అనంతపురం సిటీ, ఏప్రిల్ 15: పోలియో రహిత సమాజస్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ వి.దుర్గాదాస్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక రాజేంద్ర మున్సిపల్ స్కూల్ నందు రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 15,16,17వ తేదిలలో జరగునున్న పల్స్‌పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 0-5 సంవత్సరాల వయస్సులోపు పిల్లలందరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇప్పించాలని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంపై తల్లిదండ్రులు, ప్రజలు స్పందించి లక్ష్య సాధనకు దోహదపడాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖధికారులు జిల్లా సరిహద్దు ప్రాంతంలో సైతం పర్యవేక్షణ కొనసాగిస్తూ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా ప్రధాన జనసమూహ కూడళ్లలో, ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, బిచ్చగాళ్ల పిల్లలకు, కూలీ పనులకు వెళ్ళె కుటుంబాల పిల్లలకు, మురికివాడల్లో నివసించే పిల్లలకు వారి తల్లిదండ్రులకు పోలియో చుక్కలపై ఉన్న అపోహలను తొలగించి నూటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్‌ఓ పూల వెంకటరమణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నీలకంఠారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్, అనంతపురం తహాశీల్దారు నాగభూషణం, హరిలీలాకుమారి, ఆరోగ్య అధికారి గంగాధర్‌రెడ్డి, శంకర్‌గౌడ్, పాఠశాల హెచ్‌ఎం పాండురంగయ్య, అల్లాబకాష్, నాగరాజు, పలువురు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
ఆ మండలాల్లో ప్రతి ఇంటికి తాగునీరు
* సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు ఆర్‌జె రత్నాకర్
కొత్తచెరువు, ఏప్రిల్ 15: కొత్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి మండలాల్లోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సత్యసాయి ట్రస్టు ద్వారా తాగునీరు అందిస్తామని ట్రస్టు సభ్యుడు ఆర్‌జె రత్నాకర్ తెలిపారు. సత్యసాయి గ్రామసేవా కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోతులకుంట గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించిన నీటి శుద్ధి ప్లాంటును ఆర్‌జె రత్నాకర్ ఆదివారం ప్రారంభించారు. ఈ ప్లాంటుకు అయిన ఖర్యులో రూ.3 లక్షలను సత్యసాయి సేవా ట్రస్టు భరించగా, మిగిలిన రెండు లక్షల రూపాయలను గ్రామస్థులు భరించారు. ఆల్ ఇండియా టెక్నో గ్రూప్ హైదరాబాద్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్‌జె రత్నాకర్ మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా చిన్నవయస్సులో వున్నప్పుడు పోతులకుంట గ్రామాన్ని సందర్శించారని ఈ గ్రామస్థులు ఎంతో ధన్యజీవులన్నారు. కలుషితనీరు తాగి అనారోగ్యానికి గురవుతారని, దీన్ని దృష్టిలో వుంచుకొని కొత్తచెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల్లోని 120 గ్రామాలకు రూ.180కోట్లు వెచ్చించి 15 నెలలలోపు మంచినీటిని అందిస్తామన్నారు. సత్యసాయి ఆశీర్వాదంతో ఈ పనులు చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ సత్యసాయి ట్రస్టు వారుచేపడుతున్న కార్యక్రమాలు మరియే ట్రస్టు ఇంత భారీగా కార్యక్రమాలు చేపట్టవన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొ న్న ఆల్ ఇండియో టెన్నో గ్రూప్ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో అనేక రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య వుందని, ముఖ్యంగా రాజస్థాన్, యుపిల్లో ఈ సమస్యల అధికంగా వుందన్నారు. నీటి విలువ తెలియక అనేక మంది నీటిని వృథా చేస్తున్నారని సుడాన్ లాంటి దేశాల్లోనీరు దొరక్క జనం చనిపోతున్నారన్నారు. సత్యసాయి తాగునీటి పథకం నీరు వృథా చేయవద్దన్నారు. ఈకార్యక్రమంలో ఎపి టెక్నోగ్రూప్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసన్నకుమార్, ఎపి సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు చైర్మన్ వైసి శ్రీనివాస్, యూత్ కో ఆర్డినేటర్ రమణారెడ్డి, సభ్యుడు నాగరాజు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామాంజినప్ప, జిల్లా జోనల్ ఇన్‌చార్జులు సిఆర్ రావు, కృష్ణమూర్తి, జిల్లా మహిళా కో ఆర్డినేటర్ కిరణ్‌కుమారి, మాజీ సర్పంచు సూర్యనారయణ, దేశం నేతలు రఘుపతి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.