ఒంగోలు, మార్చి 8: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేనెల 15వ తేదీ నుండి మే చివరి వరకు సముద్రంలో మరపడవులు, ఇంజన్ పడవల వేటను రాష్ట్రప్రభుత్వం నిషేధించింది. ఆ సమయంలో సముద్రగర్భంలో తల్లిచేపలు గుడ్లుపెట్టేదశలో ఉంటాయి. దీంతో మరపడవలు, ఇంజన్ పడవల మత్స్యకారులు వేట సాగిస్తే భావితరాలకు ఉపయోగపడే మత్స్య సంపద మొత్తం కొట్టుకుపోనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేట నిషేధంతో ప్రధానంగా రాష్ట్రంలో తీరం వెంబడి ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మత్స్యకారులు ఆర్ధికంగా ఇబ్బందులు పడనున్నారు. రాష్టవ్య్రాప్తంగా మరపడవలు, ఇంజన్ల పడవలు వచ్చేనెల 15వతేదీనుండి సముద్రపు అంచునే ఉంటాయి. ఆ రోజుల్లో సముద్రపు ఉత్పత్తులు తగ్గి చేపల రేట్లు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. దీంతో చేపల ప్రియులు మాత్రం సముద్ర ఉత్పత్తులను తగ్గించి చెరువుల్లోని చేపలను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు. దీంతో వాటి ధరలు ఆకాశాన్నంటే సూచనలు కన్పిస్తున్నాయి. సముద్రంలోని ఎనిమిది కిలోమీటర్లలోపు సాంప్రదాయ పడవలతో మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చు. ఆ సమయంలో వారు వేటాడే చేపలకు మంచి గిరాకి ఉంటుంది. దీంతో సంప్రదాయ మత్స్యకారులు ప్రతిరోజు వేట సాగించేందుకు ముందుకు రావటం పరిపాటిగా మారింది. ప్రకాశం జిల్లాలో 102 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, శింగరాయకొండ, ఉలవపాడు మండలాల్లో పరిధిలో 42మరబోట్లు , వెయ్యి ఇంజన్ పడవలు ఉన్నాయి. సముద్రంలో వేట నిషేధం కారణంగా జిల్లాలోని 14వేలమంది మత్స్యకార కుటుంబాలపై ఆ ప్రభావం పడనుంది. కాగా వేట నిషేధం సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులను ఆదుకోనున్నాయి. మత్స్యకారులు తమవంతుగా ఆరువందల రూపాయల పొదుపుచేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల రూపాయలు, కేంద్రప్రభుత్వం మరో ఆరువందల రూపాయలను ఈ కాలంలో చెల్లిస్తుంది. అవికాకుండా ప్రతికుటుంబానికి 30కేజిల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. కాగా వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు కందిపప్పు, నూనె, కిరోసిన్ కూడా పంపిణీ చేయాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలాఉండగా వెనామీ రొయ్యలధరలు ఆశాజనకంగా ఉండటంతో మత్స్యకారులు కొంతమంది ఆక్వా సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. మొత్తంమీద వేటనిషేధం కాలంలో మత్స్యకారులు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేనెల 15వ తేదీ నుండి మే చివరి వరకు సముద్రంలో
english title:
fishing banned
Date:
Sunday, March 9, 2014