
హైదరాబాద్, మార్చి 18: మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పలు దఫాలుగా జరిగిన చర్చల తరువాత కొండా దంపతులు కెసిఆర్ సమక్షంలో మంగళవారం టిఆర్‌ఎస్ భవన్‌లో పార్టీలో చేరారు. మానుకోట సంఘటన దురదృష్టకరమని కొండా సురేఖ పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని తాను గట్టిగా నమ్ముతున్నట్టు చెప్పారు.
గతంలో కెసిఆర్‌ను తప్పుగా అర్థం చేసుకున్నానని, ఈరోజు ఆయనతో రెండు గంటల పాటు మాట్లాడిన తరువాత తన తప్పు అర్థం అయిందని అన్నారు. కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే టిఆర్‌ఎస్‌లో చేరానని విమర్శ సరికాదని, తనకు పరకాలలో స్వతంత్రంగా గెలిచేంత బలం ఉందని అన్నారు. కెసిఆర్ ఆదేశాల మేరకు పార్టీకి సేవలు అందిస్తానని తెలిపారు. కెసిఆర్ సాగించిన ఉద్యమం వల్లనే తెలంగాణ సాకారం అయిందని ఆమె తెలిపారు. మానుకోట సంఘటన ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదని, అనుకోకుండా జరిగిన సంఘటన అని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం తాను జగన్‌కు మద్దతు ఇవ్వలేదని, వైకాపా ప్లీనరీ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందు వల్లనే మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. పదవుల కోసం వెంపర్లాడలేదని, నమ్ముకున్న నాయకుని కోసం పదవులకు సైతం రాజీనామా చేశానని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావాలనే ఉద్దేశంతోనే టిఆర్‌ఎస్‌లో చేరినట్టు తెలిపారు. టిఆర్‌ఎస్‌పై, కెసిఆర్‌పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు చెప్పారు. కెసిఆర్ పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని అన్నారు.
కొండా దంపతులకు కెసిఆర్ శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్‌లో టిఆర్‌ఎస్ బలంగా ఉందని, కొండా దంపతుల చేరికతో మరింత బలపడుతుందని ఎమ్మెల్యే తారక రామారావు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం తెలంగాణతోనే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారని అందుకే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆయన తెలిపారు. ప్రజల్లో ఉన్న భావనను గుర్తించే వివిధ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు తారక రామారావు తెలిపారు. (చిత్రం) తెలంగాణ భవన్‌లో మంగళవారం టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్న మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి.
బంగారు తెలంగాణ చేసి చూపిస్తా
* కెసిఆర్ వెల్లడి
హైదరాబాద్, మార్చి 18: ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించి తీరుతుందని, బంగారు తెలంగాణ చేసి చూపిస్తామని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు వారి మద్దతుదారులతో పాటు మంగళవారం తెలంగాణ భవన్‌లో కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడారు. పార్లమెంటు నియోజక వర్గాల్లో, అసెంబ్లీ నియోజక వర్గాల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణం టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమని అన్నారు. ఆంధ్రా పార్టీలను ఇంతకాలం మోసింది చాలు, మన ప్రాంతం అభివృద్ధి కోసం ఇంటి పార్టీని గెలిపించుకుందాం అని కెసిఆర్ కోరారు. తెలంగాణ సమస్యలు ఏమిటో, తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఇంటి పార్టీ అయిన టిఆర్‌ఎస్‌కే బాగా తెలుసునని అన్నారు. టిఆర్‌ఎస్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరగక ముందు తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని అవహేళన చేశారని, అన్యాయం చేశారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు తెలంగాణలో తలెత్తుకుని సగర్వంగా బతికే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కెసిఆర్ తెలిపారు. ప్రతి కుటుంబానికి 125 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది తమ మొదటి ప్రాధాన్యత అంశమని అన్నారు. రెండు లక్షల 75వేల కోట్ల రూపాయల ఖర్చుతో పక్కా గృహాలను నిర్మించనున్నట్టు చెప్పారు. తెలంగాణలోని అనేక సమస్యలకు ఉచిత విద్యనే పరిష్కార మార్గమని అన్నారు. ఎలాగోలా కష్టపడి ఒక తరానికి ఉచితంగా విద్య అందివ్వగలిగితే ఆ తరువాత తరాలు సంతోషంగా బతికే అవకాశం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక బడి పిల్లలకు తిండి, చదువు, పుస్తకాలు, బట్టలు అన్ని ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని అన్నారు. తెలంగాణలో 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు ఉన్నారని, వీరి సంక్షేమం కోసం ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. టిఆర్‌ఎస్ నాయకత్వంలో వీరి సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. అన్ని మతాలు, కులాల వారికి ఉచిత విద్య లభించే విధంగా విశాలమైన హాస్టల్స్ నిర్మించనున్నట్టు కెసిఆర్ తెలిపారు.