హైదరాబాద్, చార్మినార్, మార్చి 18: మహానగర చారిత్రక వైభవానికి నిలువెత్తు నిదర్శనం చార్మినార్ నియోజకవర్గం. 2009 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంలో శాలిబండ, పురానాపూల్, పత్తర్‌ఘట్టి, నూర్‌ఖాన్‌బజార్, మొఘల్‌పురా, హుస్సేనీ ఆలం, ఘాన్సీబజార్, అలియాబాద్ మున్సిపల్ డివిజన్లున్నాయి. వీటిలో అత్యధిక డివిజన్లలో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం లక్షా 72 వేల 566 మంది ఓటర్లుండగా, వీరిలో ఎక్కువ శాతం మైనార్టీలే, ఆ తర్వాత స్థానం బిసి ఓటర్లదే. అభ్యర్థుల గెలుపు ఓటములకు సంబంధించి మైనార్టీలదే కీలక పాత్ర కావటంతో మైనార్టీ ప్రజాప్రతినిధులు గెలుపొందుతూ వస్తున్నారు. ఈ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటినుంచి మజ్లిస్ పార్టీకి కంచుకోటగా మారింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయరంగ ప్రవేశం చేశారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కూడా 1967, 1972, 1978, 1983ల్లో మజ్లిస్ వ్యవస్థాపకులు సుల్తాన్ సల్లావుద్దీన్ ఒవైసీ, 1985లో ముకరముద్దీన్, 1989లో విరాసత్ రసూల్‌ఖాన్, 1994, 1999ఎన్నికల్లో అసదుద్దీన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మజ్లిస్, తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్, ఎంబిటిలకు కాస్త పట్టుంది.
టికెట్ల కోసం పోటాపోటీ
మజ్లిస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే పాషాఖాద్రి మరోసారి టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆయనతో పాటు కార్పొరేటర్, మాజీ మేయర్ జుల్ఫీకర్ అలీ, కార్పొరేటర్ మహ్మద్ గౌస్, బురానుద్దీన్ ఒవైసీలు మజ్లిస్ నుంచి టికెట్ రేసులో ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్ రంజనీ దేవీ గోయల్, నాగభూషణం గౌడ్, కె. వెంకటేష్‌లతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి అలీ మస్కతీ, పుస్తెబాబురావు, బిజెపి నుంచి ఉమా మహేందర్, మేఘరాణి అగర్వాల్‌లు పోటీ చేసేందుకు ఉత్సాహంతో ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈసారి తెరాస కూడా మైనార్టీ అభ్యర్థిని అనే్వషిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా చార్మినార్‌లో కూడా ఈసారి త్రిముఖ పోటీ తప్పేలా లేదు. కాగా, ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు లక్షా 72,566 మంది ఉండగా, వీరిలో మహిళలు 80,342మంది కాగా, పురుషులు 92,224 మంది ఉన్నారు.
మజ్లిస్ టికెట్‌కు యమగిరాకీ
english title:
charminar
Date:
Wednesday, March 19, 2014