సంగారెడ్డి, మార్చి 18: మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికలు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో అంతర్గతంగా ఉన్న విభేదాలు మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి గీతారెడ్డిపై స్థానిక నాయకుడు మాజీ మంత్రి ఫరీదోద్దీన్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మున్సిపాలిటీలోని ఆయా వార్డులకు తాను ప్రతిపాదించిన వారికి కాకుండా తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్న గీతారెడ్డి, ఇప్పుటి జడ్పీటీసీ, ఎంపిటీసీ స్థానాల్లో తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీలోపు అధిష్టానం కల్పించుకుని గీతారెడ్డి తీరులో మార్పు తీసుకురావాలని లేనిపక్షంలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించినట్లు తెలిసింది. అవసరమైతే పార్టీకి కూడా గుడ్‌బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫరీదొద్దీన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. లేనిపక్షంలో సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్న గీతారెడ్డిని ఓడించడానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. నిన్నమొన్నటి వరకు పటన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పార్టీని పిరాయిస్తున్నట్లు ప్రచారం జరగ్గా అధినేతలంతా బుజ్జగించి ఆయన పార్టీలోనే కొనసాగేందుకు కృషి చేసారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి ఫరీద్ చేసిన హెచ్చరికలతో కాంగ్రెస్ పార్టీకి మరో ముప్పు ముంచుకురావడంతో నాయకులకు తలనొప్పి కల్గిస్తోంది. ఇదిలావుండగా తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటి అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు దామోదర్‌పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు దశాబ్దాలుగా పార్టీలో క్రమశిక్షణతో పని చేస్తున్న వారిని కాదని నిన్నమొన్న వచ్చిన వారికి ప్రాధాన్యతను ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు అల్లాదుర్గం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డి.కాశీనాథ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటే తాము మద్దతు తెలుపుతామని, ఇతర పార్టీలో చేరితే మాత్రం ఎంతమాత్రం సహకరించబోమని మాజీ ఎంపిటీసీలు, పలువురు సర్పంచులు కాశీనాథ్‌తో తెగేసి చెప్పారు. ఈ సమాచారం అందుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌తో పాటు ఆయన అనుచరులు రంగంలోకి దిగి అలక వహించిన నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రామాయంపేట జడ్పీటీసీ టికెట్‌ను ఆశిస్తున్న మాజీ ఎంపిపి అధ్యక్షులు గుండా ఎల్లం మంగళవారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జడ్పీటీసీ టికెట్ తనకు కాకుండా దివ్య సంపత్‌కు ఇవ్వడానికి అధిష్టానం నిర్ణయించిందని తెలుసుకున్న గుండా ఎల్లం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు విఫలయత్నం చేసారు. టిఆర్‌ఎస్ నాయకులు ఎల్లంను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సంస్థాగత ఎన్నికల నామినేషన్లు పూరె్తై బి ఫారాలు అందజేసే వరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీలోకి కప్పదాట్లు వేస్తారో తెలియని అయోమయ పరిస్థితుల్లో అన్ని ప్రధాన పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి.
గీతారెడ్డిపై ఫరీద్ ఫైర్ అల్లాదుర్గం అధ్యక్షుని రాజీనామా టికెట్ ఇవ్వలేదని టిఆర్‌ఎస్ నేత ఆత్మహత్యా యత్నం
english title:
geetha reddy
Date:
Wednesday, March 19, 2014