ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు
ఒక దేశం మరొక దేశం నుండి అప్పు ఆర్థిక సహాయం పొందటం కంటే తమ దేశంలోనే కొన్ని నోట్లను అధికంగా ముద్రించి అవసరం తీర్చుకొనవచ్చును గదా?
దానివల్ల అవసరాలు తీరవు. సమస్యలు పెరుగుతాయి. కరెన్సీ నోట్ల ముద్రణకు కొన్ని పద్ధతులూ, కట్టడులూ ఉంటాయి. వాటిని అతిక్రమిస్తే మొదటికి మోసం.
మన ప్రజాస్వామ్యంలో ఈ రేషన్‌లూ, రిజర్వేషన్‌లు ఎంతవరకు సమంజసమండీ?
ప్రజలు వద్దనంతవరకూ.
పి.చంద్ర, కాకినాడ
ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ప్రశ్నకు తెల్లతోలు ప్రస్తావన అనవసరమేమో! అయినా ఆస్కార్‌లపై మనకంత మోజెందుకు? మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ సినీ అవార్డులు ఆస్కార్‌కి తీసిపోయాయా?
పాయింటే.
సి.ప్రతాప్, సూర్యాపేట, నల్గొండ జిల్లా
మానవుడు ఆధునిక జీవన విధానానికి అలవాటు పడి భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తుండటం వలన భూగర్భ జలాల మట్టం గణనీయంగా తగ్గిపోయింది. ఇక భవిష్యత్తులో పెట్రోలియం పదార్థాల వలె నీటిని కూడా దిగుమతి చేసుకొనే దుస్థితి దాపురిస్తుందేమో?!
ఆ దుస్థితి ఇప్పటికే మొదలైంది. ఎవరి చేతుల్లో చూసినా కొనుక్కున్న వాటర్ బాటిలే.
ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో వివిధ సిద్ధాంతులు వివిధ పార్టీల వారికి అనుకూలంగా ఫలితాలను అన్వయించి చెబుతారెందుకు? అది పవిత్రమైన పంచాంగ శ్రవణ కార్యాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని అవహేళన చేయడం కాదా?
అది పంచాంగాలు వినిపించే వాళ్ల సొంత కవిత్వం. వారికి లౌక్యమే తప్ప శాస్త్రం తెలియదు సాధారణంగా.
ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
టి.వి. వార్తల్లోనూ, వార్తాపత్రికల్లోనూ ‘దూకుడు’ అనే సినిమా పేరును విపరీతంగా వాడుతున్నారు. వేరే పదం దొరకకా?
ఆ మాట ఆ సినిమా వాళ్ల సొంతం కాదు. జనంలోకి ఎక్కిన పదాలను సందర్భాన్నిబట్టి మీడియా వాడటంలో తప్పు లేదు.
తెలంగాణ పరిష్కారం రాష్ట్రం చేతుల్లోనే ఉందని చిదంబరం అంటూంటే, కాదు ఇది కేంద్రం పరిధిలో ఉందని రాష్ట్ర నాయకులు అంటున్నారు. ఇంతకీ ఎవరి చేతుల్లో ఉంది?
సీమాంధ్ర చేతుల్లో!
సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్గొండ
రోజుకు ముప్పై రెండ్రూపాయలు సంపాదిస్తే చాలు భారతీయులు పేదవారి కింద లెక్క కాదంట! కామెంట్ ప్లీజ్!
తలతిక్క లెక్కలు
2014 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో వైయస్సారు హవా రాబోతుందని ఇటీవలి ఉప ఎన్నికలు రుజువు చేసాయని నా అభిప్రాయం. కామెంట్ ప్లీజ్!
ఆ మాట తరచూ వింటున్నదే. 2014లోగా ఏమైనా జరగొచ్చు.
సి.సాయి మనస్విత, విశాఖపట్నం
ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినప్పుడల్లా ప్రధాని చిరునవ్వులు చిందిస్తున్నారే తప్ప నోరు విప్పడం లేదేం?
తనకు సంబంధం లేని విషయం కాబట్టి.
మన ప్రధాని వ్యవహారం చూస్తుంటే ఆయన అసలు మంత్రి వర్గానికి నాయకుడేనా?
ఆ అనుమానం ఆయనకే లేదు.
మహమ్మద్ యూసుఫ్, కాజీపేట, వరంగల్ జిల్లా
ఇప్పటి వరకు ఎందరో అమాయకపు విద్యార్థులు తెలంగాణ కోసం బలి అయ్యారు. కాని ఇంత వరకు ఏ ఒక్క నాయకుడు లేదా పార్టీ కార్యకర్తలు ఒక్కడు కూడా తెలంగాణ కోసం చావలేదు. ఈ నాయకులు అమాయకపు విద్యార్థులను ‘బలికా బక్రా’గా ఎందుకు ఎన్నుకుంటున్నారు? దీని వెనుక రహస్యం ఏమిటి?
నాకు తెలియదు. *