Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎయడ్స్‌రోగి పోరాటం

$
0
0

*** డల్లాస్ బయర్స్ క్లబ్ (బాగుంది)
తారాగణం: మాక్ కొనాగన్, జెరెడ్ లిటో, జెన్నిఫర్ గార్నర్
ఫొటోగ్రఫీ: యేస్ బెలాంగర్, దర్శకత్వం: జాన్‌మార్క్ వాల్లీ.
మన దగ్గర వైద్యం వ్యాపారమైపోయింది. మందులు, మందుల పరిశ్రమలు వ్యాపార సంస్థలుగా తయారయ్యాయి. నకిలీ మందులు, కాలం చెల్లిన మందులు, విదేశాల్లో నిషేధించిన మందులు మార్కెట్లో స్వైర విహారం చేస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్ పేరిట మారుమూల ప్రాంతాల్లో వున్న గిరిజనులను, అడ్డామీది కూలీలను ‘గినీపిగ్’లుగా మార్చి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ ఎవరికీ ఎవరి మీద నియంత్రణ వుండదు. అదే యూరోపియన్ దేశాలలో ముఖ్యంగా అమెరికాలో ఆరోగ్యానికిచ్చే ప్రాముఖ్యత, మందుల మీద వున్న నియంత్రణ, ప్రజల మీద ప్రభుత్వానికున్న బాధ్యత గురించి తెలుసుకోవాలంటే ‘‘డల్లాస్ బయర్స్ క్లబ్’’ చిత్రం చూడాల్సిందే.
అది 1985. డల్లాస్ ప్రాంతం. మదించిన ఎద్దుల మీద స్వారీ చేసే కౌబోయ్‌గా, ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే వుడ్‌రూఫ్‌కు వైద్య పరీక్షల్లో ఎయిడ్స్ వుందనీ, ముప్పై రోజులకంటే ఎక్కువ బతకడని తెలుస్తుంది. అది ఒప్పుకోక డాక్టర్ల మీద ఆగ్రహించిన వుడ్‌రూఫ్‌కు అరక్షిత సెక్స్, డ్రగ్స్ సేవనంవల్ల వచ్చి వుంటుందని పుస్తకాలు, కరపత్రాలు చదివి తెలుసుకుంటాడు. ఆస్పత్రిలో పనిచేసే డా.ఈవ్ తాము ఎజడ్‌టి అనే యాంటీ వైరల్ మందును పరీక్షిస్తున్నామనీ, దానివల్ల ఎయిడ్స్ పేషంట్ జీవిత కాలాన్ని పొడిగించవచ్చనీ, మనుషుల మీద పరీక్షించడానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆమోదం వుందని చెబుతుంది. ఆస్పత్రిలో పనిచేసే వాడికి లంచమిచ్చి వుడ్‌రూఫ్ ఎజడ్‌టి మందును సేకరిస్తాడు. ఆ మందు తీసుకున్నా కొకైన్ సేవనం మాననందువల్ల అతని ఆరోగ్యం క్షీణిస్తుంది. దాంతో అతను మెక్సికో హాస్పిటల్‌కు వెళ్ళి ఎక్కువ మోతాదులో ఎజడ్‌టి మందును తీసుకోవాలనుకుంటాడు. అక్కడ వున్న డాక్టర్ ఎజడ్‌టి విషమనీ, అది ప్రతి కణాన్ని నాశనం చేస్తుందని చెప్పి, దానికి బదులుగా డిడిసి మరియు ప్రొటీన్ మందును తీసుకోమని చెబుతాడు. కాని ఆ మందులకు అమెరికాలో అనుమతి లేదు. అయినా వుడ్‌రూఫ్ ఈ మందులు తీసుకోవడంతో మూడునెలల్లో అతని ఆరోగ్యం మెరుగవుతుంది. దాంతో ఇక్కడ పెద్దఎత్తున మందులు కొనుగోలుచేసి, అక్కడ హెచ్‌ఐవి రోగులకు అమ్మి డబ్బుచేసుకోవాలనుకుంటాడు. అవి అక్రమ మందులు కావు కాబట్టి, వుడ్‌రూఫ్ మతగురువు వేషం వేసుకుని అవి తను వాడుకోవడానికని నమ్మించి బోర్డర్ అవతలి నుండి మందులు తీసుకుని వస్తాడు.
ఆ మందులను వుడ్‌రూఫ్ వీధులు తిరుగుతూ అమ్ముతాడు. ఎయిడ్స్ రోగులకు ఆ మందులు సరిగా చేరాలంటే మగాడై వుండి ఆడదానిగా మారిన రెయాన్ సహాయం కోరతాడు. వీళ్ళిద్దరు కలిసి ‘‘డల్లాస్ బయర్స్ క్లబ్’’ స్థాపించి నెలకు 400 డాలర్ల చొప్పున సభ్యత్వ రుసుం వసూలుచేస్తారు. అది ప్రజాదరణ పొందడంతో భాగస్వాములైన వుడ్‌రూఫ్, రెయాన్ మంచి మిత్రులవుతారు. ఈ క్లబ్ ప్రత్యామ్నాయ వైద్యం చేస్తుందని ఆగ్రహించిన డా.సెవార్డ్, ఆ మందుల గురించి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫోన్ చేసి ఉడ్‌రూఫ్‌ను అరెస్టుచేయమంటాడు. డా.ఈవ్ మాత్రం బయర్స్ క్లబ్ రోగులకు సహాయపడుతున్నదనీ, తమకు అధికారం లేకపోవడంవల్ల ఏమీ చేయలేకపోతున్నామని బాధపడుతుంది. ఆమె క్రమంగా వుడ్‌రూఫ్‌కు స్నేహితురాలవుతుంది.
పోలీసులు బయర్స్ క్లబ్‌మీద దాడిచేసి మందులు స్వాధీనంచేసుకుని వుడ్‌రూఫ్‌కు జరిమానా విధిస్తారు. ప్రభుత్వం ఆమోదించని ఏ మందైనా అక్రమ మందులేనని కొత్తగా చట్టం చేస్తారు. క్లబ్ నడపడానికి డబ్బు లేకపోవడంతో కొకైన్‌కు అలవాటుపడిన రెయాన్ తన తండ్రిని బతిమిలాడి డబ్బును తెస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మి డబ్బు తెచ్చానని అబద్ధం చెప్పి దాన్ని వుడ్‌రూఫ్‌కి ఇస్తుంది. దాంతో వుడ్‌రూఫ్ మెక్సికో పోయి ప్రొటీన్ మందు తీసుకుని వస్తాడు. అప్పటికే రెయాన్ అస్వస్థత చెందగా హాస్పిటల్‌కు తీసుకుపోతే, అక్కడ ఇచ్చిన ఎజడ్‌టి మందువల్ల చనిపోయిందని తెలిసి వుడ్‌రూఫ్ నిర్ఘాంతపోతాడు. రెయాన్ మృతి పట్ల డా.ఈవ్ కూడా బాధపడుతుంది. ఆస్పత్రికి వచ్చే రోగులను బయర్స్ క్లబ్‌కు పంపిస్తుందని ఆగ్రహించిన ఆస్పత్రివారు డా.ఈవ్‌ను తొలగిస్తారు.
రోజులు గడుస్తుంటాయి. బయర్స్ క్లబ్‌లో చేరిన హోమోసెక్సువల్ రోగుల మీద జాలిపడి వుడ్‌రూఫ్, కేవలం మందుల సేకరణ మీదే ఎక్కువ దృష్టిపెడతాడు. రానురాను ప్రొటీన్ మందు దొరకడం కష్టంకావడంతో విసిగిపోయిన వుడ్‌రూఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మీద కేసు వేస్తాడు. అది విష రహిత మైనదనీ, అది ఇంకా ఆమోదింపబడనప్పటికీ, దాన్ని తీసుకోవడానికి న్యాయపరమైన హక్కు ఇమ్మని కోరతాడు. జడ్జికి న్యాయం అనిపించినా చట్టప్రకారం ఏమీ చేయలేకపోతాడు. తర్వాత ఎజడ్‌టి ప్రొటీన్ తీసుకోవడానికి నిర్ధారణ కమిటీ అంగీకరిస్తుంది. దీనివల్ల ఎంతోమంది ఎయిడ్స్ రోగుల జీవితకాలం పొడిగింపబడుతుంది. 1992లో ఎయిడ్స్‌తో వుడ్‌రూఫ్ చనిపోతాడు.
వుడ్‌రూఫ్ బతికివున్నప్పుడు అతడ్ని కలిసి క్రేగ్ బోర్టన్ చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా, ఇంకొన్ని పాత్రలను కలిపి ఈ చిత్రానికి కథను తయారుచేసుకున్నారు. సినిమా స్క్రిప్టును పదిసార్లు తిరగరాసుకున్నారు. ముందుగా వుడ్‌రూఫ్ పాత్రకు బ్రాడ్‌పిట్‌ను అనుకున్నారు. వుడ్‌రూఫ్ సోదరి మాక్ కొనాగన్‌ను చూసిన తర్వాత అతనిలో వుడ్‌రూఫ్ పోలికలు, పర్సనాల్టి సరిపోతాయని సూచించడంతో అతడ్ని ఆ పాత్రకు ఎంపికచేశారు. ఈ పాత్రకోసం అతను 21 కిలోల బరువు తగ్గాడు. నీరసంగా, నిస్తేజంగా కనిపించే ఎయిడ్స్ పేషంట్‌గా మాక్ కొనాగన్, సెక్స్ మార్పిడి చేసుకున్న రెయాన్‌గా నటించిన లిటో నటన అద్భుతం. వాళ్ళు ఉత్తమ నటుడిగా, ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేయబడ్డారు. ఇవేకాకుండా ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ మేకప్‌లకుగాను మొత్తం ఆరు ఆస్కార్ అవార్డులకు ఈ చిత్రం నామినేషన్లు సంపాదించడం విశేషం. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా మంచి విజయాన్ని సాధించింది. 5 మిలియన్ డాలర్లతో తయారైన ఈ చిత్రం 30 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

=====
ఫ్లాష్.. ఫ్లాష్-
ముందే ఊహించినట్టుగా ఉత్తమ నటుడిగా మాక్ కొనాగన్,
ఉత్తమ సహాయనటుడిగా జెరెడ్ లిటో ఆస్కార్ అవార్డులు అందుకోవడం విశేషం.
==========

మన దగ్గర వైద్యం వ్యాపారమైపోయింది.
english title: 
aids
author: 
-కె.పి.అశోక్‌కుమార్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>