నిజామాబాద్ , మార్చి 18: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతిభవన్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై జోనల్ అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రద్యుమ్న, జోనల్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జోనల్ అధికారులు ఈవిఎం యంత్రాల వాడకంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. వారి పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను ముందస్తుగా పరిశీలించుకుని, అక్కడ వికలాంగులకు పోలింగ్ కేంద్రాలలో ప్రవేశం కోసం ర్యాంపుల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, మంచినీటి సదుపాయం, అవసరమైన ఫర్నిచర్, ఇతర ఏర్పాట్లను ముందుగానే సరిచూసుకోవాలన్నారు. జోనల్ అధికారులు వారి పరిధిలో గల ఓటర్లతో కలిసి మాట్లాడి ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, భయబ్రాంతులకు గురికాకుండా, ప్రలోభాలకు లొంగే అవకాశాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు జరిగేందుకు జోనల్ అధికారులు ఎన్నికల నిర్వహణ, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంలో ముందుండాలన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్‌లు, గోడలపై రాతలు, జెండాలను ఏర్పాటు చేస్తే వాటిని వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటుగా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మైకుల వాడకంపై జోనల్ అధికారులు ఎప్పటికప్పుడు నిఘాను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభించే విధంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్‌కు ముందురోజు మాక్‌పోలింగ్ నిర్వహించుకుని ఆ తర్వాతనే పోలింగ్‌కు వెళ్లాలని ఆయన సూచించారు. పోలింగ్ సమయంలో ఈవిఎం యంత్రాలు సక్రమంగా పనిచేసేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డ్వామా పిడి శివలింగయ్య, జోనల్ అధికారులు పాల్గొన్నారు.
శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న
english title:
municipal
Date:
Wednesday, March 19, 2014