శ్రీకాకుళం, మార్చి 8: ఎన్నికలంటేనే రాజకీయ నేతలు గెలుపుపై వ్యూహాలు, ప్రతివ్యూహాలకు సిద్ధమవుతుంటారు. ప్రత్యర్థులపై పైచేయి, అసమ్మతులు బుజ్జగింపులు, అనుచరులకు తాయిలాలు వంటితో ఎన్నికల్లో ఓటు తమకే దక్కేలా పావులు కదుపుతుంటారు. అయితే ఈ సారి ఎన్నికలకు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఎన్నికల మీద ఎన్నికలు ముంచుకురావడంతో రాజకీయ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ ఎన్నికల వలన తమ చేతి చమురు అధికంగా వదిలించుకోవడంతో పాటు, విజయం దరి చేరుతుందా లేదా అనే భయం వారిలో వెంటాడుతోంది.
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంతో మున్సిపల్ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఈలోగా సర్ధుకునే తరుణంలోనే స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం అంతా సిద్ధం చేస్తుంది. దీంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఈ ఎన్నికలు గుదిబండగా మారుతున్నాయి. తాము విజయం వైపు అడుగులు వేయాలంటే కిందిస్థాయి ఎన్నికలను ఎదుర్కోవాలని, అయితే ఆ ఫలితాలు తదుపరి ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళన వారిలో నెలకొంది. దీనికి తోడు మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్‌లు ప్రకటించడం వరకూ సరే! మరి వారి ఎన్నిక ఏ పద్ధతిలో ఉంటుందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం తలెత్తుతోంది. గవర్నర్ ఏ మేరకు చొరవ చూపిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా మున్సి‘పోల్స్’ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు, చివరిగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఇలా మూడు ఘట్టాలుగా మూడు మాసాల్లో పూర్తిచేసేందుకు అధికారులు తీస్తున్న పరుగులు కంటే రాజకీయ నేతలను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికలను ఈ నెల 30వ తేదీ నిర్వహించనుండటంతో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించాయి. మధ్యలో జెడ్పీటిసీ, ఎం.పి.టి.సీ ఎన్నికలకు కూడా నగారా మోగడంతో సార్వత్రిక ఎన్నికలపై పూర్తిస్థాయిలో వ్యూహరచన చేసేందుకు సమయం లేకుండాపోతుందన్న భావన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి మే 7న ఎన్నికలు జరగనున్నాయి. మూడు నెలలు ముందుగా సార్వత్రిక ఎన్నికలకు గడపగడపకు వెళ్లి ప్రచారం చేయడానికి కూడా ఎమ్మెల్యే, ఎం.పి. అభ్యర్ధులకు సమయం సరిపోదు. ఇంతలోనే మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటిసీ, ఎం.పి.టి.సీ ఎన్నికలు నిర్వహించడంతో సార్వత్రిక ఎన్నికల ఎత్తులుపైఎత్తులకు దృష్టిపెట్టే ఛానే్స ఉండకపోవచ్చు. అంతేకాకుండా, మున్సిపల్, జెడ్పీటిసీ, ఎం.పి.టి.సీ ఎన్నికలతో అసెంబ్లీ, ఎం.పి. అభ్యర్థ్ధులు ఎన్నో సమస్యలు ఎదుర్కొవల్సివుంటోంది. స్థానిక ఎన్నికల్లో సంతృప్తిపరచలేని కేడర్ సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ వ్యతిరేకంగా పనిచేస్తారోనన్న భయం అన్నీ రాజకీయ పక్షాలను వెంటాడుతోంది. కేడర్‌ను సంతృప్తిపర్చడమేకాకుండా, ఆర్థిక వనరులు అందించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయని రాజకీయ పరిశీలకులు చెప్పకనేచెబుతున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసెంబ్లీ బరిలో ఉన్న అభ్యర్థ్ధులు 28 లక్షల రూపాయలు మాత్రమే ఎన్నికల వ్యయం చేయాలన్న నియమావళి పెట్టింది. ఆ మొత్తంతో ఎన్నికల నిర్వహణ చేయడం జరిగేపనికాదన్నది జగమేరికన నిజం. కాని - కాకిలెక్కలు నడుమ ఆ మొత్తంతోనే ఎమ్మెల్యే అభ్యర్ధులు నామినేషన్లు నుంచి ఓటింగ్ వరకూ సర్ధుబాటు చేసుకునేందుకు అవస్థలు పడే సమయంలో మున్సిపల్, స్థానిక ఎన్నికలు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేయడం ఖాయమని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గగ్గోలుపెడుతున్నారు. ఇదంతా - కేవలం సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టిలేకుండా చేయడమే మేడమ్ సోనియా పన్నిన పన్నాగమంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ, జిల్లాలో మున్సిపాలిటీ, జెడ్పీటిసీ, ఎం.పి.టి.సీ., సార్వత్రిక ఎన్నికల ఘట్టాలు అన్నీ రాజకీయ పక్షాలను గందరగోళంలో నెట్టేసాయి!!
ఎన్నికలంటేనే రాజకీయ నేతలు గెలుపుపై వ్యూహాలు, ప్రతివ్యూహాలకు
english title:
horu
Date:
Sunday, March 9, 2014