కాకినాడ, ఏప్రిల్ 15: కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) వ్యవహారం మళ్లీ వివాదాస్పదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విపక్షాలు మరోసారి సెజ్ వ్యవహారంపై దృష్టి సారించడం ఇక్కడ చర్చనీయాంశమైంది. 2009 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ మినహా అన్ని విపక్ష పార్టీల నేతలు కాకినాడ సెజ్ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడి నిర్వాసితుల పోరాటానికి మద్దతు తెలిపారు. తాజాగా ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ సెజ్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ నెల 20న సెజ్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 7 సంవత్సరాల క్రితం రిఫైనరీ ఆధారిత సెజ్ పేరుతో ఇక్కడ పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టిన నాటి నుండి ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీల తాకిడి ఈ ప్రాంతానికి తగ్గినప్పటికీ స్థానిక నిర్వాసితులు, రైతుల ఆందోళన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక నిర్వాసితులు వంటావార్పు పేరుతో చేపట్టిన నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం, సిపిఐలకు చెందిన నేతలు సెజ్ ప్రాంతంలో పర్యటించి ఆందోళనకు తెర తీశారు. దేశం పార్టీ నియమించిన ఐదుగురు సభ్యుల బృందం శనివారం స్థానిక పరిస్థితులను పరిశీలించి పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించింది. ఈనెల 20వ తేదీన చంద్రబాబు పర్యటించడంతో పాటు స్థానికంగా భారీ బహిరంగ సభ నిర్వహించడానికి పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. సిపిఐ నేత డాక్టర్ కె నారాయణ ఈ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం నిర్వాసితులకు మద్దతు తెలియజేయడంతో పాటు ఎట్టిపరిస్థితుల్లో భూములను వదిలి పెట్టవద్దంటూ పిలుపునిచ్చారు. వివిధ ప్రజా సంఘాలు సెజ్ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి, నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ జరిపిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒఎన్‌జిసి రిఫైనరీ ఆధారిత సెజ్ పేరుతో సుమారు 6 సంవత్సరాల క్రితం ప్రభుత్వం బలవంతంగా పేద రైతుల నుండి పంట భూములను సేకరించి ఓ ప్రైవేటు వ్యక్తి పేరున రిజిస్ట్రేషన్ చేయడాన్ని ఆయా సంఘాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఎకరానికి కేవలం 3 లక్షలు చెల్లించి సేకరించిన భూములను ఇప్పుడు బడా బాబులకు విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెజ్ కోసం సేకరించిన భూముల్లో రెండేళ్లలోగా పరిశ్రమలు స్థాపించాలని, అలా చేయని పక్షంలో సేకరించిన భూములను ఎవరివి వారికి తిరిగి ఇచ్చేయాల్సి ఉందని ప్రజా సంఘాలు, మత్స్యకార, రైతు, వ్యవసాయ కూలీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
20న బహిరంగ సభకు టిడిపి సన్నాహాలు
english title:
kakinada sez
Date:
Monday, April 16, 2012