మోర్తాడ్, మార్చి 18: మోర్తాడ్ మండలంలోని తొర్తి, శెట్పల్లి ఎంపిటిసి స్థానాలకు వేలం పాటలు నిర్వహించినట్టు సమాచారం. శెట్పల్లి ఎంపిటిసి స్థానాన్ని బిసి జనరల్‌కు కేటాయించడంతో గ్రామం రెండుగా చీలిపోయిన విషయం విదితమే. అయితే దీనిని అధిగమించడానికి వేలం పాట నిర్వహించినట్టు తెలిసింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 3.30లక్షలకు వేలం పాడి ఎంపిటిసి స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వేలంపాట ఉంటున్న నేపథ్యంలో దీనిని బయటకు పొక్కనీయకుండా, ఎక్కువ మంది సభ్యులు నామినేషన్లు దాఖలు చేయాలని వేలం పాట సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మండలంలోని తొర్తి, బట్టాపూర్ ఎంపిటిసి స్థానాలకు కూడా వేలం పాటలు నిర్వహించినట్టు సమాచారం. రెండు గ్రామాలకు కలిపి ఒకటే ఎంపిటిసి స్థానం ఉండడంతో రెండు గ్రామాల నేతల సమక్షంలో నిర్వహించిన వేలం పాటలో తొర్తికి చెందిన ఓ నాయకుడు 7.20లక్షల రూపాయలకు ఎంపిటిసి స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీని విషయంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు కానీ, గ్రామ కమిటీలు కానీ పెదవి విప్పడం లేదు. అందరూ నామినేషన్లు దాఖలు చేస్తారని, వేలం పాటలు ఏమీ జరగలేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వేలం నిర్వహించిన విషయం అధికారులకు తెలియడంతో పూర్తి స్థాయి వివరాల కోసం కూపీ లాగుతున్నట్టు సమాచారం.
అగ్రవర్ణాల వారి కుట్ర
* ఎంపిటిసి వేలం పాట అవాస్తవం
భిక్కనూరు, మార్చి 18: కొందరు అగ్రవర్ణాల కులస్తులు తమపై కక్ష కట్టి ఎంపిటిసి పదవికి వేలం జరిగిందని దుష్పచారం చేశారని బిసి సంఘాల నేతలు తెలిపారు. మంగళవారం 3.18 లక్షల వేలం పాటలో ఎంపిటిసి పదవి దక్కించుకున్న విషయం పత్రికల్లో ప్రధానంగా ప్రచురించాయి. దీనిపై ఎన్నికల రాష్ట్ర పరిశీలకురాలు భారతి గ్రామానికి చేరుకోని విచారణ నిర్వహించారు. స్థానిక పాఠశాలలో నిర్వహించిన ఈ విచారణలో ఎంపిటిసి స్థానానికి ఎలాంటి వేలం జరగలేదని, ఈ ఎన్నికల్లో బిసి సంఘాల నుండి అందరు నామినేషన్లు వేయడం జరుగుతోందని తెలిపారు. బిసి సంఘాల నేతలపై దుష్ప్రచారం చేయడం అగ్రవర్ణ నేతలకు తగదని బిసి సంఘాల నేతలు విమర్శించారు. ఆమె వెంట తహశీల్దార్ నాగజ్యోతి, ఇన్‌చార్జి ఎంపిడిఓ సంతోష్‌రెడ్డి, ఆర్‌ఐ వసంత, తదితరులున్నారు.
ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేలా
తెలంగాణ అభివృద్ధి చెందాలి
కామారెడ్డి, మార్చి 18: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచంలోని సంపన్న దేశాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా అభివృద్ధి చెందాలని మాజీ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బిజెపి జాతీయ నాయకుడు విద్యాసాగర్‌రావు అన్నారు. ఆయన మంగళవారం స్థానిక హౌసింగ్ బోర్డులోని బృందగార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర బిజెపి నాయకుడు పొత్తుల విషయంలో చర్చిస్తున్నారని పేర్కొన్నారు. ఒంటరిగానే పోటీ చేస్తే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నారు. బిజెపి మద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. నూతన తెలంగాణలో యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు పుష్కలంగా పంటలు పండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. హైద్రబాద్‌పై గవర్నర్ గిరి పెట్టడం సబాబు కాదన్నారు. భద్రాచలంలోని 7మండలాలను ఆంధ్ర ప్రాంతంలో కలపడం అన్యాయమని పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రకియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని తెలిపారు. జిల్లాలోని శ్రీరాంసాగర్ నుండి సముద్రపు వాటికి రవాణా చేసే అవకాశం ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిపుణులతో జెఎసిని ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలోని ఆడబిడ్డలు డెలివరి కోసం ఆసుపత్రులలో ఆంక్షలు లేకుండా చట్టం తీసుకువస్తామన్నారు. అన్ని పార్టీలు సైతం తెలంగాణ అభివృద్ధి మ్యాన్‌ఫెస్టోలలో పెట్టాలన్నారు. శాంతిభద్రత పరిరక్షణకై హైద్రబాద్‌తో పాటు తెలంగాణ ఉమ్మడి చట్టం తేవాలని కోరారు. బిజెపితోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు మోడి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బిజెపిలో యువతకు పెద్దపీట వేస్తామన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు మురళిధర్‌గౌడ్, మోతె క్రిష్ణాగౌడ్, నిట్టు వేణుగోపాల్‌రావు, విఠల్‌గుప్తా, రంజిత్‌మోహన్, హరిస్మరణ్‌రెడ్డి, లింబాద్రి, హరిధర్, దువ్వాల రమేశ్, తదితరులున్నారు.
కాంగ్రెస్ హయాంలోనే ముస్లిం మైనార్టీలకు న్యాయం
నందిపేట, మార్చి 18: అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని మాజీ స్పీకర్ కెఆర్.సురేష్‌రెడ్డి స్పష్టం చేశారు. నందిపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముల్సిం మైనార్టీ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఇందిరాగాంధీ కాలం నుండి నేటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయంలో ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో సమానంగా ముస్లింల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతోందన్నారు. ఇక తెలంగాణ ఏర్పాటు విషయంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టించి ఆమోదింపజేయడం జరిగిందన్నారు. దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో విభేదాలు తలెత్తడం సహజమేనని, అయినప్పటికీ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకుని సార్వత్రిక ఎన్నికల వరకు చేతి గుర్తుకు ఓటేసి పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సమీర్, జాకీర్ హుస్సేన్, మోహన్‌రావు, కె.రాజేశ్వర్, రాజుగౌడ్, సాయారెడ్డి, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కుపై విస్తృత ప్రచారం
బోధన్, మార్చి 18: బోధన్ డివిజన్‌లో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్త్రుత ప్రచారం చేయనున్నట్లు సబ్‌కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జరుగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచేందుకు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఓటు హక్కు అనేది ఎంతో ప్రాధాన్యత కలిగినదని ఈ విషయాన్ని ఓటరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు హక్కు వినియోగం పై అన్ని గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన ప్రచార రథాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందిరాక్రాంతిపథం, నెహ్రూ యువకేంద్ర, సాక్షర భారతి, యువజన సంఘాల సభ్యులతో ఇంటింటికి తిరిగి ఓటు హక్కుపై అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు. ప్రతీ డివిజన్‌కు ఒక ప్రచార రథం ఉంటుందన్నారు. అలాగే బోధన్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రజలకు ఇవిఎంలపై అవగాహన కల్పించేందుకు 23 మంది సెక్టార్ అధికారులను నియమించడం జరుగుతోందన్నారు. ఈ సెక్టార్ అధికారులు గ్రామాలలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ఇవిఎంల వినియోగంపై తెలియచేస్తారన్నారు.
కెసిఆర్ మోసం చేశాడు
కృతజ్ఞత సభలో ఎమ్మెల్సీ షబ్బీర్ ధ్వజం
భిక్కనూరు, మార్చి 18: తెలంగాణ రాష్ట్రం ఇస్తే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పిన టిఆర్‌ఎస్ నేత కెసిఆర్ రాష్ట్రం ఏర్పడ్డాక మోసం చేశాడని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యదర్శి, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలంలోని రాజంపేట గ్రామంలో సోనియాగాంధీకి తెలిపిన కృతజ్ఞత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కెసిఆర్ పిట్టల దొర అని, ఆయన మాయల మరాఠీ అని విమర్శించారు. కెసిఆర్ చేసిన నమ్మకద్రోహనికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా కెసిఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కామారెడ్డి నియోజక వర్గాల ప్రజల చిరకాల కోరిక అయిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలను అందించే కార్యక్రమాన్ని చేపట్టానని, ఆ పనులు త్వరలోనే పూర్తి అవుతాయని తెలిపారు. తాను అధికారంలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ బాలకార్మిక నిర్మూలన సంస్థ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నల్లవెళ్లి అశోక్, డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, వీరన్న, నర్సింహారెడ్డి, పుష్ప, జమున, నర్సింలు, కిష్ఠాగౌడ్, చంద్రారెడ్డి, నర్సారెడ్డి, రాజు పాల్గొన్నారు.
తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీయే
* కాంగ్రెస్ అభ్యర్థులను ఆశ్వీరదించండి
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మాటకు కట్టుబడి ఉండి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల చెందిన 40మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సోనియాగాంధీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకువస్తామని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తమదే అని మాట ఇచ్చామని, ఆమాట నిలుపుకోవలంటే పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రతి ఒక్కరికి వివరిస్తూ తెలంగాణ పున: నిర్మాణం కాంగ్రెస్‌తోనే జరుగుతోందని వివరిస్తు ఓట్లు అభ్యర్తించాలని పిలుపు నిచ్చారు. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఇన్నాళ్లు సీమాంద్ర నేతలు పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలకు వలసలు వెళ్లడం దారుణమన్నారు. ప్రజల ఆశ్వీరాదంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిసిసి ఉపాధ్యక్షులు బద్ధం ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లింబాద్రి, మండల పార్టీ అధ్యక్షులు చంద్రకాంత్‌రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, సర్పంచ్‌లు పి. నర్సింహారెడ్డి, మామిడి రవిందర్‌రెడ్డి, సొసైటి చైర్మన్ మద్దూరి నర్సింలు, నాయకులు నాగభూషణంగౌడ్, చిన్నమల్లారెడ్డి, అంకం రాజు, సిద్దగౌడ్, నాగులు, బండి రాములు, నీల అంజయ్య, విఠల్‌రెడ్డి, నర్సారెడ్డి, బాలాగౌడ్, రాజు, రాజేశ్వర్‌గౌడ్, రాంరెడ్డి, డిసిసిబి డైరెక్టర్లు చంద్రారెడ్డి, కిష్ఠాగౌడ్ పాల్గొన్నారు.
పోలీసులకు క్రీడలూ కీలకమే
నిజామాబాద్ , మార్చి 18: ఎల్లప్పుడు విధినిర్వహణలో నిమగ్నమై ఉండే పోలీసులకు క్రీడలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని నిజామాబాద్ రేంజ్ డిఐజి సూర్యనారాయణ ఉద్బోధించారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన 47వ పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో రేంజ్ పరిధిలో పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను డిఐజి మంగళవారం తన చాంబర్‌లో సన్మానించారు. పోలీసులు విరివిగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసికోల్లాసం, ఉత్తేజం, ఆహ్లదకరంగా ఉంటుందన్నారు. ఆటలు అధికంగా ఆడటం వల్ల సోదరభావం పెంపొందుతుందన్నారు. రాబోయే రోజులలో మరింత క్రీడానైపుణ్యాన్ని పెంచుకుని ఆటలలో రాణించి నిజామాబాద్ రేంజ్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆయన అభిలషించారు. రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడలలో నిజామాబాద్ రేంజ్ పరిధిలోని నిజామాబాద్, మెదక్ జిల్లాల పోలీసు క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో తగిన రీతిలో ప్రతిభ కనబరిచి సాధించిన పతకాలకు గాను వారికి పోలీసుశాఖ తరఫున రివార్డులను అందజేయనున్నట్లు డిఐజి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్‌పెక్టర్ కృష్ణయ్య, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు పోలీసు క్రీడాకారులు పాల్గొన్నారు.