శ్రీకాకుళం, ఏప్రిల్ 15: రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలు పేదోళ్ళు-రైతులు, కుయుక్తి రాజకీయాలకు నడుమ జరుగుతున్న పోటీ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చివరకు పేదోళ్ళు-రైతులే విజేతలుగా నిలుస్తారన్నారు. నరసన్నపేట ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్న రోడ్‌షోలో భాగంగా తొలిరోజున ఉర్లాం, చెన్నాపురం, కొమ్మనాపల్లి, శ్రీముఖలింగం, బుడితి గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రతీ ఓటరు తన ఓటును మనస్సాక్షిగా వినియోగించుకోవాలని జగన్ అభ్యర్థించారు. రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాల్లో అన్నింటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. మీరు ఆశిస్తున్న వైఎస్సార్ పాలన వస్తుందన్నారు. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు కూడా వస్తున్నాయని, అప్పటి వరకూ వేచివుంటే సుస్థిర వైఎస్సార్ పాలన వస్తుందన్నారు. అవిశ్వాసానికి వెళ్ళినప్పుడే పదవులు పోతాయని, అధికార పార్టీతో పోరాటం చేయాల్సివస్తుందని, పోలీసులు, ఐ.ఎ.ఎస్.లు, మంత్రులు మోహరింపులు, మూటలకు మూటలు విచ్చలవిడిగా పంచిపెడతారన్న అంశాలన్నీ పరిగణనలోకి తీసుకునే ఉప ఎన్నిక పోరుకు దిగామని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, దేశం అధినేత చంద్రబాబునాయుడు కలిసికట్టుగా వ్యూహం పన్నుతున్నారని ఆరోపించారు. నిజాయితీ రాజకీయాలతో ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ వ్యవస్థపై విశ్వాసం కల్పించేందుకే ఈ ఉప ఎన్నికలు వచ్చాయంటూ జగన్ సుస్పష్టం చేశారు. రైతన్నలను కూలీలుగా మార్చేసిన కిరణ్ సర్కార్ చదువుకుంటున్న పేద విద్యార్థినివిద్యార్ధులకు ఫీజు గుదిబండగా మార్చేశారని విమర్శించారు. ఏ ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీ యింబర్స్‌మెంట్ విధానం ప్రవేశపెట్టారో అదే పేద విద్యార్థులకు దూరం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తద్వారా ఢిల్లీ పెద్దలకు తన బలం ఎంతో చూపిస్తానంటూ సవాల్ విసిరారు. ఆరోగ్యశ్రీ పథకం నుంచి 135 రోగాలను తప్పించిన కిరణ్ సర్కార్ తన తండ్రి వైఎస్సార్ ఏ ఆశయంతో 108 తీసుకువచ్చారో దానిని కూడా హఠాత్తుగా నిలిపివేశారని, పేదోళ్ళ ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇవ్వలేదన్నారు. మళ్ళీ కూయ్.. కూయ్.. కూత ప్రతీ పల్లెలో వినబడేలా తాను కొద్దికాలంలో చేస్తానంటూ పేద ప్రజలకు అభయం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నీ రంగాల్లో అతలాకుతలం అయ్యిందన్నారు.
వృద్ధురాలిని గాయపరిచిన సెక్యూరిటీ
జగన్ వెంట ఉన్న సెక్యూరిటీ ఒక వృద్ధురాలని తుపాకీతో గాయపరిచింది. పిడికిలి బిగించి జగన్‌కు చేయిఇచ్చే ప్రయత్నం చేసేవారందరిపై ఆయన సెక్యూరిటీ బలప్రయోగం చేయడంతో పురుషులతోపాటు మహిళలు సైతం గాయపడ్డారు.ఇలా దేవాది, కోమర్తి గ్రామాల్లో తోపులాటలు జరిగాయి. యారబాడు గ్రామానికి చేరుకునేసరికి పోలాకి సూరమ్మ అనే వృద్ధురాలు జగన్‌ను కలిసేందుకు వెళ్ళగా ఆమెపై జగన్ సెక్యూరిటీ తుపాకితో గాయపర్చారు. దీంతో సుమారు 20 నిమషాలు జగన్ కాన్వాయ్‌ని ఆ గ్రామస్థులు నిలిపివేసి, జగన్ సెక్యూరిటీతో ఘర్షణకు దిగారు. దీంతో స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్థులను సర్దుబాటు చేసారు. ఆ వృద్ధురాలికి ప్రథమ చికిత్స చేశారు.
ప్రజలకు జగన్ పిలుపు
english title:
manassakshi
Date:
Monday, April 16, 2012