Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఏకాకులం కాదు..

$
0
0

రాత్రంతా అరకొర నిద్రపోతామా! ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా? అందర్నీ ఎప్పుడు చూస్తామా? అన్న భయంతో మరో విధంగా సంతోషంతో అందరం ఒకరికొకరం సుప్రభాతం చెప్పుకుంటాం. ఆ సందడికి అన్నపూర్ణమ్మ గారికి మెలకువ వచ్చేస్తుంది. ఎలాగనుకున్నారు? ‘గుండమ్మ కథ’లో అచ్చు సూర్యకాంతమల్లే ఆవులిస్తూ చిటికెలు వేసుకుంటూ ‘అబ్బబ్బ! లేయంగానే వీటి అరుపులు వినలేక చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ముష్టి ముప్పై కాయల కోసం ఏడాది పొడుగునా ఈ ‘కాకిగోల’ భరించలేక ఛస్తున్నా. వచ్చే వారానికల్లా ఆ చెట్టు కొట్టేయించండి’ భర్తగార్కి ఆజ్ఞ జారీ చేస్తుంది.
ఇంతకూ ఆవిడ గురించి చెప్పే మీరెవరు అన్న సందేహమా? మేమేనండి ‘కాకులం’. అలా విస్తుపోతారేమండీ. ఈ కులం పేరెక్కడా వినలేదనేనా? నిజమే మా పేర్ల చివర మాకులం పేరు లేదు కదా! అన్నట్లు ‘కా’ అంటే మీ భాషలో చెడ్డ అన్న అర్థం ఉందట కదా! ‘కాకులం’ అంటే చెడ్డకులం అనుకునేరు సుమా! పక్షి జాతి వాళ్లం. పక్షుల సమూహంలో గుడ్లగూబలు, రాబందులు, మేమే అతిహీనులం మీ దృష్టిలో. మొదటివి రెండు జనావాసాల్లో కాక గిరిజన తెగల్లాగా ఎక్కడో అడవుల్లో ఉంటాయి. మేం మాత్రం పంచముల్లాగా మీ మధ్యనే ఉంటూ పాచిపోయి పారవేసిన వాటిని తింటూ మీ పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నా అదిగోండి ఆ అన్నపూర్ణమ్మలాగా ‘ఉష్ ఉష్ అని తోలటమే కాక వ్యంగ్యంగా మా మీద బోలెడన్ని సామెతలు వాడుతూ మమ్మల్ని నిందిస్తూ ఉంటారు. మా వారినందరినీ పిలవటానికి మా భాషలో ‘కావు’ ‘కావు’ మని కేకలేస్తే మీరు చీదరించుకొని ‘కాకి గోల’ ‘కాకి మూక’ అని ఈసడించుకుంటారు.
సరే! మరి మీ మానవుల్లో పెళ్లీ పెటాకులు లేకుండానో లేదా పెళ్లాం పిల్లలు చనిపోయి కాలం వెళ్లదీసే వాళ్లను సాటి మానవులుగా ఆదుకోకపోగా హేళనగా ‘ఏకాకి’ అని అంటారు. నిజానికి ఏకాకి అన్న మాట ఎవరు కనిపెట్టారో తెలీదుగాని ఏ ‘కాకి’ ఒంటరిగా ఉండదు. ఈ భూమండలంలో ఒకే కాకి వుంటే ఎలా ఉంటుందో ఊహించుకొని ఎవరైనా ‘ఏకాకి’ అన్న మాట కనిపెట్టారేమో తెలియదు. గుంపుగా ఉంటే ‘కాకి మూక’ అని, ఒంటరిగా ఉంటే ‘ఏకాకి’ అని పిలిచే ఈ రెండు నాల్కల ధోరణి మాకసలు నచ్చదు.
అయినా ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నట్లు కొందరు కవి మిత్రులు మాత్రం ‘చీకటితో బాటు మమ్మల్నీ ఎక్కడ పారదోల్తాడో ఈ సూర్యభగవానుడు అన్న భయంతో వేకువ జామునే ఆయన్ను కావు (రక్షించు) కావు (రక్షించు) అని అరుస్తామని ఎంత చక్కగా చెప్పాడో! మరో పెద్దాయనా దాదాపు ఇదే అర్థంలో ‘మనం (మానవులు) అత్యంత హీనంగా భావించే కాకులు సైతం భగవంతుడిని సదా కావు (రక్షించు) కావు (రక్షించు) అని వేడుకుంటూ ఉంటే బుద్ధిజీవులయిన మానవులు భగవంతుడిని కావుమననేరంకదా!’ అని పద్యం చెప్పాడు. ‘తద్దినం నాడు కాకులెందుకు? కాకే ఆత్మబంధువు’ అని మరో పుణ్యాత్ముడు మమ్మల్ని కాస్తా వెనకేసుకొచ్చాడు.
కాని పనులు చేసి ఏవో కల్లబొల్లి కబుర్లు చెబితే వాడిని ‘చాల్లే కాకమ్మ కథలు’ అని కొట్టిపడేయరూ! అయినా మేం అలా కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్లం కాదు. ‘కాకమ్మ కథల్ని’ మీరే సృష్టించుకొని మళ్లీ వాటినే పనికిమాలిన వన్నట్లు చెబుతారు. ‘కొంత ఘన పరిమాణం గల వస్తువును నీటి తొట్టెలోనికి జార విడిస్తే అంతే ఘన పరిమాణం నీటిమట్టం పెరుగుతుందని’ అతడెవరో శాస్తజ్ఞ్రుడు నీటి తొట్టిలో స్నానం చేస్తూ గమనించి బాత్‌రూం నుంచి బట్టల్లేకుండా ‘యురేకా’ ‘యురేకా’ అని అరుస్తూ బయటికొచ్చాడని మీ పిల్లలకు కథలు చెప్పి ఆ సూత్రానికి అతడి పేరే పెట్టారు కదా! మరి మీకు తెలిసి ‘కాకి-కడవ’ కథను ఎన్నాళ్ల బట్టి మీ పిల్లలకు చెబుతున్నారో గుర్తుందా తలపండిన తాతయ్యలూ! తాతమ్మలూ! ఆ శాస్తజ్ఞ్రుడికంటే ఎంతో ముందే ఆ సూత్రం ఆధారంగానే పాత్ర అడుగున నీటిని మాకందుబాటులోనికి తెచ్చుకుని దాహం తీర్చుకున్నాం. మరి ఆ సూత్రానికి నిజాయితీగా ఎవరి పేరు పెట్టాలి?
తెల్లచీరకు నల్లంచు ఇష్టపడని ఇంతులుంటారా? నల్లచీర మీద తెల్లపూలుంటే ఎంత బాగుందో అనుకుంటూ ఎంత ఖరీదయినా ఆ చీర కొనుక్కోరూ? అదేమిటో దంపతుల్లో ఒకరు నలుపు, పసిమిఛాయలతో వుంటే ‘కాకి ముక్కుకు దొండ పండల్లే ఉంది’ అని ఎకసెక్కంగా మీరో సామెత చెబుతారు. ఆ జంటకు పుట్టిన పిల్లలు నల్లగానే ఉండొచ్చనుకోండి. అంత మాత్రానికే ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ మీ పిల్లలు మీకు ముద్దయితే మాకెందుకు ముద్దవకూడదు. ‘ఈ మగాడిని చేపట్టి పది మందిని కని అతడిని పదకొండో సంతులాగా చూచుకొమ్మని’ మీ పెళ్లి మంత్రాల్లో ఉన్నాయట కదా! అలా జనాభా పెరిగిపోయేసరికి కొత్తగా కుటుంబ నియంత్రణ కనుగొని పాటిస్తున్నామని తెగ మురిసిపోతుంటారు కదా! మేము జీవితకాలంలో కేవలం రెండేసార్లు గుడ్లుపెట్టి పొదుగుతాం. అందుకే ఇద్దరే పిల్లలున్న తల్లి ‘కాకవంధ్య’ అంటున్నారు అని మీలో ఎందరికి తెలుసు?
అన్నట్లు పొదగటమంటే గుర్తొచ్చింది. కోకిల గానాన్ని తెగ మెచ్చుకునే మీరు దానికి పొదగటం చేతనవదనకుండా పొదిగాక వాటి అరుపును బట్టి మేము తరిమికొడితే ‘కాకులు పొడిచినట్లు పొడుచుతారని’ అంటారు. తల్లూలూ మీకో చిన్న ప్రశ్న. మీరంతా మానవ జాతికి చెందినవారే కదా! మరో తల్లీ మీలాగే పురిటి నొప్పులు (సిజేరియన్ అనాలా?) పడే కంటుంది కదా! పొరపాటున పిల్లలు తారుమారయితే ఎంత యాగీ చేస్తారు? ఏవో పరీక్షలు చేయించుకొని కచ్చితంగా ఈ శిశువు మాదే అని నిర్ధారణ చేసుకునే దాకా వదలరు. ఏదో ఒక శిశువని సరి పెట్టుకుంటున్నారా? మా రూపురేఖ లున్నంత మాత్రాన మా జాతే కాని కోయిలలను ఎలా భరిస్తాము? ఎందుకు భరించాలి? మరి మాకు పొడవటం మినహా ఏమీ రాదు. మీలాగా ఏవేవో పరీక్షలూ లేవు. మరి వాటి అరుపును బట్టి మా జాతి కాదని తరిమి కొట్టడం తప్పా?
మాలో వున్న ఎన్నో సుగుణాలను మీరు గ్రహించి అనుసరిస్తూ వున్నారా? మీ మధ్య తిరిగే సమస్త జంతువుల దాంపత్య జీవితాన్ని మీరూ మీ పిల్లలతోపాటు చూస్తారు. మూడో కంటికి తెలియకుండా రెండు కాకులు ఒకటయ్యే దృశ్యం పొరపాటున ఎవరి కంటయినా పడితే దానిని చూచిన వారి మృత్యువు దగ్గరలో ఉందని మహా దోషమని ‘కాకి కూటమి’ అంటూ ఆ వ్యక్తి చనిపోయినట్లు వార్తలు చేరేసి భోరుమని ఏడ్చి దోష పరిహారం చేసుకుంటారు. మరి మీరు చేసే ఎన్నో అకృత్యాలను చూచే మేం ఎలా దోషపరిహారం చేసుకోవాలి?
మీ తలలు నెరసి ముగ్గుబుట్టలయినా నల్లరంగు పులుముకొని ముదిమి మీద పడలేదని మురిసిపోతారు. మీ పాపాయిల కళ్లు నల్లని అల్లనేరెళ్లని ఆనందిస్తారు. నల్లపూసలు సౌభాగ్యానికి చిహ్నంగా ఆడవాళ్లు, దిష్టి దోషం తగలకుండా పిల్లలు ధరిస్తారు. నల్లటి తారురోడ్డు మీకు ఇష్టం. మీలో కొందరికయినా నలుపురంగు దుస్తులు మీద మక్కువ ఎక్కువ. అయితే ఎవరికీ ఏ హాని చేయని మా మేని ఛాయను చూచి ‘కాకి నలుపు’ అని ఆడిపోసుకోవటం మంచిదేనా?
పరమ పిసినారిని తిట్టుకోటానికి ‘ఎంగిలి చేత్తో కాకిని తోలని పిసినిగొట్టు’ అని అంటారు. ఎంగిలి మెతుకులే అయినా సంతృప్తి చెందే అల్ప సంతోషులం. ‘కాకిలాగా కలకాలం జీవించటం కంటే హంసగా కొన్ని రోజులున్నా చాలు’ అంటూ వుంటారు. మేమే కాదు ఎవ్వరూ కలకాలం జీవించరు. ఎవరైనా ఆయుఃప్రమాణ మున్నంత వరకే కదా జీవించేది. ఆ మధ్యనెక్కడో పక్షి శాస్తజ్ఞ్రులు తెల్లని కాకుల్ని గుర్తించారట. ‘అల్లుని మంచితనం తెల్లని కాకులు లేనే లేవని’ తేల్చాడో శతకకర్త. అంటే కాకులు నలుపు రంగును గుండు గుత్తకు తీసుకున్నాయా? ఎవరో ఓ పెద్దాయన మాత్రం కాస్త సానుభూతితో పెద్ద తలల్ని కాపాడటానికి అల్పజీవుల్ని అనవసరంగా బలి చేయటాన్ని చూచి ‘కాకుల్ని కొట్టి గద్దలకు వేయటమంటే ఇదే’ అని ఓ మంచి సామెత చెప్పాడు.
దేన్నయినా చులకన చేసి చెప్పాలంటే ‘సముద్రంలో కాకిరెట్టంత’ అని నీచంగా చెబుతారు. నిజానికి సముద్రుడి ముందు అందరం అల్పులమే కదా! రాతి మీద వెండిలాగా మెరిసిపోయే ఇనుముకు మాకూ ఏ బాదరాయణ సంబంధమూ లేదు అయినా అలాంటి లోహాన్ని మా పేరుతో ‘కాకి బంగారం’ అని ఎద్దేవా చేస్తారు. పసిపిల్లలూ మాలాగే తెచ్చుకున్న తాయిలాల్ని తామొక్కరే తినరు. తమతోబాటు తోటి పిల్లలకూ పంచి పెట్టటానికి తమ వొంటి మీద గుడ్డ కప్పి కొరికి ‘కాకి ఎంగిలి’ ఫరవాలేదు తినమని ముద్దుగా చెప్పే పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుంది. అదే పెద్దల వరస చూడండి. ఏదో పనిబడి తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాడి వద్దకు వస్తే ‘అయ్యో దీని కోసం తమరు రావాలా? ‘కాకితో కబురు’ పంపినా వచ్చి వాలేవాడిని’ అని అతి వినయంగా చెబుతారు.
‘వాయస పిండం’ అని దేవభాషలో అన్నా ‘కాకి పిండం’ అని వాడుక భాషలో అన్నా మీ పితృదేవతల ప్రతిరూపం మేమే అని భావించే, మీరు పితృకార్యాలు అతిశ్రద్ధ్భాక్తులతో చేస్తూ అదే నోటితో వ్యంగ్యంగా మమ్మల్ని సామెతల రూపంలో వాడుకుంటే అవి ఎవరికి తగుల్తాయో ఒక్కసారి ఆలోచించండి.
అన్నపూర్ణమ్మగారి ఆజ్ఞను ధిక్కరించి ఆమె భర్త మాకు చారెడు గింజలు వేసి, దాహం తీర్చుకోటానికి మట్టి మూకుటిలో నీళ్లు నింపుతూ ఉన్న అతడికి మా బాధంతా ఇలా చెప్పాలని ఉంది. మరి మా భాష తెలుసు కదా! కావ్.. కావ్...
-ఆయి కమలమ్మ

ఆలోచన
english title: 
ekakulam kadu
author: 
-ఆయి కమలమ్మ

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles