Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘సెజ్’ రాజకీయం

$
0
0

దేశ ఆర్థ్ధిక ప్రగతికి దోహదపడుతున్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు (స్పెషల్ ఎకనామిక్ జోన్స్-సెజ్) అధికార, విపక్ష పార్టీల రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తూర్పు భారతంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సెజ్‌లు వివాదానికి గురవుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం వివాదానికి తావులేకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి.
రాజకీయ పార్టీలు, నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం సెజ్‌లను వాడుకుంటున్నాయి. భూ సేకరణపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లోపించడం, పారదర్శకత లేకపోవడం, ప్రభుత్వం ఏ భూమిని ఎక్కడ కేటాయించినా, ఫలాపేక్షతోనే వ్యవహరించిందన్న స్వపక్ష, విపక్ష రాజకీయ నేతల విమర్శల వల్ల పారిశ్రామిక ప్రగతి మందగించే ప్రమాదం ఉంది. దేశంలోనే అత్యధికమైన 115 ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఇందులో 75 సెజ్‌లను కేంద్రం నోటిఫై చేసింది. 35 సెజ్‌లు ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. మరో 5 సెజ్‌ల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఏపిఐఐసి 17, ఏపిఐఐసి సహాయంతో ఆమోదం పొంది నోటిఫై అయినవి 29, సూత్రప్రాయంగా ఆమోదం పొందినవి 7, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో రెండు సెజ్‌లు నోటిఫై కాగా, సూత్రప్రాయంగా ఆమోదం పొందినవి 14 ఉన్నాయి. ప్రైవేట్ డెవలపర్స్ పరిధిలో 25 సెజ్‌లు నోటిఫై అయ్యాయి. వీటి పరిధిలోనే మరో 17 సెజ్‌లకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. మరో నాలుగు సెజ్‌లను పరిశీలించేందుకు కేంద్రం అంగీరించింది. ఏపిఐఐసి పరిధిలో సెజ్‌లకు 31,073.62 ఎకరాలను, ప్రైవేట్ డెవలపర్స్ ఆధీనంలోని సెజ్‌లకు 11,278.84 ఎకరాలను సేకరించాలి. మొత్తం సెజ్‌లకు ఇంతవరకు 42,352.46 ఎకరాలకు, రాష్ట్ర ప్రభుత్వం సెజ్‌ల పేరిట 27,722 ఎకరాలను సేకరించింది.
మొత్తం నోటిఫై అయిన 75 సెజ్‌లలో 32 సెజ్‌లలో వాణిజ్య, పారిశ్రామిక ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2010-11లో 13వేల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు సెజ్‌ల నుంచి ఎగుమతి అయినట్లు గవర్నర్ ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో సెజ్‌లు, ఇతర భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 6.48 లక్షల కోట్ల రూపాయల విలువైన 243 ప్రతిపాదనలపై ఎంఒయులు ఖరారయ్యాయి. గుజరాత్, మహారాష్ట్ర తర్వాత ఆశించిన పెట్టుబడుల్లో 54 శాతం వరకు వచ్చాయి. 2011-12లో 7.33 శాతం వరకు పారిశ్రామిక అభివృద్ధి రేటును ఆంధ్రప్రదేశ్ సాధించేందుకు సెజ్‌లు దోహదపడ్డాయి. సెజ్‌లకు నోడల్ ఏజన్సీగా ఏపిఐఐసి పనిచేస్తోంది. 8,50,022 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని లక్ష్యం పెట్టుకోగా, ఇంతవరకు 97,763 మందికి ఉద్యోగాలు వచ్చాయని సోషియో ఎకనమిక్ సర్వేలో పేర్కొన్నారు. 1,05,447 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఆశించగా, ఇంతవరకు 14,267.43 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఈ సర్వేలో పేర్కొన్నారు. 2008-09లో 3,021 కోట్లు, 2009-10లో 5,554 కోట్లు, 2010-11లో 13,335.69 కోట్ల రూపాయల పెట్టుబడులు సెజ్‌ల్లోకి వచ్చాయని ఈ సర్వే ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 115 సెజ్‌లలో 56 ఐటి రంగానివి. ఇందులో 43 సెజ్‌లను కేంద్రం నోటిఫై చేసింది. నోటిఫై చేసిన మిగతా 32 సెజ్‌లు జౌళి, ఫార్మా, పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలు తదితరమైనవి ఉన్నాయి. నోటిఫై అయిన 43 ఐటి సెజ్‌లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెజ్‌లు 18 ఉన్నాయి. హైదరాబాద్‌లో 15, విజయవాడలో 1, వైజాగ్‌లో రెండు సెజ్‌లను ఏర్పాటు చేశారు. వీటిల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వీటికి 6277.56 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, 44,200 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. బహుళజాతి కంపెనీలు ఐటి సంస్థలను ఏర్పాటు చేయడంతో రాష్ట్ర పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందింది.
కాగా, సెజ్‌ల పేరు చెప్పి భూములను తీసుకున్న కంపెనీలు ఉత్పత్తి పనులను ప్రారంభించకపోవడం, ఇతర పనులకు భూమిని వినియోగించుకోవడం లాంటి విమర్శలు ఉన్నాయి. భూమిని వినియోగించుకోని కంపెనీలు, అవసరమైన దానికంటే ఎక్కువ భూమిని తీసుకున్న కంపెనీల నుంచి మిగిలిన భూమిని స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం గత ఏడాది ప్రాజెక్టులను ప్రారంభించని కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. కాని ఇంతవరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం సరైన వౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, బ్యాంకులు సాంకేతిక కారణాలపై రుణాలను సకాలంలో మంజూరు చేయకపోవడం, రాష్ట్రంలో గత మూడేళ్లుగా నెలకొన్న రాజకీయ అనిశ్చిత స్థితి, సెజ్‌ల్లో ప్రాజెక్టులు నెలకొల్పడానికి వచ్చిన సంస్థల ప్రతినిధులను కోర్టు ఆదేశంతో సిబిఐ విచారించడం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఆందోళనలు, రాజకీయ నాయకత్వ లోపం, విపక్ష పార్టీల అలజడి, అపోహలు, ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు తదితర కారణాలతో సెజ్‌ల భవిష్యత్తుపై కారుమేఘాలు కమ్ముకున్నాయి. మూడేళ్ల వరకు పారిశ్రామిక రంగంలో నెం.1గా రాణిస్తుందని, సెజ్‌ల్లో ప్రథమ స్థానంలో ఉందని పేరున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ అనిశ్చితితో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడుతోంది. కాకినాడ వద్ద పదివేల ఏకరాలకు పైగా ఏర్పాటు చేసిన సెజ్‌లోని భూములను తాము అధికారంలోకి వస్తే తిరిగి రైతులకు ఇచ్చేస్తామని విపక్ష నేత, తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మాగాణి భూములను సెజ్‌ల పేరిట సేకరించడం కూడా లోపభూయిష్ట విధానమే. పరిశ్రమలకు భూములు సేకరించేందుకు, లోపాలకు తావులేకుండా, పారదర్శకతతో భూములను సేకరించేందుకు ఒక రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రణాళికా సంఘం ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలను కోరింది.
సెజ్‌ల ఏర్పాటులో తాజా మార్పులు
సెజ్‌ల ఏర్పాటులో భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. మల్టీప్రొడక్ట్ సెజ్ ఏర్పాటుకు ప్రస్తుతం వెయ్యి హెక్టార్లు అవసరం. కాని ప్రతిపాదించిన మార్గదర్శకాల ప్రకారం 250 హెక్టార్లు సరిపోతుంది. మల్టీ సర్వీసెస్ సెజ్‌లకు వంద హెక్టార్ల బదులు 40 హెక్టార్లు, సెక్టార్ స్పెసిఫిక్ విభాగంలో వంద హెక్టార్లకు బదులు 40 హెక్టార్లను ప్రతిపాదించారు. ఐటి-ఐటిఇఎస్ సెక్టార్లకు ఎప్పటిలాగానే పది హెక్టార్లు, కొత్త సెక్టార్లకు పది హెక్టార్ల స్థలం సేకరిస్తే సెజ్‌గా గుర్తించాలని కేంద్రం ప్రతిపాదించింది. ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే నగరాల్లో ఒక లక్ష చదరపు మీటర్లు బిల్టప్ ప్రదేశం ఉంటే ఐటి సెజ్‌గా గుర్తిస్తారు. అదే కేటగిరీ-బి నగరాల్లో 50 వేల చదరపు మీటర్లు, ఇతర నగరాల్లో 25 వేల చదరపు మీటర్లు బిల్టప్ ఏరియా ఉంటే సెజ్‌గా గుర్తిస్తారు. దేశం మొత్తం మీద 585 సెజ్‌లను ఆమోదిస్తే, 381 సెజ్‌లకు నోటిఫై చేశారు. ఇందులో 75 సెజ్‌లను ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫై చేశారు. దేశం మొత్తం మీద ఇంతవరకు సెజ్‌ల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయి. రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయ. ఏడు లక్షల మందికి ఉపాధి కలిగింది.

దేశ ఆర్థ్ధిక ప్రగతికి దోహదపడుతున్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు
english title: 
sez

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>