శ్రీకాకుళం, మార్చి 8: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి బరిలో దిగేందుకు మార్గం సుగమమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్యే సీటు ఖరారు చేసిందని పలుమార్లు ధర్మాన చెప్పుకొచ్చినా...జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళంలో గుండ అప్పలసూర్యనారాయణ (దేశం) కుటుంబీకులను ఎదుర్కొనే శక్తి ధర్మానకే ఉందని, ఆయనకే ఎమ్మెల్యే సీటు ఖరారు చేస్తున్నట్లు పదేపదే సభల్లో వెల్లడించినా...జగనన్న తనకే ఎమ్మెల్యే సీటు ఇస్తానని మాట ఇచ్చారంటూ వరుదు కళ్యాణి చేసే ప్రచారం మధ్య నేతలు, కార్యకర్తలు అయోమయపరిస్థితుల్లో అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ సీటు జనరల్ మహిళకు కేటాయించింది. దీంతో శ్రీకాకుళం ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడుతున్న ధర్మాన, వరుదు కళ్యాణిల మధ్య సీట్లు సర్దుబాటుకు అవకాశం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మాన సీటుకే గ్యారంటీ లేదన్న ప్రచారం మధ్య ఆయన, వరుధు వేర్వేరు మార్గాల్లో పార్టీ ప్రచారం ప్రారంభించారు. ధర్మాన జెండా పండుగ అంటూ జనంలోకి వెళ్తుంటే - జనభేరీ పేరిట వరుదు కళ్యాణి ప్రచారం చేయడం ప్రారంభించారు. కాని - ఈ రెండు కార్యక్రమాల మధ్య అసెంబ్లీ సీటు ఎవరికి దక్కుతోందన్న గందరగోళంలో ధర్మాన - కళ్యాణిల మధ్య కేడర్ నలిగిపోతున్న సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించినట్లు ప్రకటన వెలువడడంతో ఇద్దరి మధ్యసర్దుబాటకు అవకాశం వచ్చింది. అసెంబ్లీ టిక్కెట్ వస్తుందనే గ్యారంటీ లేకపోటంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన వెంట తిరిగే కేడర్ కూడా రెండడుగులు ముందుకి..ఒక అడుగు వెనక్కి వేస్తూ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితులకు ఇకపై ఫుల్‌స్టాప్ పెట్టేలా జెడ్పీ చైర్మన్ బరిలో వరుదును దింపేందుకు వైకాపా అధిష్ఠానం సన్నద్ధం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ఖరారు కాగానే ధర్మానకు లైన్ క్లీయర్ అయిందని, పార్టీ కోసం ముందునుంచి కష్టపడుతున్న కళ్యాణీకి ఎప్పుడో నామినేటేడ్ పదవుల కంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందే జెడ్పీ చైర్మన్‌గా పదవీబాధ్యతలు స్వీకరించేలా దృఢంగా పనిచేయాలన్న సంకేతాన్ని కూడా ఆ పార్టీ అధిష్టానం జిల్లా నేతలకు అందించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉండగా గతంలో సారవకోట జెడ్పీటిసీగా పనిచేసిన వరుదు కళ్యాణికి జిల్లా పరిషత్ రాజకీయాలతో అనుభవం ఉంది. సీల్డు కవరులో నాడు చంద్రబాబునాయుడు వై.వి.సూర్యనారాయణ పేరు పంపటంతో ఆమెకు జడ్పీ చైర్మన్ పదవి దక్కలేదు. అయితే, పరోక్ష ఎన్నిక పద్దతిలో చైర్మన్‌ను ఎన్నుకుంటే వరుదు కళ్యాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కుర్చీలో కూర్చునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రత్యక్ష ఎన్నిక పద్దతిలోనైతే ఆ సీటులో కూర్చునేందుకు మాత్రం చాలా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉందని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి
english title:
skl
Date:
Sunday, March 9, 2014