
ఈ వారం ‘ఆంధ్రాయణం’లో ‘ఎక్కడుంది లోపం?’ వ్యాసం విశే్లషణాత్మకంగా, వివరణాత్మకంగా, నిష్పక్షపాతంగా సాగింది. తెలంగాణ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రాంతీయ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి, విద్య, ఉద్యోగ రంగాలలో బడ్జెట్ కేటాయింపులో ప్రణాళికా కేటాయింపులలో అన్యాయం జరగకుండా చక్కని రక్షణ వ్యవస్థను అందస్తి ఈ సువర్ణావకాశాలను అందిపుచ్చుకోలేక తమ ప్రాంతం ప్రయోజనాలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైన తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులే తొలి ముద్దాయిలు. సీమాంధ్రులు వచ్చి తెలంగాణను కొల్లగొట్టారని ఆడిపోసుకోవడం కంటే రాజ్యాంగపరంగా లభించిన హక్కులను ఉపయోగించుకొని మన ప్రాంతానికి రావల్సిన వనరులు, నిధులను ప్రభుత్వం మెడలు వంచి రాబట్టుకొని తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి కృషి చేయడం ఎంతో సహేతుకం. ఆంధ్రా- తెలంగాణ ప్రాంతాల మధ్య విభేదాలను రెచ్చగొట్టి, పెంచి పోషించడానికి రాజకీయ అవకాశవాదమే అసలు కారణం అని ప్రజలు గుర్తెరిగిన నాడు రావణకాష్ఠంలా రగులుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
-సిహెచ్.సాయి ఋత్త్విక్ (నల్గొండ)
విడ్డూరం
ఆదివారం అనుబంధంలో శీర్షికలతోపాటు ప్రపంచ వింతలెన్నో పాఠకుల్ని ఆకట్టుకొంటున్నాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తయారుచేసిన పెద్ద రాకాసి బూర నంచి వచ్చే శబ్దం, రెండు స్పేస్ జెట్స్ ఒకేమారు టేకాఫ్ అయితే వచ్చే విపరీత శబ్దానికి సమానస్థాయిలో ఉంటుంది అని తెలిసి ఆశ్చర్యపోయాం. పాకిస్తాన్‌లో ఒక ప్రముఖ టీవీ యాంకర్, రంజాన్ నెలలో రోజూ 7 గంటలు స్పెషల్ లైవ్ షో ఇస్తూ, షోలో పాల్గొన్న సెలెక్టెడ్ ప్రేక్షకులకు బహుమతులుగా ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు శిశువుల్ని అందించడం వింతల్లోనే విడ్డూరం.
-తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి (మల్కాపురం)
అక్షయ
పోర్ట్‌లాండ్‌లో ఓ అద్భుతమైన ఇల్లు. దానికి అమరిన అన్ని హంగులూ మైమరపించాయి. ధర 35 లక్షల డాలర్లు తక్కువే. ఆర్టిస్ట్ జారియా - పార్మన్ చేతివేళ్లనే కుంచెగా మార్చుకొని అద్భుతంగా సృష్టిస్తున్న ఐస్‌బర్గ్, సునామీలా ఎగసిపడుతున్న సముద్ర కెరటాలు, భారీ ఫొటో చిత్రాలుగా భ్రాంతి కలిగించాయి. మధురై వీధుల్లో ఆకలితో అలమటిస్తున్న పేదలకి రోజూ ఆకలి తీరుస్తున్న నారాయణన్ కృష్ణన్ నిజమైన హీరో.
-టి.సాయి సంతోషిణి రీతి (అనకాపల్లి)
పెత్తనం
భారత్‌లో క్రికెట్ ఆటను విపరీతంగా ఆరాధిస్తున్న వీరాభిమానులు అన్ని వయసుల్లోనూ కొన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ మన టీమ్ ఆడుతున్నా టీవీలకు జనం అతుక్కుంటూ తన్మయులౌతారు. ఆటరోజు స్కూళ్లకి, ఆఫీసులకి హాజరు తక్కువగా ఉంటుంది. రోడ్డుపై సంచారం కూడా పల్చగా మారడం చూస్తున్నాం. ఆటపై అభిమానుల ఫాలోయింగే బిసిసిఐకి వేల కోట్ల రూపాయల ఆదాయం స్పాన్సర్ల ద్వారా, టికెట్ల అమ్మకాలు, ఇతర విభాగాల నుంచి సమకూరడం, టెస్ట్ హోదాగల 10 దేశాలను కంట్రోల్ చేస్తున్న ఐసిసిని మనమే ఆజ్ఞాపించే స్థాయికి ఎదగడం దేశానికే గొప్ప గౌరవం.
-యల్లాప్రగడ మల్లన్న (గుల్లలపాలెం)
హైలైట్
‘ఆంధ్రాయణం’ ధారావాహికంగా ఆలోచింపజేసేదిగా ఉంది. ఢిల్లీ సృష్టించిన ముసలం చాలా బాగుంది. గాంధీ నెహ్రూలు కాశ్మీర్ కల్లోలానికి ముఖ్యకారకులయ్యారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన పేరుతో ‘ఆంధ్ర-తెలుగు’ ప్రాంతాలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలో ఢిల్లీ అధిష్ఠానం ఆనాడు కలిపింది. ఈనాడు ఢిల్లీ అనధికార అధినేత సోనియా గాంధీ ఆంధ్రలో అగ్గి పుట్టించింది? నెహ్రూ వారసురాలు కదా?
-సీరపు మల్లేశ్వరరావు (కాశీబుగ్గ)
నిజం
‘గేమ్స్ గాగా’ గురించి చెప్తూ నిరుపయోగంగా వదిలేస్తే మనిషి మెదడు కూడా తుప్పు పడుతుందన్నారు. అదెంత నిజమో మెదడుని ఎక్కువగా ఉపయోగించినా పనికి రాకుండా పోతుందన్నదీ అంతే నిజం. ఏదైనా అతి చేస్తే గతి చెడుతుంది. మాయా ప్రపంచజాలంలో చిక్కుకొని పిల్లలే కాదు పెద్దలు కూడా సకలం మరిచిపోయి కంప్యూటర్లకు అతుక్కుపోవడం చూస్తూనే ఉన్నాం. నలుగురూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందించే రోజులు పోయాయి. ఫేస్‌బుక్‌లో దూరిపోయి వాస్తవ జీవితానికి దూరంగా ప్రత్యేక ప్రపంచం నిర్మించుకొని అందులోనే ఉండిపోయే జీవులు ఎక్కువయ్యాయి. నెట్‌లు, గేమ్స్ వల్ల లాభాలున్నా నష్టాలు కోరి తెచ్చుకుంటున్నాం.
-శాండీ (కాకినాడ)
ఆశ్చర్యం
ఆదివారం అనుబంధంలో ‘ఏమి లోకమిది’ శీర్షికన అందిస్తున్న బిట్స్ మా ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొంటున్నాయి. అమెరికన్ పెయింటర్ విలియం బ్రాడ్‌ఫోర్డ్‌ను ఆదర్శంగా తీసుకొని చేతివేళ్లను, వాటి అంచులలోని గోళ్లను కుంచెలుగా మార్చుకుని అరచేతితో అద్భుతాలు సృష్టిస్తున్న జారియా ఫార్మన్ గురించి తెలుసుకొని ఆశ్చర్యచకితులమయ్యాం. కెమెరా ఇమేజ్‌లను తలపించే రీతిలో ఆవిడ రూపొందిస్తున్న చిత్రాలు నిజంగా అద్భుతం.
-అల్లాడి వేణుగోపాల్ (బారకాసు)
సండే గీత
ఆదివారం అనుబంధంలో ‘సండే గీత’ హైలైట్. ఏ కళాకారుడైనా లేదా ఏ వ్యక్తి అయినా చేసే పని మీద మనసు పెట్టి చేస్తే ఆ పని బాగుంటుంది. లేకుంటే అసంపూర్తిగా అసంతృప్తిగా ఉంటుంది అన్న చక్కటి నిజాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు. ‘ఏమి లోకమిది’లో పిల్లి లికోయ్ యజమాని పట్ల ఎంతో కరుణ కలిగి ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజానికి జంతువులకున్న ప్రేమ మనుషుల్లో లేదు. ‘సిసింద్రీ’లో చదువు విలువ కథ బాగుంది. మనిషిలోగల వినయం మనిషిని ముందుకు నడిపిస్తుంది. అహంకారం, నిర్లక్ష్యం మనిషిని వెనకే నిలబెడుతుందని చక్కగా తెలియజేశారు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)