
అభ్యుదయ కవిగా మహాప్రస్థాన కర్తగా లబ్ధప్రతిష్ఠులైన తర్వాతే శ్రీశ్రీ సినీరంగ ప్రవేశం చేసినట్టు చాలామందికి తెలుసు. కాని శ్రీశ్రీ సినీగేయ ప్రస్థానం అనువాద చిత్రంతో ఆరంభమయిందని, అనువాద చిత్ర రచనకు తెలుగులో శ్రీశ్రీయే ఆద్యులని తెలిసిన వాళ్లు తక్కువ. ఆ మాటకొస్తే శ్రీశ్రీ సినిమా పాటలున్న మొత్తం చిత్రాల్లో (255) నేరుగా తెలుగులో తీసిన చిత్రాల్లోని పాటల (450) కంటే అనువాద చిత్రాల్లోని పాటల సంఖ్యే (500) ఎక్కువ!
తనకు సినిమా సరదా పనె్నండేళ్ల వయసులోనే వున్నట్టు శ్రీశ్రీ ‘అనంతం’ ఆత్మకథలో రాసుకొన్నారు. మహాప్రస్థాన గేయం మార్పులతో ‘కాలచక్రం’ (1940) అనే చిత్రంలో రావడంతో శ్రీశ్రీ సినీ రంగంలో వేలు పెట్టినట్టయింది. అయితే శ్రీశ్రీ ఆ కవితను తన మొదటి సినిమా పాటగా పరిగణించలేదు. ఆ కవితను సినిమాలో వినియోగించుకోవడమే తప్ప ఆ నిర్మాతతో ముందుగా మాట్లాడుకొన్న స్వల్ప పారితోషికం కూడా వారు చెల్లించలేదట! 1946లో ఆర్.యస్.జునార్కర్ నిర్మించిన ‘నీరా ఔర్ నందా’ అనే హిందీ చిత్రాన్ని 1950లో నవీనా ఫిలిమ్స్ వారు జగన్నాథ్ పర్యవేక్షణలో ‘ఆహుతి’ పేరుతో అనువదించడంతో తెలుగులో అనువాద చిత్ర నిర్మాణశకం ఆరంభమయింది. ఆహుతి చిత్రానికి మాటలు పాటలు రాసే అవకాశం శ్రీశ్రీకి లభించింది. అలా సినీ రచయితగా తన పేరు తెరకెక్కించిన తొలి చిత్రం ఆహుతియేనని, అదే తన సినీ రచనకు పునాది వేసిందని శ్రీశ్రీయే స్వయంగా రాశారు.
‘ఆహుతి’లో రాసిన-
ప్రేమయే జనన మరణ లీలా/ మృత్యుపాశమే అమరబంధమా/ యువ ప్రాణుల మ్రోలా...
అనే పాట గురించి శ్రీశ్రీ యిలా గుర్తు చేసుకున్నారు -
‘సినిమాకు నేను రాసిన పాటలన్నింటిలోనూ యిది మొట్టమొదటిది. ట్యూన్‌కి మాత్రమే కాక పెదవుల కదలికకు కూడా సరిపోయే విధంగా ‘నీరా ఔర్ నందా’ అనే హిందీ చిత్రానికి రాసిన డబ్బింగ్ పాట యిది... ఆహుతిలోని పాటలన్నీ బాగున్నాయంటే అందుకు సాలూరు రాజేశ్వరరావు సంగీతం గొప్పగా తోడ్పడిందని చెప్పక తప్పదు. హిందీ ఒరిజనల్‌లోని ట్యూన్లంటినీ అతడు పూర్తిగా మార్చి తన సొంతముద్ర వేశాడు. సినిమాకు పాటలు రాయడం చాలా మంది అజ్ఞానులనుకునేటంత సులభం కాదు. ఇక డబ్బింగ్‌కు రాయడమనేది మరీ కష్టంతో కూడుకున్న పని. ఉదాహరణకు ‘ప్రేమయే’ అన్న పాటనే తీసుకుందాం. హిందీలో దీని పల్లవి ‘ప్రేమ్ హై జనమ్ మరణ్ - కా ఖేల్’. ఇందులోని ఆఖరి ‘కాఖేల్’ చాలా ఇబ్బంది పెట్టింది. ‘ప్రేమయే జనన మరణ హేల’ అని రాశాను. కాని ‘లీల’ మాట మొదట్లో స్ఫురించలేదు. ఆ రాత్రి కలత నిద్రలో రాజేశ్వరరావు ట్యూను మననం చేసుకొంటూవుంటే ప్రేమయే జనన మరణలీల’ అనే పల్లవి దొరికింది. మర్నాడు పాటంతా పూర్తి చేశాను.
ఇలా అనువాద గీత రచనలోని సాధక బాధకాలను వివరించిన శ్రీశ్రీ ‘ఆహుతి’ (1950) నుంచి ‘దాహం దాహం’ (1982) వరకు 58 అనువాద చిత్రాలకు రచయితగా పని చేశారు. 1956 నుంచి 1968 వరకు ఉధృతంగా అనువాద గీతాలను రాసిన శ్రీశ్రీ చివరిలో ఆ వ్యాసంగాన్ని విరమించుకొన్నారు. ‘బొమ్మలాట’ (1970) ‘దాహం దాహం’ (1982) ఆయన చివరి అనువాద చిత్రాలు. శ్రీశ్రీ రచన చేసిన అనువాద చిత్రాల్లో అధిక శాతం తమిళ చిత్రాలు కాగా 15 హిందీ చిత్రాలు, రెండు కన్నడ చిత్రాలు కూడా వున్నాయి. సాహసవీరుడు, విజయకోట వీరుడు, అనగనగా ఒక రాజు, సెభాష్ పిల్లా, కత్తిపట్టిన రైతు, ఇంటిదొంగ, కథానాయకుడు కథ, తలవంచని వీరుడు మొదలైనవి శ్రీశ్రీ ప్రసిద్ధ తమిళ అనువాద చిత్రాలు కాగా - గాంధారీ గర్వభంగం, జింబో, అరబ్బీ వీరుడు జబక్, శ్రీరామభక్త హనుమాన్, సంపూర్ణ రామాయణం మొదలైనవి శ్రీశ్రీకి పేరు తెచ్చిన హిందీ అనువాదాలు. తెలుగులో నేరుగా తీసిన చిత్రాల్లోని పాటల రచనలకు భిన్నంగా అనువాద చిత్రాల్లో దాదాపు పాటలన్నీ ఒక కవి మాత్రమే రాసే సంప్రదాయాన్ని ఆ రోజుల్లో పాటించడంవల్ల శ్రీశ్రీ 58 అనువాద చిత్రాల్లో రాసిన పాటల సంఖ్య అయిదు వందల సంఖ్యను దాటింది.
శ్రీశ్రీ అభిప్రాయపడినట్టు అనువాద గీతాలను రాసేటప్పుడు అనేక ఆంక్షలు, సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ‘క్లోజ్ షాట్స్’లో పెదవుల కదలికకు అనుగుణంగా అనువాద భాషలోని పదాలను ఎన్నుకొని సహజంగా వుండేలా రాయగలగడం రచయిత సమర్థతకు పరీక్ష! శ్రీశ్రీ తర్వాత తెలుగులో సుమారు వందమంది అనువాద గేయకవులున్నా అనువాద కళను అర్థం చేసుకొని ఆ రంగంలో రాణించిన కవులు వేళ్లమీద లెక్కించదగినంత మందే! జీవిక కోసం అనువాద గేయరచనకు ఎగబడి వాటి గౌరవాన్ని పాడుచేస్తున్నారని అసమర్థులైన కవుల మీద శ్రీశ్రీ విరుచుకు పడ్డారు. కథానాయకుడు కథ (1965) అనువాద చిత్రంలోని - ‘ఓహో మేఘ సఖా, ఒక చోట ఆగేవో’ అనే పాట గురించి వివరిస్తూ ‘కొందరు సినీ రచయితలు బయలుదేరి డబ్బింగ్ పాటంటే అసహ్యం పుట్టించేశారు. డబ్బింగ్ పాటలను గ్రామఫోను కంపెనీ వాళ్లు రికార్డులుగా విడుదల చేయడానికి భయపడి పోయారు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనినిబట్టి శ్రీశ్రీ అనువాద గీతాలను కూడా తేలిగ్గా తీసుకోలేదనీ వాటిని కూడా అంకిత భావంతో రాశారనీ అర్థమవుతోంది. ఇంకా చెప్పాల్సి వస్తే అనువాద చిత్రాలపట్ల మక్కువతోనే శ్రీశ్రీ ‘చెవిలో రహస్యం’ అనే డబ్బింగ్ చిత్రాన్ని (మూలం: తమిళం) స్వయంగా నిర్మించి చేతులు కాల్చుకొన్నారు కూడా!
అనువాద చిత్రాల్లోని పాటల్ని మక్కామక్కీగా రాయడం శ్రీశ్రీ మతానికి విరుద్ధం. ఆయన మాటల్ని అనువాదాలనడం కంటే అనుసృజన లనడం సబబు. అవసరమైన మేరకు ‘లిప్‌సింక్’ను పాటిస్తూ సహజమైన తెలుగు నుడికారంతో పాట రాయడం ఆయన పద్ధతి. అందువల్ల శ్రీశ్రీ అనువాద గీతాలు మూలంలోని బాణీలను అనుసరించడం తప్ప సాహిత్యాన్ని యథాతథంగా తీసుకోవడం అరుదు. ఇలా అనువాద గీతాలకు ఒక ఒరవడి పెట్టి, అర్వాచీనులకు మార్గదర్శకులైన శ్రీశ్రీ అనువాద గీతాలు సైతం ఆయన తెలుగులో నేరుగా తీసిన చిత్రాల్లో రాసిన పాటలంత ప్రాచుర్యం పొందకపోవడానికి కారణాలనేకం. అయినా శ్రీశ్రీ అనువాద గీతాల్లో నేటికీ వినిపిస్తున్న ప్రజారంజకమైన గీతాలు, సాహిత్య పరిమళాలుగల పాటలు యెన్నో!) మచ్చుకి కొన్నిటిని పరిశీలిద్దాం-
1. ఆదియు తానే అంతము తానే/ శ్రీరాముడే అణువణువందూ! (శ్రీరామభక్త హనుమాన్-1958)
2. ఔను నిజం ప్రణయరథం సాగెను నేడే/ కోరిన కోరిక పారటలాడే! ఔను! (జింబో-1959)
3. యమునాముఖమున్ కనవే నీ/ కలుకా పరాకదేలో - అలుకా పరాకదేలో (రత్నగిరి రహస్యం-1957) (మూలం: అముదై పొళియుం నిలవే నీ అరుగిల్ వరాద దేనో) అనువాదంలో మూలంలోని బాణీని తప్ప భావాన్ని అనుసరించలేదు.
4 చిత్రమే పాడునటే - ఓహో/ చిత్రమే పాడునటే - నాక
చిత్తమే ఆడునటే (శెభాష్ పిల్లా - 1959)
5. రాణివో నెరజాణవో - నాచెంత సిగ్గది యేలా
నీ వింత చూపు లవేలా - రాణివో - జాణవో (కథానాయకుడు కథ - 1965)
చెపితే తప్ప ఇవి అనువాద గీతాలనే స్ఫురణ కలగదు. ఈ పాటలు అమిత ప్రజాదరణ పొందడానికి శ్రీశ్రీ శైలితోపాటు సంగీత బాణీలు కూడా కారణమే. జింబో, శ్రీరామభక్త హనుమాన్ వంటి పదాలు తెలుగునాట స్థిరపడ్డానికి ఆ చిత్రాలు, పాటలు సాధించిన విజయాలే మూలం.
శ్రీశ్రీ ‘పునర్జన్మ’ చిత్రం కోసం రాసిన ‘ఓ సజీవ శిల్ప సుందరీ నా జీవన రాగమంజరీ’ అనే పాట కోసం బెంగుళూరులోని ఓ కన్నడిగుడు ఆ చిత్రాన్ని ఆ పాట మేరకు ఇరవైమార్లకు పైగా చూసిన ఉదంతాన్ని శ్రీశ్రీ సగర్వంగా చెప్పుకొన్నట్టే ‘గాంధారీ గర్వభంగం’ (1959) అనే అనువాద చిత్రంలోని-
పదునాలుగు లోకముల ఎదురే లేదే/ పదునాలుగు లోకముల ఎదురన్నది లేదుగా
మానవుడే సర్వశక్తి ధాముడు కాదా/ మనుష్యుడిల మహానుభావుడే చూడగా
మనుష్యుడిల మహానుభావుడే...
అనే పాట గురించి కూడా ‘ఒక్కపాట కోసమే మళ్లీ మళ్లీ చిత్రాన్ని చూడాలనిపించే పాటలలో ఇదొకటి’ అని ఆత్మ విశ్వాసంతో వ్యాఖ్యానించారు. ‘గాంధారీ గర్వభంగం’ ఆధారంగా తీసిన ‘బాలభారతం’లోని ‘మానవుడే మహనీయుడు..’ వంటి ప్రజాదరణ పొందిన పాట పై పాట కనుసరణనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పక చెప్పారు.
ఇంకా- 1. ధరణీ దేవత శోషించెనుగా/ ఘోషించెనుగా అంబరమే
అయోధ్య నేడు అరణ్యమాయె/ సమసిపోయెగా సంబరమే (సంపూర్ణ రామాయణం-1961)
2. ఓహో మేఘ సఖా ఒక చోట ఆగేవో
నాతో పగదాల్చి చాటుగ ఆడేవో (కథానాయకుడు కథ - 1965)
3. మధువన మేలే భ్రమరము వోలె/హాయిగ పాడుదమా గీతాలే (వీరప్రతాప్ - 1958)
(మూలం: ముల్లై మలర్ మేలే మొయక్కుం
వండుపోలే...తెలుగు సేతలో మూలంలోని బాణీని రాగాన్ని మార్చి చేశారు.)
4. జయ రఘునందన జయజయరాం/జానకివల్లభ సీతారాం
సంసార జలధీ దాటించగలదీ/ రెండక్షరముల నామమే (శ్రీరామభక్త హనుమాన్ - 1958)
వంటి పాటలు శ్రీశ్రీ అనువాద గేయాల్లో కూడా రసజ్ఞులు పులకించేలా సాహిత్యమాధుర్యాన్ని రంగరించా రనడానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. ‘అయోధ్య నేడు అరణ్యమాయె’ ‘సంసార జలధీ దాటించగలది రెండక్షరముల నామమే’ వంటి అభి వ్యక్తులు శ్రీశ్రీ శబ్దపాటవాన్ని తెలియజేస్తాయి.
శ్రీశ్రీ అంతటి ప్రతిభాశాలి రాసిన అనువాద గీతాల్లో కూడా అనువాద రచనలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులతో కూడిన ప్రయోగాలు అక్కడక్కడా కనిపిస్తాయి.
1. ఆటల్ కనలేరో మా ఆటల్ కనలేరో/ పాటల్ మధురల్ రాజుల ముందర/ పాండ్యుల నేలెడి తాండవ నటనల్ (సాహసవీరుడు - 1956)
2. నారియో జిమ్‌ఖానా కోరుకో గుమ్ ఖానాహై/ ఆడుకో సుల్తానా/ అయిందాకా కదుల్తానా హై (అమరజీవి - 1956)
వంటివి ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.
ద్వితీయ శ్రేణిగా పరిగణిస్తూ అటు పరిశ్రమ ఇటు ప్రేక్షకులు చిన్నచూపు చూసే అనువాద చిత్రగీతాలకు సైతం సాహిత్య గౌరవాన్ని కలిగించిన మహాకవి శ్రీరంగం ఈ రంగంలో కూడా చిరస్మరణీయులు! ఆయన అందరూ స్మరించినట్టు ‘డబ్బింగ్ కింగ్’ మాత్రమే కాదు - అనువాద గీతాలకు ఆచార్యులు, ప్రాచార్యులు కూడా!