
మీర్పూర్, మార్చి 5: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో శ్రీలంక, పాకిస్తాన్ జట్లను ఢీకొని పరాజయాలను చవిచూసిన టీమిండియా ఆటగాళ్లు బుధవారం నాటి మ్యాచ్‌లో ‘పసికూన’ జట్టు అఫ్గానిస్తాన్‌పై రెచ్చిపోయారు. మరో 106 బంతులు మిగిలి ఉండగానే, ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేశారు. అయితే, ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఫలితం వల్ల ఎలాంటి లాభం లేకపోవడంతో అభిమానులు ఎవరూ అంతగా ఆసక్తి కనబరచలేదు. మొత్తం మీద చివరి లీగ్‌ను గెల్చుకోవడం ద్వారా భారత్ ఈ టోర్నీని రెండు విజయాలు, మరో రెండు పరాజయాలతో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 45.2 ఓవర్లు పోరాడి 159 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత్ 32.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా, బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్, ఆజింక్య రహానే రాణించడంతో టీమిండియా విజయం సులభమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 30 పరుగుల స్కోరువద్ద నవ్‌రోజ్ మంగళ్ (5) వికెట్‌ను కోల్పోయింది. ఆతర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కూలాయి. ఓపెనర్ నూర్ అలీ జద్రాన్ (31), వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ మహమ్మద్ షాజాద్ (22), సమీయుల్లా షెన్వారీ (50) తప్ప జట్టులో ఎవరూ రెండంకెల స్కోర్లు కూడా చేయలేదు. జడేజా 10 ఓవర్లు బౌల్ చేసి, 30 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 31 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అనంతరం భారత ఇన్నింగ్స్‌ను ధావన్, రహానే ధాటిగా మొదలుపెట్టారు. తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత మిర్వాస్ అష్రాఫ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగిన రహానే 66 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లతో 56 పరుగులు చేశాడు. మరో రెండు పరుగుల తర్వాత ధావన్ కూడా పెవిలియన్ చేరాడు. అతను 78 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు సాధించాడు. అనంతరం రోహిత్ శర్మ (నాటౌట్ 18), దినేష్ కార్తీక్ (నాటౌట్ 21) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ జట్టుకు విజయాన్ని సాధించిపెట్టారు. భారత్‌కు ఈ భారీ విజయం బోనస్ పాయింటును అందించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
స్కోరుబోర్డు
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: నూర్ అలీ జద్రాన్ సి కోహ్లీ బి జడేజా 31, నవ్‌రోజ్ మంగళ్ బి మహమ్మద్ షమీ 5, రహ్మత్ షా ఎల్‌బి జడేజా 9, అస్గర్ స్టానిక్‌జాయ్ సి అమిత్ మిశ్రా బి జడేజా 5, నజీబుల్లా జద్రాన్ సి సబ్‌స్టిట్యూట్ (స్టువర్ట్ బిన్నీ) బి అశ్విన్ 5, మహమ్మద్ నబీ సి దినేష్ కార్తీక్ బి జడేజా 6, మహమ్మద్ షాజాద్ ఎల్‌బి అశ్విన్ 22, సమీయుల్లా షెన్వారీ ఎల్‌బి షమీ 50, మిర్వాస్ అష్రాఫ్ సి కోహ్లీ బి అమిత్ మిశ్రా 9, షాపూర్ జద్రాన్ ఎల్‌బి అశ్విన్ 1, దవ్‌లత్ జద్రాన్ నాటౌట్ 2, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (45.2 ఓవర్లలో ఆలౌట్) 159.
వికెట్ల పతనం: 1-30, 2-54, 3-55, 4-60, 5-64, 6-83, 7-95, 8-111, 9-137, 10-159.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 8-1-25-0, మహమ్మద్ షమీ 7.2-0-50-2, అమిత్ మిశ్రా 10-1-21-1, రవీంద్ర జడేజా 10-1-30-4, రవిచంద్రన్ అశ్విన్ 10-3-31-3.
భారత్ ఇన్నింగ్స్: ఆజింక్య రహానే ఎల్‌బి మిర్వాస్ అషఫ్ 56, శిఖర్ ధావన్ బి మహమ్మద్ నబీ 60, రోహిత్ శర్మ నాటౌట్ 18, దినేష్ కార్తీక్ నాటౌట్ 21, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (32.2 ఓవర్లలో 2 వికెట్లకు) 160.
వికెట్ల పతనం: 1-121, 2-123.
బౌలింగ్: మహమ్మద్ నబీ 10-0-30-1, షాపూర్ జద్రాన్ 6-0-25-0, దల్‌వత్ జద్రాన్ 5-0-25-0, సమీయుల్లా షెన్వారీ 4.2-0-32-0, మిర్వాస్ అషఫ్ 5-0-26-1, రహ్మత్ షా 2-0-21-0.