చాలా రోజుల తర్వాత
ఓ పక్షి ఒంటరిగా నా కంట పడింది.
అది ఎక్కడో కాదు
మా ఇంటి ముంగిటి
చెట్టు కొనకొమ్మ మీద.
పక్షులకేమి?
రోజంతా నా ఎదుట
గగన తరంగిణిలో
అలలు అలలుగా ప్రవహిస్తూ ఉంటాయి.
అప్పుడు నేను
వాటి సామూహిక సౌందర్యాన్ని
కనులారా ఆస్వాదిస్తుంటాను.
ఇది సర్వసామాన్యమే.
ఇప్పుడలా కాదు
గంటల తరబడిగా ఒకే పక్షి
మా ఇంటి ముందు కూర్చుని ఉండడం
అంచనా కందని అంశం.
జంట పక్షులొచ్చి
కాసేపు ముచ్చట్లాడుకోవడం
అంతలోనే ఏదో గుర్తుకొచ్చి
టపటపా రెక్కలు కొట్టుకుంటూ
గభాలున ఎగిరిపోవడం
అప్పుడప్పుడు జరుగుతున్నదే.
ఈ పక్షి నిశ్చలంగా కూర్చుని
ఏకాగ్రతతో చూస్తున్నది.
అయితే నా వైపు
లేకుంటే ఆకాశం వైపు.
ఏ వియోగమో ఏ విషాదమో
దాని గుండెను తొలుస్తున్నట్టుగా
నాకనిపించింది.
దాని దయనీయ స్థితిని చూడలేక
మనసు విప్పి నేనన్నాను.
‘ఓ పక్షి మిత్రమా
నీ విషణ్ణ వదనాన్ని చూడలేకపోతున్నాను.
ఈ పూటకు మా ఇంట్లో విడిది చేయి.
తర్వాత వెళ్లిపోదువుగానీ’ అని
అలా వీలుకాదన్నట్టుగా
రెండు వైపులా తన తల ఊపిందది.
అంతలోనే ఆ పక్షి
సుదీర్ఘ నిరీక్షణకు పర్యవసానంగా
మరోపక్షి
ఉద్విగ్న స్థితిలో ఎగిరొచ్చి
దాని పక్కన వాలింది.
రెండూ ముద్దుముద్దుగా
తమ రెక్కలు కలుపుకున్నాయి.
కొమ్మ మీద చిందులు వేశాయి.
వియోగ విషాదాలూ
మనుషులకే కాదు
సకల ప్రాణులకూ ఉంటాయనీ
సార్వకాలీన యధార్థం
మరోసారి
నా కళ్ల ముందు ప్రత్యక్షమైంది.
*
...................................
ఎనె్నన్నో ప్రశ్నలు..??
-సంకేపల్లి శివప్రసాద్
దుఃఖం నాది బాధ నీది, నాది
తీరం మాత్రం నీది!
సుఖం నీకు, శాంతి నీకు
నిరంతర విస్ఫులింగ దృశ్యమాలికలు నాకు...
* * *
అలా కళ్లు మూసుకుంటానో లేదో
దూసుకొస్తుంటాయ్ బుల్లెట్లలా
స్వప్న శకలాలు!
దొంగల నిధిని
ఆలీబాబా దోచుకున్నట్లుగా
ననె్నవరో అంగాంగం
దోపిడీ చేస్తుంటారు!
ఈజిప్ట్ పిరమిడ్ల లాంటి
సమాధుల్లోంచి క్రూరంగా లేచిన
వ్యక్తావ్యక్త రూపాలు
నన్ను ఉరికిస్తుంటాయ్
ఎంత ఉరికినా స్పేస్‌వాక్‌లా
అడుగు ముందటికి పడక
దీనంగా హీనంగా వాటికి చిక్కుతూ...
* * *
ఎందుకీ మాయ, ఏమిటీ ఛాయ
ఊహించని రోమాంచిత, కామాంచిత
ఉద్విగ్న సన్నివేశాలు
నన్ను పాతాళంలోకి నెట్టుతుంటాయ్!
* * *
ఎక్కడ్నుంచో ఎక్కడికో
గాలిలా ఎగురుతూ
ఆమె హృదయంలోకి
నా హృదయాన్ని మీటుతూ
జీవితాన్ని శ్వాసిస్తూ..
ఇంతలోనే నిద్రలోంచి దొర్లుతూ...
ఇవి స్వప్నమని దుఃఖించిన
శిలాసదృశ సందర్భాలు ఎనె్నన్నో...
* * *
కాలంతో పరుగులు తీసిన
కష్టసుఖాలే స్వప్నాల్లా
కనిపిస్తాయా కవ్విస్తాయా...?
మనలోని అరిషడ్వర్గాలే
స్వప్న సంకేతాలా?
స్వప్నం స్వప్నమేనా?
ఇవి నిజ జీవితంలోకి
పరావర్తనం చెందుతాయా?
స్వప్న శాస్త్రాలు ఈ సంశయాల్ని
ఛేదిస్తాయా?
ప్రాయిడ్ ఈ కలల తీరాల్ని
దాటిస్తాడా?
ఎనె్నన్నో ప్రశ్నలు జవాబుల్లేనివి
ఈగల్లా నా మీద ముసురుతున్నవి!
* * *
స్వప్నం రాని రోజు
స్వప్నం కాని జీవితం
దొరకదా ఈ జీవితంలో...?
*
..............................................
లో ఆకాశంలో
-ఎన్.వి.రామశాస్ర్తీ
బుద్ధిగా కూర్చున్న
పద్ధతి చూస్తే
ముద్దొస్తుంది
ఒకే తీగపై వాలిన పిట్టల్లా
ఒక పువ్వుపై చేరిన సీతాకోకల్లా
గుచ్ఛంలో ఒదిగిన పువ్వుల్లా
వారంతా అక్కడ ఉంటారు
వారి మాటల్ని వింటే
ఎలా మాట్టాడాలో
తెలుస్తుంది
ఆ చిన్నారుల మనస్సుల్ని చూస్తే
నిర్మల ఆకాశం చేరువవుతుంది
ఉన్నట్టుండి
నవ్వుతారు
మరోసారి
ఉరుముతారు
గమనిస్తే
మన లో ఆకాశంలో
వర్షం వెలిసి
సంతోషపు ఇంద్రధనస్సు
మెరుస్తుంది.*