న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని, అయితే వంటగ్యాస్‌పై కూడా నియంత్రణను ఎత్తివేసే ప్రతిపాదనఏదీ ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం మంగళవారం తెలిజేసింది. ‘డీజిల్ ధరలను మార్కెటే నిర్ణయించడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది’ అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమోనారాయణ్ మీనా రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేసారు.
ప్రస్తుతం పెట్రోలు ధరలు మార్కెట్‌తో ముడిపడి ఉండగా, వంటగ్యాస్, కిరోసిన్, డీజిల్ ధరలనుమాత్రం ప్రభుత్వం నిర్ణయిస్తోంది. దీనివల్ల సబ్సిడీలపై ప్రభుత్వం చేసే ఖర్చులో అధిక భాగం వీటికోసమే వినియోగించాల్సి వస్తోంది. అయితే వంటగ్యాస్ ధరను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణనుంచి తప్పించే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేదని కూడా మంత్రి స్పష్టం చేసారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరల పెరుగుదల, ఫలితంగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ప్రభావంనుంచి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడం కోసమే ప్రభుత్వం డీజిల్ ధరపై నియంత్రణను కొనసాగిస్తోందని నమో నారాయణ్ చెప్పారు.
మధ్యప్రాచ్యంలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగాను, ప్రపంచ ఆర్థిక రంగంలో ఎదురైన సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఈ ఏడాది ప్రారంభంనుంచి పెరుగుతూ వస్తున్నాయి. మన దేశం అధికంగా దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడాయిల్ ధర జనవరిలో బ్యారెల్‌కు 11 డాలర్లు ఉండగా, ఏప్రిల్ మధ్య నాటికి అది 120 డాలర్లకు పెరిగిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం సబ్సిడీలకోసం 43 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, అందులో 40 వేల కోట్ల రూపాయలు పెట్రోలియం ఉత్పత్తులను మార్కెట్ ధరలకన్నా తక్కువకు విక్రయించడం వల్ల వస్తున్న నష్టంకోసం చమురు మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే పరిహారం కోసమే కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం కింద 65 వేల కోట్ల రూపాయలు చెల్లించింది. అందులో జనవరి-మార్చి చివరి త్రైమాసికంలోనే 20 వేల కోట్ల రూపాయలు చెల్లించింది. సబ్సిడీల భారం పెరిగిపోవడం కారణంగా ద్రవ్య లోటు గత ఆర్థిక సంవత్సరం జిడిపిలో 5.9 శాతానికి చేరుకుంది. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అలాగే సబ్సిడీల భారాన్ని ఈ ఆర్థిక సంవత్సరం జిడిపిలో2 శాతానికి, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1.75 శాతానికి కుదించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే చమురు ఉత్పత్తులపై సబ్సిడీల భారాన్ని కొంతమేరకైనా తగ్గించుకోక తప్పదని ప్రభుత్వం భావిస్తోంది.
సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రభుత్వం వంటగ్యాస్‌పై మాత్రం అలాంటి ప్రతిపాదన లేదు రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడి
english title:
diesel prices decontrol
Date:
Wednesday, April 25, 2012