రాధాకృష్ణ (గుంటూరు)
ప్రశ్న: ఉమ్మడి ఆస్తిలో ఉన్న ఇంటిలోని తన భాగాన్ని మా అన్న వేరే వ్యక్తికి విక్రయించాడు. మేం సదరు ఇంటిని ఇంకా వాటాల కింద పంచుకోలేదు. ఇలా తన వాటా అంటూ బయటి వ్యక్తికి అమ్మడం చెల్లుతుందా?
జ: హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ఉమ్మడి ఆస్తిని కుటుంబం అంతా ఉమ్మడిగా అనుభవిస్తున్నప్పుడు సదరు ఇంటిపై బయటి వ్యక్తి ఎవరు ఎటువంటి హక్కు పొందడానికి లేదు. అలాగే ఆస్తి బదలాయింపు చట్టంలోని సెక్షన్ 44 ప్రకారం ఉమ్మడి కుటుంబంలో సభ్యుడు కానీ వ్యక్తి ఉమ్మడి కుటుంబం కింద ఉన్న ఇంటిలోని వాటాను కనుక బయట వ్యక్తికి విక్రయిస్తే సదరు కొనుగోలుదారుడికి ఆ కొనుగోలు చేసిన ఆస్తిపై పూర్తి హక్కులు బదలాయింపు కావు. ఉమ్మడి కుటుంబంలోని కుటుంబ సభ్యుల మధ్య పొరపొచ్చాలు, సమస్యలు తలెత్తకుండా కుటుంబం సాఫీగా సాగిపోయే ఉద్దేశంతో ఈ నిబంధనను చట్టంలో పొందుపర్చడం జరిగింది.
వేణుగోపాలరావు (తణుకు)
ప్రశ్న: మేము ఉమ్మడి కుటుంబంగా ఉండగా ఉమ్మడి సొమ్ములో నుంచి కొంత ఆస్తిని మా తమ్ముడి పేరు మీద కొనుగోలు చేశాం. ఇప్పుడు అందరం విడిపోతూ ఆస్తిని వాటాలుగా విభజించాలని భావించగా తన పేరు మీద ఉన్న ఆస్తి తన స్వార్జితమని సదరు ఆస్తిని వాటాగా విభజించడానికి అంగీకరించనంటూ నా తమ్ముడు మొండికేస్తున్నాడు. అతని వాదన చట్ట ప్రకారం సమర్థనీయమా?
జ: ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండగా ఉమ్మడి కుటుంబం సంపదలోనుంచి కొనుగోలు చేసిన ఆస్తిలో సభ్యులందరికీ హక్కు సమానంగా ఉంటుంది. ఉమ్మడి ఆస్తి నుంచి లభించిన ఆదాయంతో కొనుగోలు చేసిన ఆస్తిపై మీ అందరికీ సమాన హక్కు ఉంటుంది. మీ తమ్ముడి వాదన చెల్లదు. ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తి ఏదైనా ఆస్తిపై హక్కును డిమాండ్ చేస్తే సదరు ఆస్తి తన స్వార్జితంతో కొనుగోలు చేసినట్లు సాక్ష్యం చూపాలంటూ న్యాయస్థానాలు పలు సందర్భాలలో తీర్పు ఇచ్చాయి. మీ తమ్ముడి పేరున కొనుగోలు చేసిన ఆస్తి అతని స్వార్జితం ద్వారా కొనుగోలు చేసినట్లు అతను కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే సదరు ఆస్తిని ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసినట్లు మీరు కూడా కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు న్యాయం లభిస్తుంది.
కార్తీక్‌రెడ్డి (వరంగల్)
ప్రశ్న: మా నాన్న మా అమ్మ తదనంతరం ద్వితీయ వివాహం చేసుకున్నాడు. మేం ఇద్దరం. అయితే మా తాత సంపాదించిన ఆస్తిలో ఒక స్థలాన్ని మా నాన్న విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడు. మేం వద్దని వారిస్తే మొండికేస్తున్నాడు. మేం కోర్టుకు వెళ్లి మా నాన్న చర్యను అడ్డుకోవచ్చునా?
జ: మీ తాత ఆస్తి మీ దగ్గరకు వచ్చేటప్పటికి వారసత్వ ఆస్తిగా రూపు తీసుకుంటుంది. వారసత్వ ఆస్తిపై మీకు పూర్తి హక్కులు లభిస్తాయి. మీ నాన్న స్వార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తిని తన ఇష్టానుసారం అనుభవించే, అమ్మే హక్కు మీ తండ్రికి ఉంటుంది. అయితే మీ తాతగారి నుంచి మీకు సంక్రమించిన ఆస్తిపై మీ నాన్న పూర్తి హక్కులు లభించవు. మీ అనుమతి, మీ ప్రమేయం లేకుండా మీ తాతగారి నుంచి సంక్రమించిన స్థలాన్ని మీ నాన్న విక్రయించడం చెల్లదు. సదరు విక్రయాన్ని నిలిపివేయాలని కోరుతూ మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. మీకు అనుకూలంగా కోర్టు విక్రయాన్ని నిలిపివేస్తుంది.
రాధాకృష్ణ (గుంటూరు)
english title:
manakila
Date:
Sunday, April 15, 2012