
మార్చి 9 నుండి 15 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)
పట్టుదలలు, ఆత్మాభిమానం పక్కనపెట్టి సామరస్యంతో మెలగవలసిన తరుణమిది. శాస్ర్తియ దృక్పథంతో నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. సర్వీసులు, సంచార పథకాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. 10, 11 తేదీల్లో ఒప్పందాలు, పోటీలు, ప్రారంభాలకు అనుకూలం. భాగస్వామ్యాలలో అవకాశం అవతల వారికి ఇవ్వడం ఉపయుక్తం. ఇంటర్వ్యూలు, ప్రవేశపరీక్షలతో మీ శక్తియుక్తులు రాణిస్తాయని చెప్పవచ్చు.
వృషభం (ఏప్రిల్ 21 - మే 21)
పూర్వానుభవాలను దృష్టిలో ఉంచుకుని నవీన పథకాలను మార్గాలను ఆచితూచి అమలులో పెట్టే ప్రయత్నం చేస్తారు. రహస్య నివేదికలు అందుకుంటారు. శాస్తజ్ఞ్రులు, కళాకారులు తమ ప్రతిభకు తగిన ప్రాధాన్యతను పొందుతారు. విందులు, వివాహాలలో పాల్గొంటారు. విలువైన భూషణాలు, వస్త్రాలు లభ్యమవుతాయి. ఆత్మీయులతో కలసి వివిధ విషయాలపై అవగాహన పెంపు చేసుకుంటారు. ధర్మ ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు పెరుగుతాయి.
మిథునం (మే 22 - జూన్ 21)
విద్య, సంతానం, వివాహ విషయాల మీద ప్రత్యేక దృష్టి నిలుపుతారు. రావలసిన వాటికై చేసే ప్రయత్నాలలో సంయమనం పాటించడం అవసరం. దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, ఫలప్రదమైన రంగాలలో పెట్టుబడులు పెంచడం మీ ప్రావీణ్యాన్ని పెంపు చేసుకోవడానికి సమయాన్ని కేటాయించడం జరుగుతాయనవచ్చు. మందుల వాడకం ద్వారా ఆరోగ్యం కుదుట పడుతుంది. ఉన్నత ప్రమాణాలను పాటించి సత్ఫలితాలనలు అందుకుంటారు. ఆస్తి లావాదేవీలు జరుగుతాయి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23)
అసంబద్ధంగా సాగుతున్న వ్యవహారాలు ఒక క్రమంలో నడిపించి మీ సత్తా చాటుకుంటారు. వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండి మీ గౌరవాన్ని కాపాడుకుంటారు. అన్నిటా స్వీయ పర్యవేక్షణ ఉండేటట్లు జాగ్రత్త వహించండి. ఆస్తి లావాదేవీలు, స్పెక్యులేషన్ వాయిదా వేయడం ఉత్తమం. యంత్ర వాహనాదుల వలన కష్ట నష్టాలు రాకుండా జాగ్రత్త వహించండి. అధికారులతో మీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేసి ఊపిరి పీల్చుకుంటారు.
సింహం (జూలై 24 - ఆగస్టు 23)
ఆత్మీయుల అభయంతో ధైర్యం తెచ్చుకొని కార్యోన్ముఖులవుతారు. సహచరులను అనునయించి మీ దారికి తెచ్చుకోగలుగుతారు. క్రీడలు, పుస్తక పఠనం పట్ల ఆసక్తి, ఉత్సాహం పెరుగుతుంది. వన విహారాలు, వినోదాల ద్వారా ఆహ్లాదం పొందుతారనవచ్చు. బాధ్యతలు భయపెడుతున్నా భాగస్వాములు మీ వెన్నంటి నిలిచి ఉంటారు. వృత్తి వాణిజ్యాలలో సాధారణ ప్రగతి మాత్రమే ఉండవచ్చు. భవిష్యత్ పథకాలపై సూత్రప్రాయంగా అంగీకారానికి వస్తారు.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబర్ 23)
భుక్తి కోసం కృషి చేసినా ఇతర బాధ్యతలను విస్మరించడం వల్ల ఆత్మీయుల అసహనాన్ని చవి చూస్తారు. దినచర్యలో మార్పులు తప్పకపోవచ్చు. యంత్రాలు, వాహనాలలో లోపాలను సకాలంలో సవరించి నష్టాలను నివారించగలుగుతారు. ఏ విషయంలోనూ గుడ్డిగా ఇతరులను అనుసరించక పోవడం ఉత్తమం. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించి పిన్నల పెద్దల మన్ననలను పొందుతారు. శుక్ర శనివారాల్లో ప్రముఖులతో చర్చలు, సమావేశాలు నూతన మార్పులకు దారి తీయవచ్చు.
తుల (సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23)
ఇతరుల మీపై వేసే నిందలు, అపవాదులను ధైర్యంగా ఎదుర్కొని దీటుగా స్పందిస్తారు. బలహీనులకు సాయం చేయడంలో అందరికంటే ముందుంటారు. వద్దనుకున్న కొన్ని అనవసర బాధ్యతలు భరించాల్సి రావచ్చు. అవసరాలకు తగిన విధంగా అందుతుందనడంలో సందేహం లేదు. అన్ని వర్గాల వారినీ కూడగట్టుకుని ముఖ్య లక్ష్యాలను సాధించడంలో కృతకృత్యులవుతారు. అధికారుల మన్నన, ఆత్మీయుల సహకారం లభిస్తాయి.
వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 23)
నిదానమే ప్రధానం అనే స్ఫూర్తిని పాటించండి. సోమ మంగళ వారాల్లో ప్రతికూలత అధికంగా ఉన్నా తదుపరి మీ ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. కుటుంబ వ్యక్తులతో అనునయంగా ప్రవర్తించి వారి తప్పులను గ్రహించేట్లుగా చేయగలుగుతారు. విద్యార్థులకిది పరీక్షా కాలం. జనంలో వస్తున్న చైతన్యాన్ని గుర్తించి, మీలో కూడా మార్పులను ఆహ్వానించే సూచనలున్నాయి. భాగస్వాములు మీ అవసరాలను గుర్తించి ఆదుకుంటారు. క్రయ విక్రయాలలో, ప్రయాణాలలో మెలకువ అవసరం.
ధనుస్సు (నవంబర్ 24 - డిసెంబర్ 22)
ఆత్మీయుల అభిమతాన్ని గౌరవించి మీ వ్యవహారాలలో మార్పులు చేర్పులు చేస్తారు. కష్టనష్టాలను బేరీజు వేసుకుని కొత్త లావాదేవీలకు సమాయత్తమవుతారు. మీ ఆలోచనలను అమలు చేయగల సమర్థులు అందుబాటులోనికి వస్తారు. కళా సారస్వత రంగాలలో అవకాశాలు మెరుగవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతికూలత తొలగి మీ కృషికి తగిన గుర్తింపు, ప్రాధాన్యతను పొందుతారు. కృషీవలులకిది ప్రోత్సాహక సమయం.
మకరం (డిసెంబర్ 23 - జనవరి 22)
వారం ప్రథమార్ధంలో సులభంగా పనులు సాగినా క్రమంగా మానసిక వత్తిడి పెరగవచ్చు. వ్యవసాయదారులకు, కార్మికులకు సంయమనంతో, ఓపికతో ఉండాల్సిన తరుణమిది. కుటుంబ విషయాల్లో సానుకూలత ఏర్పడి క్రియాశీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తలపెట్టిన శుభకార్యాలు, అభివృద్ధి పథకాలకు కావలసిన వనరులు అమరుతాయని ఆశించవచ్చు. వివాహ ప్రయత్నాలలో సన్నిహితుల సహకారం తోడవుతుంది. ఆశించిన లక్ష్యాలు, ర్యాంకుల సాధనకై విద్యార్థులు నిర్విరామ కృషి చేయాలి.
కుంభం (జనవరి 23 - ఫిబ్రవరి 20)
మీలో ఉన్న కార్యదీక్ష, తృష్ణలకు తగిన ప్రోత్సాహం పెద్దలు, అధికారుల నుండి లభిస్తుంది. మరుగున పడ్డ వస్తువులు తిరిగి చేతి కందడంతో ఆనందిస్తారు. ముఖ్య వ్యవహారాలు సంతృప్తికరంగా ముగియడంతో కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఖర్చులు అధికమయినా, ఆశించిన ఫలితాలు, ప్రతిఫలం అందడంతో మనోల్లాసం పొందుతారు. పనివారితో, స్ర్తిలతో వాదోపవాదాలు తప్పకపోయినా చివరకు మీ అభిమతాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మీనం (్ఫబ్రవరి 21 - మార్చి 20)
అభివృద్ధికి, నాణ్యతకి పెద్దపీట వేసి మీ ప్రయోజకత్వాన్ని చాటి చెప్పుకుంటారు. వారారంభంలో కార్యభారం, ప్రయాణాలు మీకు అలసట కలిగించినా ఫలితాలు సంతృప్తి నిస్తాయి. మాటల్లో కఠినత్వాన్ని వీడి, మీ అభిప్రాయాలను ఆత్మీయులకు సున్నితంగా వివరించండి. అపోహలను వీడి ఆరోగ్యం మెరుగవడానికి సకాల భోజనం, నిద్ర అవసరమని గ్రహించండి. చర్చల ద్వారా వృత్తి వాణిజ్యాలు మెరుగైన స్థితికి చేరుకుంటాయి.