ఖమ్మం, మార్చి 18: కొద్ది నెలల క్రితం అన్ని పార్టీలను వీడి వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన నాయకులంతా తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఆ పార్టీకి జనంలో వస్తున్న ఆదరణ చూసిన అనేక మంది నేతలు తాము అప్పటి వరకు ఉన్న పార్టీలను వీడి ఆ పార్టీలో చేరారు. మరి కొంతమంది తాము ఉన్న పార్టీల్లో ఇమడలేక జగన్‌తో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పుకొచ్చారు. కాని తాజాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో పాటు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పుడు వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన నాయకులంతా ఇప్పుడు తిరుగు ముఖం పడుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా పాలేరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న నరేష్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. గతంలో వైఎస్‌ఆర్‌సిపిలో చేరి జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన పువ్వాడ అజయ్‌కుమార్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేసిన చందా లింగయ్య వైఎస్‌ఆర్‌సిపి పట్ల ఆకర్షితులై ఆ పార్టీలో చేరి కొద్ది కాలం జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించి కేంద్ర సమన్వయకర్తగా కూడా పనిచేశారు. తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.
అలాగే తెలుగుదేశం పార్టీలో జిల్లా కన్వీనర్‌గా పనిచేసి వైఎస్‌ఆర్‌సిపిలో చేరి అక్కడ కూడా జిల్లా కన్వీనర్‌గా పనిచేసిన శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేసి స్తబ్దుగా ఉంటున్నారు. ఇదే తరహాలో మహిళా నాయకులు కూడా తమ పదవులకు, పార్టీకి రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ చేరని సమయంలో ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రస్తుతం ఆ పార్టీని వీడి రెండు రోజుల క్రితం టిఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లాలో పార్టీని అంతా తానై నడిపిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి నాయకులను, పార్టీని వీడకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సఫలం కాలేకపోతున్నారు. ఇటీవల జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సైతం అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం.
సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో నాయకులంతా పార్టీని వీడుతుండటం, ఆ పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తోంది. ఒక వైపు సీమాంధ్ర పార్టీగా ముద్ర వేసుకున్నప్పటికీ జిల్లాలో కొంతమేరకు పార్టీని బలోపేతం చేయటంలో కీలకభూమిక పోషించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం కొన్ని సమయాల్లో పార్టీ నాయకత్వ వైఖరితో ఇబ్బంది పడినట్టు పార్టీ నాయకులే చెప్తున్నారు. ఎన్నికల వేళ నాయకులందరిని సమన్వయపరచకుంటే జిల్లాలో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని, పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో కూడా ఓటమి పాలయ్యే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం కొసమెరుపు.
ఖమ్మం జిల్లాలో వైఎస్‌ఆర్‌సిపి పరిస్థితి
english title:
hadavidi
Date:
Wednesday, March 19, 2014