జంట నగరాలలో పదేళ్ళ క్రితంవరకు కూడా హోలీ వస్తోందంటే వారం ముందునుండే ఆ సంరంభం రోడ్లమీద కనబడేది. రంగుల దుకాణాలవద్ద కొనుగోళ్ళు జరిగేవి. కానీ రానురాను ఆ సంరంభం కానరావడం తగ్గిపోతోంది. మరీ ఈ సంవత్సరం అయితే హోలీ రేపు అనగా కూడా రంగుల దుకాణాలవద్ద జనమే కనబడలేదు. హిందూ పండుగలు తగ్గిపోవడం బాధాకరం. పిల్లలకు పరీక్షలు కూడా పండగల మధ్యలో రావడం కూడా ఈ స్థితికి కారణం కావచ్చు.
- మామెడ రాజేంద్రప్రసాద్, హైదరాబాద్
టీచర్ పోస్టుల భర్తీలో పక్షపాతం
టీచర్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అవగాహన రాహిత్యానికి మరియు పక్షపాత ధోరణికి ప్రతీకగా కనిపిస్తున్నాయ. ముఖ్యంగా బీఇడిల తీవ్ర అసంతృప్తికి ప్రభుత్వ వైఖరిలే కారణం. రాజీవ్ విద్యామిషన్ ద్వారా 9,569 పోస్టులు బీఇడిలకు నేరుగా భర్తీకొరకు మంజూరి కాగా ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడికి తలవంచి 70% పోస్టులను ఇన్‌సర్వీస్ ఎస్‌జిటి ఉపాధ్యాయులకు ప్రమోషన్ కోటాక్రింద కేటాయించింది. ఇది అత్యంత గర్హనీయం. ఇది తప్పుడు నిర్ణయం. ఎస్‌జిటి పోస్టులను బీఇడిలకు కేటాయించని ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్‌జిటిలకు కేటాయించడంవల్ల బీఇడి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. విద్య ఉమ్మడి జాబితా అనే విషయం ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం వెంటనే స్పందించి ‘లేఖల’పేరుతో కాలయాపన చేయకుండా బీఇడిలకు 70% ఎస్‌జిటి పోస్టులు రిజర్వుచేయాలి! లేకుంటే వెంటనే ప్రమోషన్ కోటా రద్దుపరచి మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు బీఇడిలకు ఇవ్వాలి.
- బి.చంద్రశేఖర్, వడ్డేపల్లి
పక్కదారి పడుతున్న సబ్సిడీ గ్యాస్!
అధికారుల్లో కొరవడిన చిత్తశుద్ధి పేద ప్రజలకు భారం అవుతోంది. సబ్సిడీ గ్యాస్ ప్రక్కదారి పడుతూ బ్లాక్‌లో దళారులు అందినకాడికి దండుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు సబ్సిడీ గ్యాస్ అందించడంలో విఫలమవుతున్నా రెవెన్యూ, సివిల్ సప్లయ్ విభాగాలతోపాటు విజిలెన్స్‌శాఖ తగిన చర్యలు తీసుకోవడంలేదు. ఇప్పటికైనా ప్రజలకు సక్రమంగా సబ్సిడీ గ్యాస్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
- శృంగారం ప్రసాద్, శ్రీకాకుళం