రొసెయు (డొమినికా), ఏప్రిల్ 24: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా రొసెయులోని విండ్సర్ పార్క్‌లో జరుగుతున్న చివరి టెస్టులో వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ తొలి రోజు మెరుపులు మెరిపించాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్ ఆడుతున్న తొలి డొమినికా ఆటగాడిగా సంబరాలు జరుపుకుంటున్న షిల్లింగ్‌ఫోర్డ్ మొదటి రోజే ఏకంగా నలుగురు ఆసీస్ బ్యాట్స్‌మన్లను పెవిలియన్‌కు చేర్చి ఆ సంతోషాన్ని రెట్టింపు చేసుకున్నాడు. షిల్లింగ్‌ఫోర్డ్ (4/77)తో పాటు విండీస్ కెప్టెన్ డారెన్ సమీ, కెమర్ రోచ్, రవి రాంపాల్ ఒక్కో వికెట్ సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది. టాస్ గెలిచి తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ ఎడ్ కోవన్ (1) రెండో ఓవర్‌లో రవి రాంపాల్ వేసిన బంతిని ఎదుర్కోబోయి లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగడంతో కంగారూలు ఒక్క పరుగు వద్దే తొలి వికెట్‌ను చేజార్చుకున్నారు. ఈ తరుణంలో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ కొద్దిసేపు విండీస్ బౌలర్లను ప్రతిఘటించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే రెండో వికెట్‌కు వీరు 83 పరుగులు జోడించిన తర్వాత వాట్సన్ (41) సమీ బౌలింగ్‌లో నర్సింగ్ దేవ్‌నారాయణ్‌కు క్యాచ్ ఇవ్వడంతో వీరి ప్రయత్నాలకు గండి పడింది. ఆ తర్వాత అర్ధ శతకాన్ని పూర్తిచేసుకున్న వార్నర్ (50)తో పాటు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (23), కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (24), మైఖేల్ హస్సీ (10)లను షిల్లింగ్‌ఫోర్డ్ స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు చేర్చాగా, ర్యాన్ హారిస్ (4) కెమర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక కార్ల్‌టన్ బాగ్‌కు దొరికిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 169 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (22), మిఛెల్ స్టార్క్ (24) మరో స్థిమితంగా ఆడుతూ అజేయంగా 43 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు నష్టపోయి 212 పరుగులు సాధించింది.
షిల్లింగ్‌ఫోర్డ్ ధాటికి కంగారూలు కుదేలు
english title:
last test
Date:
Wednesday, April 25, 2012