
నేడూ నిన్నా కాదు
నీ వయసంత పాతది
నీ వన కాలంనాటిది
ఒక జ్ఞాపకం - ఒకేఒక్క-
ఉగాది పచ్చడిలా బహ రుచికరం
కాలకూట విషంలా బహు కర్కశం
అంతా ఒక జ్ఞాపకం కాదు
బొమ్మా బొరుసూ - బొరుసూ బొమ్మ
నీ పాత్ర ఏమిటి? నీ బాధ్యత
నీ బరువు తూకానిది అందదు
ఆమె నీ జీవిత సహచరి
ఆమె నీ అదృష్టం-
ఎక్కువగా దురదృష్టం
ఆమె నీ శాపం
నీ వరం అని నీ భ్రమ
ఆమె నీ వెంట వస్తుంటుంది
నీకు నిద్ర పడుతుంది
కలకల కలత నిద్ర
నీకు నిద్ర పడుతుంది
గాఢనిద్ర కానే కాదు
నీకు నిద్ర పట్టదు
హస్తమైధునంలో నిద్ర
నీకిక సెక్స్‌యోగం లేదు
ఉన్నా ఆందోళనా సమ్మిళితం
నీకొక గత్యంతరం లేదు
గమ్యం గమనం రెండూ ఒకటే
మరణశిక్ష మోస్తూ తిరగాలి
శిక్ష ఉండదు - రద్దూ కాదు
ఒక ముల్లు గుచ్చుకుంది బతుకులో
ఏ దేవుడూ తియ్యలేడు
ప్రేమ కోసం అలమటిస్తావు
నీ నోట్లోనే నీ ప్రేమ-
పండిపోతుంది
ఒక జ్ఞాపకం మాత్రం నిన్ను వదలదు.
అలసిన ఓ జ్ఞాపకం
-రవి ఆర్కె
రెండు రసాత్మకమైన
క్షణాల అనుబంధానికి
ఎంత వేసారిపోయె
నిరీక్షణల్ని వెతుక్కోవాలి
కదలని కాలాన్ని శపిస్తూ
కవితాత్మను చైతన్యపరుస్తూ
ఎన్ని చూపుల రచనల్ని చేయాలి
లోలోన ఓ అందం
అందాల సరిహద్దుల్లో
విహరిస్తున్న సమయం
వెనె్నల రాత్రి కాదేమో
మసక మబ్బుల్లో అల్లుకొంటున్న
హృదయ శిల్పం
ఏదో నీడ
వెంబడించే కదలిక
ఏదో గాలి
పలుకరించలేక
ఓ అలుక
నాలో నేను
ఓ విరహమైన క్షణం
నాలో నేను అలసిపోయిన
ఓ జ్ఞాపకం.
*
ఎందుకు వచ్చావు?
-ఆశారాజు
కురులు విరబోసుకొని
వెల్తురును మసకపరుస్తూ
ప్రశ్నించే అందాలతో
ఈ టేబుల్ దగ్గరికెందుకు వచ్చావు
ఇక్కడ గ్లాసులో
చందమామ కరిగిపోతోంది
తీరానికి కళ్లు తిరిగి
సముద్రానికి పిచ్చి పడుతోంది
సగం సగం బట్టలతో
సీతాకోక చిలుకలా
ఎందుకిలా వచ్చి వాలావు
సంధ్యా సమయానికి మైకం కమ్మి
కళ్లల్లో వొలికిపోతోంది
నదులన్నీ పగబట్టి
వొంటికి చుట్టుకొంటున్నాయి
పాములు తిరిగే వేళలో
పాటలు పాడుకుంటూ
ప్రాణాలెందుకు లాగుతున్నావు
బయట మంటబెట్టి
లోపల కాలుతూ కూర్చున్నాను
నా మనసును వాసనబట్టి
ఈ పుట్టలోకి ఎందుకు దూరావు
సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు
ఒకేసారి జరిగే కొండలివి
అమృతం కోసం వచ్చిన అప్సరసలా
గుండెను చంకన బెట్టుకొని
ఏ సరోవరం వుందని వచ్చావు
నన్ను బయటకు లాగి బతికించాలని
నువ్వెందుకు నీటి మీద నడవాలని మునుగుతావు
ఎందుకు?!
ఈ మొండితనమెందుకు?
ఎప్పటిదో రుణం తీర్చుకుంటున్నావా!
ఎప్పటికీ నన్ను రుణగ్రస్తుణ్ణి చేస్తున్నావా!*