
అమరయ్య -మధ్య తరగతి మనిషి. భార్య, ముగ్గురు పిల్లలే అతని కుటుంబం, ప్రపంచం. పొద్దునే్న పనికెళ్లడం, సాయంత్రం -పని నైపుణ్యం పెంచుకునే శిక్షణ తరగతులకు వెళ్లడం. ఇదీ దైనందిన జీవితం. ఒక్క ఆదివారం తప్ప -మిగిలిన ఏ రోజూ కుటుంబంతో కలిసి ఆనందం పంచుకోలేదు. అతని లక్ష్యం ఒక్కటే. జీవితంలో ఎదగాలి. కుటుంబాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టాలి. ఏదీ లేదన్నది లేకుండా -సదుపాయాలు, సౌకర్యాలు అందించాలి. అందుకు సరదాలు, ఆనందాలు పక్కనపెట్టాలి. కష్టపడాలి. ఇదే తత్వం.
ఒకరోజు -‘ఈరోజు పెళ్లి రోజు. సెలవుపెట్టి ఇంట్లో నాతో వుంటే ఆనందం. కొద్ది క్షణాలైనా గడిపే సమయం ఇవ్వండీ... ప్లీజ్’ అంటూ ప్రాధేయపడింది సులోచన. ‘సారీ డియర్. పెళ్లి రోజులు మళ్లీమళ్లీ వస్తాయ్. కానీ, సంపాదించే రోజులు రావు. లైఫ్‌లో ఇప్పుడు మిస్సయినవన్నీ ఒక్కసారే ఎంజాయ్ చేద్దాం. ఓపిక పట్టు’ అనునయించాడు భార్యను. కాదనలేకపోయింది సులోచన. -‘నాన్నా బయటకు తీసుకెళ్లవా?’ అంటూ పిల్లలు అడిగినప్పుడూ ఇదే సూత్రం వల్లించాడు అమరయ్య. ఏళ్లు గడిచాయి. అన్నట్టుగానే లెక్కలేనంత సంపాదించాడు. కార్లు, మేడలొచ్చాయి. కష్టపడే అవకాశం లేకుండా అధునాతన వస్తువులు అమరాయి. భార్యకు నగలు, పిల్లలకు పెద్ద చదువులు -అన్నీ ప్రణాళికగా సాగిపోయాయి. గొప్ప సక్సెస్‌ఫుల్ ఫెలో అనిపించుకున్నాడు.
ఒకరోజు ఇంట్లో కుటుంబం సమావేశమైంది. అమరయ్య మాట్లాడుతూ -‘నేనెలా ఎదిగిందీ అందరికీ తెలుసు. సరదాలూ, సరసాలు, ఆనందాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని పొందేందుకు డబ్బు పని లేదు. అందుకే -డబ్బు, దాని అవసరం ఉన్నవాటిని ముందు సంపాదిస్తే జీవితమంతా హాయిగా సాగుతుంది. ఇప్పుడిక నేను రిటైరవుతున్నా. అమ్మా నేనూ ఆనందంగా టూర్లు వేస్తాం. బాధ్యతలు మీరు చూసుకోండి పిల్లలూ’ అన్నాడు. ‘సులోచనా.. ఇంతకాలం సరైన నిద్రాహారాలు లేక అలసిపోయాను. ఒక్కరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుని, రేపు గోవా తీసుకెళ్తాను. ఇవిగో ఫ్లైట్ టికెట్లు’ అన్నాడు అమరయ్య. మురిసిపోయింది సులోచన. శుభ్రమైన భోజనం చేశాడు. రేఫు ఫ్లైట్లో ఎగిరే ఆనందాన్ని కలలుగంటూ నిద్రపోయాడు.
**
మర్నాడు.. అమరయ్య లేవ లేదు!
**
అమరయ్య ఆనందం ఫైట్లో ఎగిరిపోయింది. అతను మంచంమీదే కట్టెలా ఉండిపోయాడు. అదింక ఎప్పటికీ అతనికి -దొరకదు. *