ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఉన్నట్లే నెల్లూరు జిల్లాకు కూడా విశిష్టమైన మాండలిక పదసంపద వున్నది. అయితే మాట తీరులోనూ, మాటకారితనంలోనూ, ఎదుటి వ్యక్తుల్ని మాటలతో ఆకట్టుకోవడంలోనూ, నెల్లూరు మాటతీరే వేరు. మాటల్లో, చేతల్లో నెఱజాణత్వం కనిపిస్తుంది. తెలుగు చిత్రసీమలో నెల్లూరు మాండలికాన్ని పండించి, ఆంధ్రులకు రుచి చూపించిన వారిలో హాస్య నట బ్రహ్మ తిక్కవరపు రమణారెడ్డి, సహజ నటి వాణిశ్రీ, విలక్షణ విలన్ రాజనాల పేర్కొనదగినవారు. రమణారెడ్డిగారు తమ హావభావాల్ని, మాటతీరును మిళితం చేసి నెల్లూరు మాండలికాన్ని సినిమాల్లో సుసంపన్నం చేశారు. నెల్లూరు జిల్లా భాషా విషయక ప్రస్తావనలోకి వెళ్ళేముందు, జిల్లా చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ జిల్లా ఉత్తర ఆర్కాటు, చెంగల్పట్టులోని కొన్ని ప్రాంతాలతో కలిసి ‘ముండ రాష్ట్రం’లో పూర్వం భాగమై వుండేది.
క్రీ.శ. 3వ శతాబ్దినుంచి శాతవాహన, ఇక్ష్వాక, పల్లవ, చోళుల పాలనలో వుండేది. క్రీ.శ. 13వ శతాబ్ది శాసనాల్లో నెల్లూరుజిల్లా విక్రమ సింహపురంగా పేర్కొనబడింది. క్రీ.శ. 12వ శతాబ్ది పూర్వం నుంచి తెలుగుచోళులు, కాకతీయులు, పాండ్యులు, రెడ్డిరాజులు విజయనగర స్వాధీనంలో ఒకరి తర్వాత ఒకరి పాలనలో వుంటూ వచ్చింది. అయితే తన ప్రాభవాన్ని, ప్రాబల్యాన్ని, మాండలికాన్ని పదిలంగానే కాపాడుకుంది.
2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 26,59,661 కాగా, పురుషులు 13,41,192 మరియు స్ర్తిలు 13,18,469 మంది. నెల్లూరు, రావూరు, వేంకటగిరి, ఆత్మకూరు, కావలి, సూళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరు, కోవూరు, ఉదయగిరి తాలూకాలుగా విభజింపబడింది. ఆ తర్వాత అనేక మండలాలతో విభక్తమయింది.
నెల్లూరు జిల్లాకు తూర్పున బంగళాఖాతం, పడమరన కడపజిల్లా, ఉత్తరాన ప్రకాశం జిల్లా, దక్షిణం చిత్తూరు జిల్లా హద్దులు.
ఈ కారణంవల్ల సముద్ర తీర ప్రాంతాలైన కావలి మొదలు సూళ్ళూరుపేట వరకూ గల ప్రాంతాల్లో నెల్లూరు మాండలీకం ‘కల్తీ’కాని అపరంజిలా భాసిల్లింది. పడమర కడప జిల్లా సరిహద్దుల్లోని సీతారాంపురం, మర్రిపాడు, రాపూరు, డక్కిలి, వేంకటగిరి ప్రాంతాల్లో కడప మాండలికం కొంత నెల్లూరు మాండలికంపై ప్రభావం చూపించింది. కడప జిల్లా సరిహద్దు ప్రాంతంలోని పెంచలకోన, నృసింహుని పుణ్యక్షేత్రం, కడపవాసుల ఆరాధ్యదైవం కావడం కూడా ఈ మాండలిక ‘కలబోతకు’ కొంత కారణం.
ఉత్తర ప్రాంతాలైన కావలి, జలదంకి, కొండాపురం, కలికిరి ప్రాంతాలు ప్రకాశం జిల్లా సరిహద్దులు. అందువల్ల ప్రకాశంజిల్లా మాండలిక ప్రభావం ఈ జిల్లా మాండలికంపై ఉన్నది.
దక్షిణ ప్రాంతాలు వేంకటగిరి, బాలాయపల్లి, పెళ్ళకూరు, తడ వంటి ప్రాంతాలు కడప, చిత్తూరు జిల్లాల మాండలికాన్ని కలుపుకొని, కొత్త మాండలికం ఒరవడిని అందుకున్నారు.
పులికాట్, సూళ్ళూరుపేట, తడ ప్రాంతాలు తమిళ సరిహద్దు ప్రాంతాలు కావడం మూలాన తమిళ యాస కొంత నెల్లూరు తెలుగు భాషలో సమ్మిళితమైనది.
ఈ నేపథ్యంలో వాచ్యములైన కొన్ని పదాలు నెల్లూరు జిల్లా వ్యవహారములో ఎలా మారుతాయో చూద్దాం!
తుంపర = తూర , మందార = దాసాని
ఊరకె = ఊర్నె , హామీగా = అడుమానం
వర్థంతి = ఏడోడు , గట్టు = గెనం
బెస్తలు = పట్టపోళ్ళు , వేడిగాలి = బెట్టగాలి
కొంచెం = కొంత, వెంటనే = గమాల్న
ఎక్కువ = జాస్తి, తాళింపు =తిరగమాత
అక్కరలేదు = పళ్ళే
వాచ్యాలకు ఈవిధమైన రూపాంతరాలు జిల్లాలో కనిపిస్తాయి.
మాండలికాలతో కొన్ని వాక్యాలు చూడండి;
‘‘పుల్నిజ్జూసి గంగనాగోలుగా అరిచినాము’’
***
‘‘ఎరగం నేనొచ్చేటపిటికి యెవర్నీ నే జూళ్ళే’’
***
‘‘తట్ట, తపిలి, అండా, బాన, పొంత, బండ్లో యేసుకుని ఇల్లు కాళీ జేస్నాడు (వస్తు విశేషం)
***
‘‘ఆదోరం పూట గూడా, ఆడుకోబళ్ళేదా? పిల్లోణ్ని ఎట్టా గొట్టినాడో, ఉతికిబారేయండి, ఆ నా బట్టని’’ (కోపం - తిట్టు)
***
‘‘సెలవలొస్తే జాలు... మేం. వామనగుంట, కోతికొమ్మచ్చి, ఉప్పరబట్టి, పిళ్లారాట, వొంటి బద్దాట, రొండు బద్దాట ఆడుకుంటాం’’ (ఆటల విశేషాలు)
మాండలిక పదాల తీరుతెన్నులు, మాట్లాడే విధానాలే గాక, మాండలిక పద్యాల పాటలు గూడా కొన్ని వున్నాయి. కొన్ని స్వతస్సిద్ధాలైతే (ప్రాచీన కాలం నుంచి అనుశ్రుతంగా ఒకరినుంచి ఒకరికి వస్తున్న పాటలు) మరికొన్ని పల్లె ప్రజల్లో తెలివితేటలున్నోళ్లు, మరికొన్ని అయ్యోర్లు (బడిపంతుళ్ళు) పండితుల చేత అల్లబడినవికొన్ని, నెల్లూరు జిల్లా మారుమూల పల్లెల్లో వ్యాప్తి చెంది వున్నాయి.
అందులో కొన్ని పల్లవులు చూద్దాం-
ఒకడు చేపల వేటకు వెళ్లాడు- ఆ విశేషాల్ని తన మిత్రుడితో చెబుతున్నాడు.-
‘‘మిడి మేలపు చేప
కటక్కన బట్నా
జారిపోయిందబ్బాయో
వయసు బిర్రుగున్నా, కుర్రదేమో?
మనసు యవ్వారం జేస్తుండదేమో!’’
***
ఓ ఊళ్ళో వేంకటేశ్వరస్వామి ఊరేగింపు కొనసాగుతోంది. ఆ నేపథ్యాన్ని ఎవరో కవి ఇలా రాశాడు.
‘‘ఎలబారినాడు మెరవణితో
ఎంకటేశుడు, తిరుమలేశుడూ
పక్కన చక్కనమ్మోరుని గూడి
చుక్కల తేరెక్కి జన సంద్రంతోటి’’
***
పెంచలయ్య, పెంచలమ్మ వ్వనంలో ఉన్నవాళ్ళ. పెంచలయ్య పెళ్లి పేరెత్తితే, మాట మార్చేస్తున్నాడు- పెంచలమ్మ నిలదీసింది.
‘‘మందలేంది జెప్పు
ఆలీసెం, కదా తప్పు
పెమాణాలు జేస్తివి
పెళ్ళెందుకు జేసుకోవు?!’’ (మందల= సంగతి)
***
అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకొన్నారు. అబ్బాయి మహా తొందరపడిపోతున్నాడు. సాయంత్రం పూట ఫలానా చోటికి రమ్మన్నాడు. పెళ్లికాకుండా అలా రాలేనే్ల అంది అమ్మాయి.
‘‘నన్నించిగాదు
మన్నించవయ్య
మనువాడకుండా
మాపటేళకొచ్చేది
మూడు ముళ్ళు బడ్డపాట
ముచ్చటా దీరుస్తాను’’
పున్నమి రోజు, చక్కని చుక్క నా పక్కనుంటే నేను గూడ కవిత్వం ఇంత పొడుగున చెబుతానంటున్నాడో కవి - సముద్రపు ఒడ్డున, పౌర్ణమిరోజుల రేతిరి-
‘చీకట్లు ముసురుకొని
చందమామ పైకొచ్చే యేళా
చక్కనైన ఓ సుక్క నా ప్రక్కనుంటే
కమకమ్మని కవనాలు
ఇంత పొడుగున జెప్పనా!’’
జనపదాలు మాండలికాల సౌందర్యమే వేరు! పద పదాన సోయగాల మల్లెల సుగంధాలు వెదజల్లబడుతాయి- పాటలకు పసందైన పల్లవి వుంటుంది. పున్నమివేళ, సముద్రంతీరంలో చల్లచల్లని మలయ మారుతానికి సేద తీరిన మనసు స్పందించి అందమైన పదజాలంతో పల్లవులల్లుతుంది. గళం గొంతెత్తితే గాంధర్వ వాయులీనాలు ప్రవాహమై పొంగి పొర్లుతాయి- మాండలికాల పద సోయగాలే తెలుగు తల్లికి మల్లెపూదండలు. ప్రతి జిల్లా నుంచి ఈ మల్లెల నేరి మాలలుగా కూర్చి తెలుగుతల్లి గళసీమలో అలంకరిద్దాం! తెలుగు మాండలిక పద సౌరభాల్ని గుబాళింపజేద్దాం!!
ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఉన్నట్లే నెల్లూరు జిల్లాకు కూడా విశిష్టమైన మాండలిక
english title:
vedika
Date:
Saturday, April 14, 2012