న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక పటిష్టత కోసం ఇన్నాళ్లు వాటి నుంచి పెట్టుబడుల ఉపసంహరణల పేరుతో సమీకరించిన నిధులను తిరిగి అదే సంస్థలకు వెళ్ళేలా ఉన్నాయి. ఈ మేరకు ఓ ప్రతిపాదనను పెట్టుబడుల ఉపసంహరణ శాఖ(డిఒడి) ముందుకుతెచ్చింది. రైట్స్ ఇష్యూ ద్వారా సాగనున్న ఈ ప్రతిపాదన అమలైతే వాటి నుంచి వచ్చే నిధులను ప్రభుత్వ సంస్థల ఆస్తులు పెరిగేందుకు, విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకుగానూ వినియోగించదలిచినట్లు తెలిపింది. వచ్చే నెలలో ఈ ప్రతిపాదనపై ఆర్థిక మంత్రిత్వశాఖలోని కార్యదర్శులతోపాటు పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వరంగ సంస్థలు, పెట్రోలియం, సహజవాయువు విభాగాలకు చెందిన కార్యదర్శులు చర్చించనున్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వరంగ సంస్థల నుంచి రూ.30,000 కోట్ల మేర నిధులను పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా సమీకరించాలని నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం రూ.40,000 కోట్ల నిధుల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేవలం రూ.14,000 కోట్లనే ఖజనాకు తరలించగలిగింది. నిజానికి ప్రభుత్వ ఖర్చులు, సబ్సిడీల భారంతో ఖాళీ అవుతున్న ఖజానాలో ఆయా ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా వచ్చే నిధులను నింపాలని కేంద్రం భావించింది. అయితే తాజా ప్రతిపాదనతో ఆ కోరిక కాస్తా కలగానే మారే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ప్రతిపాదన ఎంతమేరకు కార్యరూపం దాల్చుతుందో వేచిచూడాల్సిందే.
పిఎస్‌యూలలో తిరిగి ప్రభుత్వం పెట్టుబడులు సంస్థల ఆస్తుల పెరుగుదల కోసం డిఒడి ప్రతిపాదన
english title:
funds
Date:
Wednesday, April 25, 2012