటుందని, మే 16న ఓట్ల లెక్కింపు ముగుస్తుందని వివరించాడు. ఓట్ల లెక్కింపు తేదీ తర్వాత జరగాల్సిన ఏడు మ్యాచ్‌లు మన దేశంలోనే ఉంటాయని చెప్పాడు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, ఐపిఎల్ మ్యాచ్‌ల వేదికలను ఒకటిరెండు రోజుల్లో ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపాడు.