రాజకీయాల సీజన్‌లో బలమైన గాలి ఎటు వీస్తే అటు కొట్టుకు పోవడం సహజం. ‘కొండలు’ సైతం దీనికి అతీతమేమీ కాదు. కొండా సురేఖ ఏ పార్టీలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు.
నాడు : ‘‘నెల రోజుల్లో తెలంగాణ సాధిస్తానని చెప్పిన కెసిఆర్ సాధించలేదు కాబట్టి ముక్కు నేలకురాసి క్షమాపణ చెప్పాలి ’’
నేడు: ‘‘కెసిఆర్ వల్లనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం అవుతుంది. కెసిఆర్ లాంటి బలమైన నాయకత్వం తెలంగాణకు అవసరం. గతంలో నేను కెసిఆర్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నాను.’’
- పై రెండు అభిప్రాయాలను వ్యక్తం చేసింది ఒకరే. అయితే సందర్భాలు వేరువేరు. పరకాల ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత కెసిఆర్‌పై ధ్వజమెత్తుతూ ఆయన ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేసిన కొండా సురేఖ ఇప్పుడు కెసిఆర్ వల్లనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం అని టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా చెబుతున్నారు.
ఎంతో మంది ఎన్నో పార్టీలు మారారు, మారుతున్నారు. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. వింతా లేదు. ఎన్నికల సమయంలో ఇలాంటివి అత్యంత సహజమైనవే. కానీ కొండా సురేఖ టిఆర్‌ఎస్‌లో చేరడం తెలంగాణవాదులు అంత సులభంగా జీర్ణం చేసుకోలేకపోతున్నారు.
తెలంగాణ ఏర్పడేంత వరకు టిఆర్‌ఎస్ ఒక ఉద్యమ పార్టీ. ఇప్పుడు టిఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీనే. మాకూ రాజకీయ ఎత్తగడలు ఉంటాయి, ఏం మాట్లాడినా రాజకీయంగానే మాట్లాడతామని కెసిఆర్ మొన్ననే చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొండా సురేఖ దంపతులు ఒక వెలుగు వెలిగారు. కొండా సురేఖకు మంత్రి పదవి, కొండా మురళికి శాసన మండలిలో సభ్యత్వం కల్పించి ప్రోత్సహించారు. రోశయ్యను ముఖ్యమంత్రిని చేసిన తరువాత నెల రోజుల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలి లేదంటే రోశయ్య మంత్రివర్గంలో తాను కొనసాగలేను అని ప్రకటించిన కొండా సురేఖ, చెప్పిన మాట ప్రకారం రాజీనామా చేశారు. జగన్ వైకాపా ఏర్పాటు చేసిన తరువాత అందులో చేరారు. వైకాపా నాయకురాలిగా కెసిఆర్‌పై విమర్శలు చేయడమే ప్రధాన డ్యూటీగా కొండా సురేఖ చిత్తశుద్ధితో పని చేశారు. తెలంగాణ కోసం టిఆర్‌ఎస్, బిజెపి ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అదే సమయంలో జగన్ కొత్త పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. జగన్‌కు మద్దతుగా సురేఖ రాజీనామా చేశారు. ఉప ఎన్నికలు రాగానే తాను జగన్ కోసం రాజీనామా చేయలేదు. తెలంగాణ కోసం అంటూ తెలంగాణ పల్లవి అందుకున్నారు. తెలంగాణ రాదు అని చాలామంది నమ్మినట్టుగానే ఆమె నమ్మారు. దానికి అనుగుణంగానే తన రాజకీయ జీవితాన్ని రూపొందించుకున్నారు. జగన్‌తో ఎక్కడో తేడా వచ్చి దూరంగా ఉండడం మొదలైంది. అదే సమయంలో తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో వైకాపా సమైక్యాంధ్ర నినాదాన్ని ఆశ్రయించింది. దీనిని అవకాశంగా తీసుకుని కొండా సురేఖ దంపతులు వైకాపాను వీడుతున్నట్టు ప్రకటించారు. మహానేత కుమారుడు అని అంతకు ముందు జగన్‌ను ఆకాశానికెత్తిన కొండా సురేఖ అంతే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ బయటకు వెళ్లారు. కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకున్నాక, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటాను అని ప్రకటించాక కొండా దంపతులు కిరణ్ కుమార్‌రెడ్డి నాయకత్వంలో దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అక్కడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. ఎన్నికలు రాగానే కెసిఆర్‌తో మంతనాలు సాగించారు. రహస్య ఒప్పందం కుదిరింది. కోరిన సీట్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పుడు కొండా దంపతులు టిఆర్‌ఎస్ నాయకులు. తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నా జగన్ మానుకోట పర్యటించారు. ఆ సమయంలో కొండా దంపతులు జగన్‌కు అండగా నిలిచారు. తెలంగాణ వాదులపై కాల్పులు జరిగాయి. మానుకోట రాళ్లు అంటూ టిఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం సాగించింది. ఇప్పుడు మానుకోట ఉద్యమకారులు అలానే ఉన్నారు. ఎవరిపైనేతే వారు తిరుగుబాటు చేశారో ఆ నేతలు ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో ఉన్నారు. మానుకోట వీరులకు కనీసం క్షమాపణ చెప్పించైనా కొండా దంపతులను పార్టీలో చేర్చుకోవలసింది అనేది తెలంగాణ వాదుల వాదన. అలా చేసి ఉంటే ఉద్యమ కారులు కొంతవరకైనా సంతృప్తి చెందేవారు. అయినా కెసిఆర్ ముందే చెప్పాడు - మాది ఫక్తు రాజకీయ పార్టీ అని. రాజకీయాల్లో ఎవరి లెక్కలు వారి కుంటాయి. కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, అటు నుంచి మళ్లీ కాంగ్రెస్, ఇప్పుడు టిఆర్‌ఎస్. అతి తక్కువ కాలంలో పార్టీలు మారిన కొండా దంపతులు ఎంత కాలం టిఆర్‌ఎస్‌లో ఉంటారో, అక్కడ వారి స్థానం ఏమిటన్నది వేచిచూడాల్సిందే.
*
రాజకీయాల సీజన్‌లో బలమైన గాలి ఎటు వీస్తే అటు కొట్టుకు పోవడం
english title:
konda gaali
Date:
Wednesday, March 19, 2014