హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తేవాలని, సోలార్ విద్యుత్తుకు అధిక ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయించింది. టి-పిసిసి మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ డి. శ్రీ్ధర్ బాబు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క మ్యానిఫెస్టో తయారీకి చేస్తున్న కసరత్తులో భాగంగా మంగళవారం నగరంలోని ఒక హోటల్‌లో పిసిసి కిసాన్ సెల్, పిసిసి ఎస్‌సి విభాగం నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. బుధవారం మహిళా కాంగ్రెస్ ఈ కమిటీని కలిసి సూచనలు చేస్తుంది. ఇలాఉండగా పిసిసి కిసాన్ సెల్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి ఈ కమిటీతో సమావేశమై పలు సలహాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం సమగ్రమైన విత్తన చట్టం తేవాలని, జాతీయ స్థాయిలో గిట్టుబాటు ధర కల్పించాలని, పంటల బీమా శాస్ర్తియంగా జరగాలని సూచించారు. అంతేకాకుండా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును పగటి పూట ఏడు గంటల పాటు నిరాటంకంగా ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ శాఖను, ఉద్యానవన శాఖను ఒకే శాఖ కిందకు తేవాలని ఆయన కోరారు. కరీంనగర్‌లోని నేదునూరు, శంకర్‌పల్లి విద్యుత్తు కేంద్రాల్లో సోలార్ విద్యుత్తు చేపట్టాలని ఆయన తెలిపారు. కృష్ణా బేసిన్‌పై ప్రత్యేక ట్రిబ్యునల్‌ను నియమించాలని కోరారు. పిసిసి ఎస్‌సి విభాగం అధ్యక్షుడు కృష్ణ ఈ కమిటీని కలిసి మ్యానిఫెస్టోలో చేర్చేందుకు కొన్ని సూచనలు చేశారు. ఎస్‌సి విద్యార్థులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చర్యలు చేపట్టాలని, దళిత కుటుంబాలకు రెండు ఎకరాలు చొప్పున ఇవ్వాలని, నిరుద్యోగ భృతి 5 వేల రూపాయలు ఇవ్వాలని, ఔత్సాహికులకు పరిశ్రమల స్థాపనకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని, దళితుడ్ని ముఖ్యమంత్రి చేయడంతో పాటు అనేక కీలకమైన పదవులు ఇవ్వాలని ఆయన కోరారు.
సమావేశానంతరం డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ కమిటీ ముందుకు వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి మ్యానిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు. ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకత ఉండేలా అభివృద్ధి చేసేందుకు మ్యానిఫెస్టో రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తామని ఆయన తెలిపారు.
టి-పిసిసి మ్యానిఫెస్టో కమిటీ భేటీ
english title:
solar power
Date:
Wednesday, March 19, 2014