
సూళ్లూరుపేట,ఏప్రిల్ 15: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట (షార్) నుంచి 28న పిఎస్‌ఎల్‌వి-సి 19 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించే ఈ రాకెట్ ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 1,850 కిలోల బరువుగల మైక్రోవేవ్ రిమోట్స్ సెన్సింగ్ రిశాట్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. భారత కాలమానం ప్రకారం 28న ఉదయం 5.45గంటలకు పిఎస్‌ఎల్‌వి నింగిలోకి ఎగరనుంది. ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన ప్రయోగాల్లో పిఎస్‌ఎల్‌వి ద్వారా ఇంత బరువుగల ఉపగ్రహాలను పంపలేదు. తొలిసారి ఇంతబరువుతో కూడిన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నందున చంద్రయాన్- 1లో ఉపయోగించి స్ట్రాపాన్ మోటార్లను ఈ ప్రయోగంలో ఉపయోగించనున్నారు. 536కిలోమీటర్ల అనంతరం ఉపగ్రహాన్ని అర్బిట్‌లోకి చేర్చుతుంది. 25రోజుల తరువాత ఇస్రోలోని రాడార్ సెంటర్లకు సంకేతాలు అందుతాయి. రిమోట్ సెన్సింగ్‌తో కూడిన ఈ ఉపగ్రహంలో ఉండే రాడార్‌లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరాల సహాయంతో భూభాగంలో అనుకూల,ప్రతికూల వాతావరణ పరిస్థితిలోను వాతావరణంలో కలిగే మార్పులను సంవత్సరం పొడవునా ఛాయా చిత్రాలను తీసి పంపనుంది. దేశంలో ఉగ్రవాద కదలికలను, చొరబాటుదారుల ప్రయత్నాలకు ఈ ఉపగ్రహ సేవలు రక్షణ కవచలా ఉపయోగపడనుంది. ఇప్పటికే బెంగుళూరులోని ఇస్రో సెంటర్ నుంచి ఉపగ్రహం షార్‌కు చేరుకుంది. దీనికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులు, ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రయోగించిన రిశాట్ ప్రయోగాల్లో స్వదేశ పరిజ్ఞానంతో ఇది ప్రథమం కావడం విశేషం. ఈ ఏడాది ఇది తొలి ప్రయోగం కావడంతో విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. (చిత్రం) ప్రయోగవేదికకు తరలిస్తున్న రాకెట్ (ఇన్‌సెట్‌లో) ఉపగ్రహ ఊహాచిత్రం